Good Bad Ugly: గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రివ్యూ
ABN , Publish Date - Apr 10 , 2025 | 06:12 PM
అజిత్ కుమార్, త్రిష జంటగా నటించిన సినిమా 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. ఎలా ఉందో తెలుసుకుందాం...
గత కొంతకాలంగా తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. అంతేకాదు... గతంలో లేని మాదిరి అతని సినిమాల విడుదల విషయంలోనూ విపరీతమైన జాప్యం జరుగుతోంది. గత యేడాది రావాల్సిన రెండు సినిమాలు 'విడా ముయార్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) కాస్తంత గ్యాప్ తో ఈ యేడాది విడుదల అయ్యాయి. 'విడా ముయార్చి' తమిళంలోనే కాదు... తెలుగులో 'పట్టుదల' పేరుతో వచ్చి పరాజయం పాలైంది. దాంతో అజిత్ అభిమానులంతా... తాజా చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మీదనే పెట్టుకున్నారు. మరి 'మార్క్ ఆంటోనీ' ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఎలా ఉందో తెలుసుకుందాం.
కథేంటంటే..
గ్యాంగ్ స్టర్ అయిన ఎ.కె. (అజిత్ కుమార్) కొన్నేళ్ళుగా జైల్లో ఉంటాడు. అండర్ వరల్డ్ డాన్ అయిన భర్త తమ కోసం అన్ని వదిలేసి, జైల్లో ఉన్నాడనే విషయాన్ని కొడుకు విహాన్ (కార్తికేయ దేవ్)కు తెలియకుండా కాలాన్ని గడుపుతుంది రమ్య (త్రిష). అయితే పద్దెనిమిదో పుట్టిన రోజు సందర్భంగా తండ్రిని చూడాల్సిందే అని విహాన్ పట్టుపట్టడంతో కుటుంబాన్ని కలవడానికి ఎ.కె. జైలు నుండి బయటకు వస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కొందరు గ్యాంగ్ స్టర్స్ ఎ.కె. ఫ్యామిలీని టార్గెట్ చేయడానికి రెడీ అవుతారు. వారి వలలో తన కొడుకు విహాన్ కూడా చిక్కుకున్నాడని తెలిసి ఎ.కె. ఎలా వారి బారి నుండి కొడుకును రక్షించుకున్నాడు? తన పాత కక్షలకు ఎలా ఫుల్ స్టాప్ పెట్టాడు? అనేదే 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కథ.
ఎలా ఉందంటే...
అజిత్ మూవీ అంటే కథ కంటే కథనానికే ప్రాధాన్యం ఉంటుందనేది అందరికీ తెలిసిందే. అజిత్ లాంటి మాస్ హీరోను తెర మీద యాక్షన్ రోల్ లో చూస్తేనే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తాయి. అలాంటి వారి కోసం తీసిన సినిమానే ఇది. కానీ ఫ్యాన్స్ సైతం చికాకుపడేలా దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాను తీశాడు. అసలు ఏం చెప్పి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ను ఒప్పించాడో అర్థం కాదు. తమిళంలోకి నిర్మాతలుగా ఎంటర్ కావాలనే కోరికతోనూ, అజిత్ కుమార్ డేట్స్ దొరకడంతోనూ ఈ సినిమా తీసేశారేమో అనిపిస్తోంది. నిజానికి కథ విని ఉంటే... దర్శకుడు అధిక్ రవిచంద్రన్ ట్రాక్ రికార్డ్ ను తెలుసుకుని ఉంటే... అంత గుడ్డిగా వీళ్ళు ఈ సినిమాను నిర్మించేవాళ్ళు కాదనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు నిర్మించడం వల్ల ఇప్పటి వరకూ కష్టపడి సంపాదించుకున్న గుడ్ విల్ కూడా పోయే ఆస్కారం ఉంది. ఈ సినిమాలో ఊహించని మలుపులేమీ లేవు, అలానే సాధారణ ప్రేక్షకుడిని కట్టిపడేసే సెంటిమెంట్ సీన్స్ కూడా లేవు. కేవలం అజిత్ అభిమానులను ఆకట్టుకోవాలనే తపనతో దర్శకుడు ఈ సినిమా తీసినట్టు అనిపిస్తుంది. పరమ రొటీన్ యాక్షన్ డ్రామా కావడంతో ప్రేక్షకులు విపరీతమైన బోర్ ఫీల్ అవుతారు. అజిత్ తో దర్శకుడు వేయించిన వేషాలు, చేయించిన పనులు కూడా చికాకును తెప్పిస్తాయి. ఈ సినిమా నిర్మాణం కోసం అధిక్ రవిచంద్రన్ చాలానే టైమ్ తీసుకున్నారుడు. ఆ రకంగా చూసినప్పుడు ఇంకాస్తంత బెటర్ గా ఈ కథను ప్రెజెంట్ చేయొచ్చు. కానీ అలాంటి ప్రయత్నం ఏదీ చేయలేదు. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న కొడుకును బయటపడేయడానికి ఓ తండ్రి పడే తపన చూస్తే... ఇటీవల ఓ బాలీవుడ్ హీరో కు సంబంధించిన సంఘటన గుర్తొస్తుంది. అలా కొన్ని కాంటెపరరీ ఇష్యూస్ ను కూడా ఇందులో టచ్ చేశారు. కాకపోతే... తమిళ సినిమాలను ఎక్కువగా రిఫర్ చేయడంతో తమిళ వాసనలు బాగా వేశాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణులు...
ముందు చెప్పినట్టుగా అజిత్ ఈ మధ్య కాలంలో ఇంత వేరియేషన్స్ ఏ సినిమాలోనూ చూపించలేదు. అభిమానులను మెప్పించాలనే లక్ష్యంతో దర్శకుడు ఏం చెబితే అది గుడ్డిగా చేశాడనిపిస్తోంది. కానీ ఏం లాభం... అతనికే కాదు... అభిమానులూ ఇది గొప్పగా చెప్పుకునే సినిమా కాదు! త్రిష పాత్ర ఓకే. తెలుగు నటుడు సునీల్, స్నేహ భర్త ప్రసన్నను ఆ మాట కొస్తే ఎవరినీ దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదు. ఇతర ప్రధాన పాత్రలను ప్రభు, టినూ ఆనంద్, కార్తీక్ దేవ్, ప్రియా ప్రకాశ్ వారియర్ తదితరులు పోషించారు. అర్జున్ దాస్ తో డ్యుయల్ రోల్ చేయించారు. అతని నటన భరించడం కష్టమే.
జీవీ ప్రకాశ్ కుమార్ మాస్ ఆడియెన్స్ ను మెప్పించేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. అభినందన్ రామానుజమ్ సినిమాటోగ్రఫీ ఓకే. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ మరింత క్రిస్ప్ గా చేసి ఉండాల్సింది. బట్ అనవసరమైన, అతిగా అనిపించే సీన్స్ ను కట్ చేస్తే... సినిమా సగానికి పైగా ఎగిరిపోతుందేమో! మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన మరో సినిమా 'జాట్' కూడా ఇదే రోజున హిందీలో విడుదలైంది. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' తమిళంతో పాటు తెలుగులోనూ వచ్చింది. ఎంత ఇమేజ్ ఉన్న హీరోతో కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసినా... కథ లేకపోతే... దాని ఫలితం చేదుగానే ఉంటుందని ఈ సినిమాలు నిరూపిస్తున్నాయి. మరి మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాల ఫలితాల నుండి పాఠాలు నేర్చుకుంటారేమో చూడాలి.
ట్యాగ్ లైన్: నో గుడ్ ఓన్లీ బ్యాడ్ అండ్ అగ్లీ
రేటింగ్ : 2 / 5