Gandhi Tatha Chettu Review: సుకుమార్‌ కుమార్తె నటించిన సినిమా ఎలా ఉందంటే

ABN , Publish Date - Jan 23 , 2025 | 10:55 PM

దర్శకుడు సుకుమార్ కూతురు  సుకృతి వేణి కీలకపాత్రలో పద్మావతి మల్లాది దర్శకత్వంలో వచ్చిన 'గాంధీ తాత చెట్టు' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. చక్కని సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందంటే.. 

సినిమా రివ్యూ: గాంధీ తాత చెట్టు (Gandhi Tatha Chettu Review)
విడుదల తేది: 24–01–2025
నటీనటులు: సుకృతి వేణి (Sukruti Veni) , ఆనంద్‌ చక్రపాణి, రఘురామ్‌, రాగ్‌ మయూర్‌, భాను ప్రకాష్‌, నేహాల్‌ ఆనంద్‌ కుంకుమ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: శ్రీజిత్‌ చెర్వుపల్లి, విశ్వ దేవబత్తుల
సంగీతం: రీ
ఎడిటింగ్‌: హరిశంకర్‌ టీఎన్‌
సమర్పణ: తబితా సుకుమార్‌ (tabhitha Sukumar)
నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్‌, నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, శేష సింధురావు
రచన–దర్శకత్వం: పద్మావతి మల్లాది (Padmavathi Malladi)

దర్శకుడు సుకుమార్‌ కూతురు సుకృతివేణి నటిగా పరిచయమైన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన చిన్న బడ్జెట్‌ చిత్రమిది. సుకుమార్‌ కూతురు కీలక పాత్రధారి కావడం, తబిత సుకుమార్‌ సమర్పణలో ఈ సినిమా రావడంతో   మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. అంతే కాదు విడుదలకు ముందే అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రం ఎన్నో అవార్డులు అందుకుంది. గాంధీ తాత ఆశయాల నేపథ్యంలో ఒక చెట్టుకు, మనిషికి ముడిపెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.


కథ:
నిజామాబాద్‌ జిల్లా అడ్లూర్‌లో అనే పల్లె రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి-Anand Chakrapani)). అనే పెద్దాయన ఉంటాడు. ఆయనకు  ఓ పది ఎకరాల పొలం ఉంటుంది. తన తండ్రి గాంధీ గురించి చెప్పిన మాటలకు ప్రభావితమై గాంధీ మహాత్ముడి గుర్తుగా తన తండ్రితో కలిసి పొలంలో ఓ చెట్టు నాటుతాడు రామచంద్రయ్య. ఎప్పుడు ఆ చెట్టు దగ్గరే గడుపుతాడు. చెట్టుతో మాట్లాడుతుంటాడు. అందులోనే తన ప్రాణం ఉందని చెబుతుంటాడు. గాంధీ సిద్థాంతాల్ని అనుసరించే ఆయన.. తన మనవరాలికి గాంధీ (సుకృతివేణి) అని పేరు పెడతాడు. గాంధీ తత్వాన్ని బోధిస్తూ పెంచుతాడు. చెరుకు పంట ఆధారిత గ్రామం అయిన అక్కడ ఉన్న చెరుకు ఫాక్టరీ మూత పడడంతో ప్రజలంతా ఇబ్బంది పడతారు. ఆ సమస్యల నుంచి గట్టెక్కడానికి గ్రామ జనం ఏం చేశారు. నిజాయతీకి నిలువెత్తు రూపం అయిన రామయ్యకు ఊరిలోనూ, కుటుంబంలోనూ చోటు చేసుకున్న పరిణామాల కారణంగా  ఏం జరిగింది? తన తాత ప్రాణంగా భావించే చెట్టును, కష్టాల్లో ఉన్న ఊరిని కాపాడేందుకు గాంధీ ఏం చేసింది. తాతా బోధించిన గాంధీ సిద్దాంతాలతో తను ఏం చేసింది? అన్నది తెరపైనే చూడాలి.  (Gandhi Tatha Chettu)


GTC.jpg

విశ్లేషణ: (Gandhi Tatha Chettu Review)
సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పుష్పలో గొడ్డలితో అడవిని నరుకుతుంటే, ఇలాంటి పాత్రతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అని ఎంతోమంది ప్రశ్నించారు. అయితే ఆయన కూతురు నటించిన ‘గాంధీ తాత చెట్టు’ పూర్తి భిన్నంగా ఉంది. ఎంత వ్యత్యాసం అంటే గొడ్డలి వేటు చెట్టుపై పడినప్పుడు ఆ చెట్టు పడే బాధ, దాన్ని రక్తం కారడం కళ్లకు కడుతూ, చెట్టుకూ ప్రాణం ఉందని చూపిస్తూ ప్రేక్షకుల్ని కదిలించింది ఈ చిత్రం. గాంధీ అనే అమ్మాయి, ఓ వేప చెట్టు, దాన్ని నాటిన తాత చుట్టూ నడిచే కథ ఇది. దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి గాంధీజీ ఉప్పుసత్యాగ్రహం చేసినట్లే, తన ఊరి కోసం, తన తాత నాటిన చెట్టు కోసం ఓ చిన్నారి చేసిన చెరుకు(బెల్లం) సత్యాగ్రహమే ఈ సినిమా. రామచంద్రయ్య, ఆయన కుటుంబం, ఆదర్శాల్ని అనుసరించే మనవరాలు గాంధీ, ఊరు, చెట్టుని పరిచయం చేస్తూ ప్రారంభంలోనే కథలో లీనం చేశారు డైరెక్టర్‌ పద్మావతి. తనికెళ్ల భరణి వాయిస్‌ ఓవర్‌తో గాంధీ.. తాత.. చెట్టు వెనకున్న విషయాన్ని సింపుల్‌గా చెప్పారు. కథ మంచి గానే అందుకున్నా.. స్పీడైన  స్ర్కీన్‌ప్లేకి అలవాటు పడిన ఈతరం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు. రామచంద్రయ్య కొడుకు పట్టణానికి వెళ్లి స్థిరపడాలనుకోవడం, అదే సమయంలో రైతుల అవసరాల్ని, వాళ్ల  కష్టాల్ని తనకు అనువుగా మార్చుకుని పంటపొలాల్ని కొని అక్కడ కెమికల్‌ ఫ్యాక్టరీ పెట్టి ఉపాది కల్పిస్తామంటూ మినిస్టర్‌ ప్రతినిధి సతీష్‌(రాగ్‌ మయూర్‌) రావడంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. తన పంట పొలాల్ని అమ్మనని మొండికేసిన రామచంద్రయ్యకీ, సతీష్‌కి మధ్‌య సాగే సంభాషణలు, సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. రామచంద్రయ నోట..


‘ఏదైనా ప్రేమతో గెలవాలంటే కాస్త టైం పడుతుంది’,
‘చెడుని దులిపేయాలి...మంచిని పట్టుకోవాలి',
పంట పండే స్థలాన్ని అమ్మడం అంటే కన్న తల్లిని వ్యభిచారానికి పంపించినట్లే’ అని పలికిన సంభాషణలు ఆలోచింపజేస్త్తాయి.
అలాగే తాత మరణం తర్వాత చెట్టు మాట్లాడటం..
'రామ అప్పుడే వెళ్లిపోయావా.. నీతో నన్ను తీసుకునిపోరాదా?  
నా వేళ్లు భూమిలో నీకోసం దేవులాడుతున్నాయి...
నా కన్నా నీకు దేవుడు ఎక్కువరా.. ఇంత తొందరగా వెళ్లిపోయావ్‌’ అంటూ తనికెళ్ల భరణి వాయిస్‌తో వచ్చిన చెట్టు మాటలు హృదయాన్ని హత్తుకుంటాయి. తెలియకుండానే కళ్లు చమర్చుతాయి.

ఫస్టాఫ్‌తో  పోలిస్తే సెకెండాఫ్‌ సినిమా మరింత ఆసక్తికరంగా సాగుతుంది. గాంధీ (సుకృతి) స్వయంగా చక్కెర సత్యాగ్రహం చేయాలని బలంగా అనుకోవడం, ఆ క్రమంలో పండిన డ్రామా, పెళ్లి చేయాలనుకున్న పేరెంట్స్‌ ప్రయత్నాల్ని శాంతియుతంగా అడ్డుకునేందుకు అప్పటికప్పుడు గాంధీ తీసుకున్న నిర్ణయం అలరిస్తాయి. ఇదంతా తెరపై చాలా సహజత్వంగా ఉంటుంది. క్లైమాక్స్‌కు వచ్చేసరికి డ్రామాగా మారిపోతుంది. 


Gandhi.jpg

నటీనటుల పనితీరు(Gandhi Tatha Chettu).. గాంధీ పాత్రకు పూర్తి న్యాయం చేసింది సుకృతి. కోపం తెలియని అమ్మాయిగా, ఎవరికీ చెడు తలపెట్టాలనే ఆలోచన లేని యువతిగా, అమాయకంగా కనిపిస్తూనే సందర్భానుసారంగా తెలివితేటల్ని బయటకు తీసే గాంధీగా సుకృతి వంద మార్కులు తెచ్చుకుంది. ఆనంద్‌ చక్రపాణి అనుభవం సినిమాకు ఉపయోగపడింది. స్ర్కీన్‌ మీద కనిపించే ప్రతి క్యారెక్టర్‌ నేచురల్‌గా ఉన్నాయి.  గాంధీ పాత్ర  కోసం నిజంగానే గుండు చేయించుకుని నటించింది. తెలంగాణ యాసలో సంభాషణలు పలికిన తీరు బాగుంది.  గాంధీ తల్లిదండ్రులుగా నటించిన రఘురాం, లావణ్య,  మంత్రి పీఎగా సతీష్‌ పాత్రలో రాగ్‌ మయూర్‌ ఒదిగిపోయారు. గాంధీ స్నేహితులుగా కనిపించిన ఇద్దరు కుర్రాళ్లు చక్కగా నటించారు. చెట్టు పాత్రకి తనికెళ్ల భరణి వాయిస్‌ యాప్ట్‌ అయింది. భావోద్వేగాన్ని కలిగించింది. ఇక సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. రీ స్వరపరిచిన పాటలు, ఆర్‌ఆర్‌ సినిమాకు ప్లస్‌ అయ్యాయి. విశ్వ దేవబత్తుల–శ్రీజిత చెర్వుపల్లి కెమెరా పనితనం సినిమాకి బలం.


దర్శకురాలిగా పద్మావతి మల్లాదికి  తొలి సినిమా ఇది. అనుభవలేమి అనేది ఎక్కడా కనిపించలేదు. తడబాటు లేకుండా మలిచారు. అయితే కథనంపై ఇంకాస్త వర్క్‌ చేసుంటే గ్రిప్పింగ్‌గా ఉండేది. ఈ రోజుల్లో సింక్‌ సౌండ్‌తో సినిమా తీయడం సాహసమే. తను ఎంచుకున్న కథ, తెరకెక్కించిన తీరు చూస్తే సినిమా పట్ల ఆమెకున్న ప్యాషన్‌ తెలుస్తుంది. అలాగే ప్యాషన్‌, అభిరుచి గల నిర్మాతలు దొరకడం ఈ సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. కమర్షియల్‌ సినిమాలు, పాటలు. ఫైట్‌లు, గ్లామర్‌కు అలవాటు పడ్డ ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతవరకూ కనెక్ట్‌ అవుతుందనేది పక్కనపెడితే జాతిపిత గాంధీ తత్వంతో చక్కని సందేశం ఇచ్చారు. హిస్టరీని, దేశం కోసం పోరాటం చేసిన ప్రముఖులను మరచిపోతున్న తరుణంలో ఇలాంటి ఆశయాలు, ఆదర్శల గురించి తెలిపే చిత్రాలు నేటి యువతకు అవసరం అని చెప్పవచ్చు.

ట్యాగ్‌లైన్‌: ఇలాంటి సినిమా సంవత్సరానికి ఒకటైనా రావాలి!!

Updated Date - Jan 25 , 2025 | 04:43 PM