Ramam Raghavam Review: ధనరాజ్ దర్శకత్వంలో 'రామం రాఘవం' మెప్పించిందా..

ABN , Publish Date - Feb 20 , 2025 | 08:05 PM

కమెడియన్ గా చిత్రసీమలోకి అడుగుపెట్టిన ధనరాజ్(Dhanraj)..'జబర్దస్త్'తో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో కొన్ని సినిమాలలో హీరోగానూ నటించాడు. అలానే ఒకటి రెండు సినిమాలను మిత్రులతో కలిసి ప్రొడ్యూస్ చేశాడు. కానీ ఫస్ట్ టైమ్ 'రామం రాఘవం' (Ramam Raghavam) మూవీలో తానే హీరోగా నటించి, దర్శకత్వం వహించాడు.

సినిమా రివ్యూ: రామం రాఘవం (Ramam Raghavam Review)

విడుదల తేదీ: 21.02.2025
నటీనటులు: ధనరాజ్, సముతిరఖని, ప్రమోదిని, హరీశ్‌ ఉత్తమన్, సునీల్, సత్య, మోక్ష, పృథ్వీ, శ్రీనివాసరెడ్డి, వాసు ఇంటూరి, రాకెట్ రాఘవ తదితరులు
సాంకేతిక నిపుణులు:


సినిమాటోగ్రఫీ: దుర్గాప్రసాద్ కొల్లి

సంగీతం: అరుణ్ చిలువేరు
ఎడిటర్: మార్తండ్ కె వెంకటేశ్
రచన: శివప్రసాద్ యానాల
నిర్మాత: పృథ్వీ  పోలవరపు
దర్శకత్వం: ధనరాజ్ (Dhanraj)

 
కమెడియన్ గా చిత్రసీమలోకి అడుగుపెట్టిన ధనరాజ్(Dhanraj)..'జబర్దస్త్'తో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో కొన్ని సినిమాలలో హీరోగానూ నటించాడు. అలానే ఒకటి రెండు సినిమాలను మిత్రులతో కలిసి ప్రొడ్యూస్ చేశాడు. కానీ ఫస్ట్ టైమ్ 'రామం రాఘవం' (Ramam Raghavam) మూవీలో తానే హీరోగా నటించి, దర్శకత్వం వహించాడు. ఇది తెలుగుతో పాటు తమిళంలోనూ ఫిబ్రవరి 21న విడుదల అవుతోంది. (Ramam Raghavam Review)


కథ: (Ramam Raghavam Review)
ప్రభుత్వ ఉద్యోగి, నిజాయితీకి మారు పేరైన రామం (సముతిరఖని Samuthirakhani), అతని భార్య కమల (వినోదిని) దంపతుల  ఏకైక కుమారుడు రాఘవ (ధనరాజ్).  అల్లారు ముద్దుగా కొడుకును పెంచడమే ఆ తల్లిదండ్రులు చేసిన తప్పు అన్నట్టుగా రాఘవ చెడు వ్యసనాలకు బానిస అవుతాడు. తండ్రి  నిజాయితీని సైతం తట్టుకోలేక అతన్ని చేతకాని వాడిగా భావిస్తాడు. స్నేహితుడు అంజి (సత్య Satya)తో కలిసి ఫుడ్ కోర్ట్ పెడతానంటూ తండ్రి దగ్గర తీసుకున్న ఐదు లక్షల రూపాయలను సైతం రాఘవ క్రికెట్ బెట్టింగ్ లో పోగొట్టుకుంటాడు. పెట్రోల్ బంకులో పనికి చేరి... అక్కడా ఫ్రాడ్ చేయడంతో మరిన్ని కష్టాల్లో కూరుకుపోతాడు. చివరకు తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆయన్నీ మోసం చేస్తాడు. కొడుకు రోజు రోజుకు దిగజారిపోతున్నాడని గుర్తించినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి అతని పేరెంట్స్ వెళ్ళిపోతారు. ఇలాంటి సమయంలో ఏకంగా తండ్రినే హతమార్చాలని రాఘవ, దేవా (హరీశ్‌ ఉత్తమన్ Harish Uthaman)తో కలిసి ప్లాన్ చేస్తాడు. ఇలాంటి దారుణమైన ప్లాన్ వేసిన రాఘవ దానిని అమలు చేయగలిగాడా? రాఘవ కుట్రకు దేవా సహకరించాడా? తండ్రినే హతమార్చాలనుకున్న రాఘవలో అసలు మార్పు అనేది వచ్చిందా!? అనేదే మిగతా కథ.



విశ్లేషణ..  (Ramam Raghavam Review)
నిజానికి 'రామం రాఘవం' ఈ నెల 14న విడుదల కావాల్సింది కానీ దీనిని 28కి వాయిదా వేశారు. అయితే... దాదాపు ఇదే పాయింట్ తో తెరకెక్కిన 'బాపు'(Baapu)  సినిమా 21న వస్తుండటం వల్ల కావచ్చు... 'రామం రాఘవం'ను సైతం మేకర్స్ 21నే విడుదల చేస్తున్నారు. చెడు వ్యసనాలకు బానిస అయిన కొడుకు తండ్రిని హతమార్చాలనే పాయింట్ కొత్తదేమీ కాదు. కానీ అందుకోసం రకరకాల ఎత్తుగడలు వేయడమనేది ఇందులో కాస్తంత భిన్నంగా ఉంది. తండ్రిని చంపాలనుకునే స్థాయికి ఆ కొడుకు ఎలా దిగజారిపోయాడు అనేది కన్వెన్సింగ్ గానే చూపించాడు దర్శకుడిగా ధనరాజ్. అయితే యాక్షన్ ప్లాన్ లో ద్వితీయార్థం ఊహకందని మలుపులు తిరిగిపోయింది. రాఘవలో మార్పు వచ్చిందో రాలేదో తెలియక థియేటర్ లోని ప్రేక్షకుడు సతమతమౌతాడు. రాఘవ ప్రవర్తన బూటకం అని తెలిసినప్పుడు ప్రేక్షకుడికి కలిగే అసహనం... నిజంగా అతనిలో మార్పు వచ్చినా చల్లారని పరిస్థితి ఏర్పడిపోయింది. దాంతో ఏదో తెలియని అసంతృప్తి తోనే థియేటర్ నుండి ప్రేక్షకుడు బయటకు వస్తాడు.

నటీనటుల విషయానికి వస్తే... చాలా వేరియేషన్స్ ఉన్న పాత్రను ధనరాజ్ సమర్థవంతంగానే పోషించాడు. సముతిరఖని లాంటి నటుడి పక్కన ఈ తరహా పాత్ర చేసిన మెప్పించడం అంత సామాన్య విషయం కాదు. కానీ అతను నటుడిగా మంచి మార్కులే స్కోర్ చేశాడు. దానికి తోడు దర్శకత్వం అనే అదనపు బాధ్యతనూ భుజానకెత్తుకుని ఇలా నటించడం గ్రేట్. అతని తల్లిగా ప్రమోదిని, స్నేహితుడిగా సత్య, దన్నుగా నిలిచే వ్యక్తిగా హరీశ్ ఉత్తమన్ నటించారు. హీరోయిన్ కాని హీరోయిన్ పాత్రను మోక్ష చేసింది. సునీల్ కు ఇచ్చిన స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇతర ప్రధాన పాత్రలను పృథ్వీ, రాకెట్ రాఘవ, శ్రీనివాసరెడ్డి, వాసు ఇంటూరి తదితరులు పోషించారు. ఈ  చిత్రాన్ని పృథ్వీ పోలవరపు నిర్మించారు.

సినిమాలో వచ్చేవన్నీ నేపథ్య గీతాలే. వీటిని రామజోగయ్య శాస్త్రి రాశారు. వాటికి అరుణ్‌ చిలువేరు  చక్కని స్వరాలు సమకూర్చాడు. నేపథ్య సంగీతం కొన్ని సార్లు ఫీల్ గుడ్ తో సాగినా, కొన్ని చోట్ల హారర్ మూవీ చూస్తున్న భావన కలిగించింది. సంభాషణలు చాలా బాగున్నాయి.  నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంత ప్రతిభ కనబర్చినా...  ఈ తరహా కథలను రెగ్యులర్ ఫిల్మ్ గోయర్ అప్రిషియేట్ చేయడం, ఓన్ చేసుకోవడం కష్టమే. అంత మాత్రాన ధనరాజ్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్ ను తక్కువ చేయలేం.

ట్యాగ్ లైన్: స్పాయిల్డ్ సన్ కథ… 'రామం రాఘవం'

Updated Date - Feb 21 , 2025 | 12:47 AM