Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ
ABN , Publish Date - Jan 10 , 2025 | 09:49 AM
Game Changer Review: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుండి సోలోగా దాదాపు 5 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా ‘గేమ్ చేంజర్’. లార్జర్ దేన్ లైఫ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. సంక్రాంతి స్పెషల్‌గా శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే..
మూవీ పేరు: ‘గేమ్ చేంజర్’
విడుదల తేది: 10, జనవరి 2025
నటీనటులు: రామ్ చరణ్, కియారా అద్వాణీ, అంజలి, ఎస్. జె. సూర్య, సముద్రఖని, శ్రీకాంత్, రాజీవ్ కనకాల, జయరామ్, నరేష్ తదితరులు
కథ: కార్తీక్ సుబ్బరాజ్
సినిమాటోగ్రఫీ: తిరు
ఎడిటింగ్: సమీర్ మహ్మద్, రుబెన్
సంగీతం: ఎస్. థమన్
నిర్మాత: దిల్ రాజు, శిరీష్
స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ఎస్. శంకర్
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ రేంజ్‌కి చేరుకున్నాడు. ఆ సినిమా తర్వాత చరణ్ ఏం సినిమా చేస్తాడో అని అంతా అనుకుంటున్న సమయంలో లార్జర్ దేన్ లైఫ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన శంకర్‌తో ‘గేమ్ చేంజర్’ సినిమా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలాగే శంకర్‌కు కూడా ఇదే తొలి తెలుగు సినిమా. కాకపోతే.. ఈ సినిమా అనుకున్న తర్వాత, కొంతమేర షూటింగ్ పూర్తయిన తర్వాత శంకర్‌కు ‘ఇండియన్ 2’ కష్టాలు రావడంతో రెండు సినిమాలపై ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో వచ్చిన ‘ఇండియన్ 2’ సినిమా భారీ పరాజయాన్ని చవిచూడటంతో.. ‘గేమ్ చేంజర్’పై హైప్ డౌన్ అవుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే చిత్ర ప్రమోషన్స్ మొదలయ్యాయో, పాటలు, ట్రైలర్ విడుదలయ్యాయో.. అప్పటి వరకు ఈ సినిమాపై ఉన్న ఒపెనియన్స్ అన్నీ మారిపోయాయి. ముఖ్యంగా ట్రైలర్ తర్వాత సినిమాపై అంచనాలు మొదలవుతూ వచ్చాయి. మరోవైపు క్యాలిక్యులేషన్ వేసుకుని మరీ సినిమాలు చేసే దిల్ రాజు.. ఫస్ట్ టైమ్ ఈ సినిమా కోసం కోట్లు పెడుతుండటం కూడా సినిమాపై క్రేజ్ ఏర్పడేలా చేసింది. ఈ మధ్య టాలీవుడ్‌లో మొదలైన ఫ్యాన్స్ వార్‌తో.. మెగాభిమానులకు ఈ సినిమా చాలా ప్రెస్ట్రీజీయస్‌గా మారింది. ఇంకా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమాపై ఎక్కడాలేని అంచనాలను పెంచేసింది. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? బాక్సాఫీస్ దగ్గర రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’గా నిలబడే కంటెంట్ ఇందులో ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
‘గేమ్ చేంజర్’ స్టోరీ లైన్:
ఉత్తర ప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న రామ్ నందన్ (రామ్ చరణ్), తన ప్రియురాలు దీపిక (కియారా అద్వాణీ) చెప్పిన మాట కోసం ప్రయత్నించి ఐఏఎస్‌గా సెలక్ట్ అయ్యి, తన సొంత జిల్లా వైజాగ్‌కు కలెక్టర్‌గా వస్తాడు. వైజాగ్ వచ్చీ రాగానే అక్కడ ఉన్న రౌడీ షీటర్స్‌కి, రాజకీయ నాయకుల సహకారంతో దందాలు చేసే వాళ్లకి వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్‌తో మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి (ఎస్.జె. సూర్య)కి, రామ్ నందన్‌కి మధ్య వార్ మొదలవుతుంది. మరోవైపు తన తండ్రి సీఎం సత్యమూర్తి (శ్రీకాంత్) సీట్ కోసం మోపిదేవి చేయని ప్రయత్నాలు ఉండవు. అలాంటి వాడికి తలనొప్పిగా మారిన రామ్ నందన్‌ని పొలిటికల్ పవర్ ఉపయోగించి మోపిదేవి ఏం చేశాడు? మోపిదేవి ప్రయత్నాలను రామ్ నందన్ ఎలా తిప్పికొట్టాడు? ఈ క్రమంలో సీఎం సత్యమూర్తి ఎలా చనిపోయాడు? ఆయన చనిపోతూ తన కొడుకుని కాదని.. రామ్ నందన్‌కి సీఎం సత్యమూర్తి బాధ్యతలను ఎందుకు అప్పగించాడు? అసలు అప్పన్న (రామ్ చరణ్), పార్వతి (అంజలి) ఎవరు? రామ్ నందన్ కథలోకి వారెలా వచ్చారు? అనేది తెలియాలంటే.. థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా చూడాల్సిందే.
నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:
యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారిగా.. కాలేజ్‌లో యాంగ్రీ మ్యాన్‌గా, ఉద్యమం కోసం పరితపించే అప్పన్నగా.. మొత్తంగా మూడు రకాల పాత్రలలో రామ్ చరణ్ ఇందులో కనిపిస్తాడు. ప్రతి పాత్రకు కూడా ఆయన ప్రాణం పెట్టేశాడు. మరీ ముఖ్యంగా అప్పన్న పాత్రకు ఓ స్పెషాలిటీ ఉంటుంది. ‘రంగస్థలం’ని గుర్తు చేసే ఆ స్పెషాలిటీనే సినిమాను ఓ మలుపు తిప్పుతుంది. అప్పన్న పాత్రను తన నటనతో ఎక్కడికో తీసుకెళ్లాడు చరణ్. సెకండాఫ్‌లో తన తల్లి త్యాగం తర్వాత రామ్ చరణ్ యాక్టింగ్ అందరితో కంటతడి పెట్టిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్సుల్లో తనదైన మార్క్ ప్రదర్శించిన చరణ్.. టోటల్‌గా ఫ్యాన్స్‌కి సంక్రాంతి ట్రీట్ ఇచ్చేశాడు. చరణ్ తర్వాత ఈ సినిమాకు మరో పిల్లర్ ఎస్.జె. సూర్య. ‘సరిపోదా శనివారం’ పాత్ర కంటిన్యూటీ అన్నట్లుగా విలనిజంలోనే నవ్వులు పూయించాడు. సీఎం సీట్ కోసం తాపత్రయపడే విధానం, అది అందినట్టే అంది చేజారిపోవడం వంటి సన్నివేశాల్లోనూ, రామ్ నందన్‌తో తలపడే సందర్భాల్లోనూ సూర్య మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు హై ఇచ్చాడు. పార్వతిగా అంజలికి చాలా మంచి పాత్ర పడింది. స్టోరీని టర్న్ చేసే పాత్ర ఆమెది. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రను అంజలి ఇందులో చేసింది. రెండింటికీ ఆమె న్యాయం చేసింది. కియారా ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలకు, పాటలకు పరిమితమైంది. ఆమె కనిపించినంత సేపూ నటనతోనూ, గ్లామర్‌తోనూ కట్టిపడేసింది. శ్రీకాంత్, సముద్రఖని, రాజీవ్ కనకాల వంటి వారంతా తమ అనుభవాన్ని చాటుకున్నారు. సునీల్‌కు కాస్త ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికింది. నరేష్, వెన్నెల కిశోర్ రెండు సీన్లకు పరిమితమయ్యారు. ఇంకా భారీ తారాగణం ఉన్నా.. ఒకటి రెండు సీన్లకే వారు పరిమితమయ్యారు.
సాంకేతికంగా ఈ సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉంది. పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. ముఖ్యంగా పాటల కోసం వేసిన సెట్స్ కిక్ ఇస్తాయి. దిల్ రాజు ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదనేది ప్రతి ఫేమ్‌లో కనిపిస్తుంది. ప్రొడక్షన్ డిజైనింగ్, సినిమాటోగ్రఫీ, సంగీతం వేటికవే అన్నట్లుగా ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా థమన్ తాండవమాడేశాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. పొలిటికల్ డైలాగ్స్ బాగున్నాయి. రెండు పార్ట్‌లు తీసే స్కోప్ ఉన్నా కూడా, ఒక్క పార్ట్‌కే అందునా 2 గంటల 45 నిమిషాలకే ఈ సినిమాను పరిమితం చేశాడంటే.. ఎడిటర్ ఎంతగా డ్యూటీ చేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఇలా సాంకేతిక నిపుణులందరూ వారి ప్రతిభను కనబరిచారు. ఇక శంకర్ విషయానికి వస్తే.. కొన్నాళ్లుగా ఆయనపై ఎటువంటి వార్తలు వైరల్ అవుతున్నాయో తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత ఆ వార్తలకు బ్రేక్ పడుతుంది. హి ఈజ్ బ్యాక్ అనేలా ఈ సినిమాతో శంకర్ నిరూపించుకున్నాడు. ఆయన దర్శకత్వ ప్రతిభ ఏంటో ఈ సినిమాతో అందరికీ మరోసారి తెలుస్తుంది.
విశ్లేషణ:
ఈ సినిమా టైటిల్ కార్డ్స్ పడే ముందే ‘ఈ సినిమాలోని పాత్రలు ఎవరినీ ఉద్దేశించినవి కావు. ఈ పాత్రలు బతికున్నా లేదా చనిపోయిన వారిని ఎవరినైనా ప్రభావితం చేసేవిగా ఉంటే అది యాదృచ్ఛికం మాత్రమే’ అని ప్రకటించినా.. సినిమాలోని చాలా సీన్లు ఏపీలోని గత ప్రభుత్వానికి రిలేటెడ్‌గా ఉన్నాయి. అలాగే ఏపీలోని జనసేన పార్టీ సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఇందులో కొన్ని సన్నివేశాలు జోడించినట్లుగా అనిపిస్తుంది. ఇంకా తెలుగు దేశం పార్టీ గుర్తును కూడా ఇందులో బాగా హైలెట్ చేశారు. ఒక ఐఏఎస్ అధికారికి, అవినీతిపరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే వార్‌గా ఈ సినిమా అనిపించినా.. మధ్యలో ఎన్నో విషయాలను ఈ సినిమా ద్వారా చెప్పి శంకర్ తన మార్క్ ప్రదర్శించాడు. కమర్షియల్ ఫార్మెట్‌లో తీసుకెళుతూనే.. కలెక్టర్‌కు ఉన్న అధికారాలు ఏంటి? వాటితో ఆయన ఏమేం చేయగలడు? వంటి మంచి సందేశాత్మక అంశాలను ఇందులో జోడించాడు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారికి, రాజకీయ నాయకుడికి ఉన్న అధికారాల గురించి చెప్పే సీన్‌లో, క్లైమాక్స్‌లో ప్రభుత్వాలు ఎలా పనిచేయాలనేది రామ్ చరణ్‌తో చెప్పించే సీన్‌లో శంకర్ మార్క్ ప్రస్ఫుటంగా కనిపించింది. ఇక హీరో ఎంట్రీ సీనే హెలికాఫ్టర్ షాట్, ఆ తర్వాత వచ్చే ‘రా మచ్చా’ సాంగ్‌తో ఫ్యాన్స్‌కి పిచ్చ హై ఇచ్చేశాడు. ‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఒక్క రోజు సీఎంలా, ఇందులో ఎస్.జె. సూర్యని ఒక్క గంట సీఎంని చేసి.. అతనితో హీరో ఆడుకునే సన్నివేశాలు ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తాయి. ఇంటర్వెల్‌తో పెద్ద ట్విస్ట్ ఇచ్చిన దర్శకుడు.. సెకండాఫ్‌లో అసలు ఆలస్యం చేయకుండా ఫ్లాష్ బ్యాక్‌కి తీసుకెళ్లడం బాగుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనంతరం సీఎం పదవి కోసం సూర్య వేసే ఎత్తుగడ, దానిని చిత్తు చేసే రామ్ నందన్ నైపుణ్యం అన్నీ కూడా హైలెట్ అనేలా ఉన్నాయి. ఆ తర్వాత వెంటనే ఎన్నికలు రావడం, ఎన్నికల అధికారిగా రామ్ చరణ్ రావడం, ఆ తర్వాత జరిగే కొన్ని సీన్లు అన్‌ప్రిడక్టబుల్ అనేలా ఉంటాయి. అదే సమయంలో వచ్చే పార్వతి ఎపిసోడ్ రామ్ చరణ్‌లోని నటనను బయటికి తీసింది. ఈ సీన్ చూసే సుకుమార్.. ఈసారి నేషనల్ అవార్డ్ పక్కా అని చెప్పుండొచ్చు. అప్పన్న ఎపిసోడ్ ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్. ఓవరాల్‌గా అయితే ఏపీ ప్రజలకు, ప్రేక్షకులకు ఈ సినిమా చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ఉన్న లవ్ స్టోరీ రొటీన్ అనే ఫీల్ మినహా.. శంకర్ మార్క్‌తో వచ్చిన కమర్షియల్ పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్ ఇది. ‘నానా హైరానా’ సాంగ్ ఇందులో లేదు కానీ ‘రా మచ్చా’, ‘డోప్’, ‘జరగండి’, ‘కొండదేవర’, ‘అరుగు మీద’ సాంగ్స్ అన్నీ కూడా చక్కగా పిక్చరైజ్ చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే.. ‘గేమ్ చేంజర్’ ఈ మధ్య ఓ ఈవెంట్‌లో దిల్ రాజు చెప్పినట్లుగా సంక్రాంతికి సక్సెస్ ఇరుక్కు.. అంతే.