Bapu Review: బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించిన 'బాపు' ఎలా ఉందంటే..
ABN , Publish Date - Feb 20 , 2025 | 10:43 AM
తెలంగాణ పల్లెల్లో తండ్రిని బాపు అని పిలుస్తుంటారు. అలాంటి ఓ తండ్రి చుట్టూ తిరిగే కథ కాబట్టి ఆ పేరు పెట్టారు. సినిమా టైటిల్ ట్యాగ్ లైన్ లోనే తాము ఏ అంశాన్ని డీల్ చేస్తున్నారో కూడా చెప్పకనే చెప్పేశారు మేకర్స్. 'ఏ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ' అనే ట్యాగ్ లైన్ పెట్టి... అందులో సూసైడ్ అనే పదాన్ని కొట్టేశారు.
సినిమా రివ్యూ: బాపు (Baapu movie Review)
విడుదల తేదీ: 21-2-2025, ప్రీమియర్: 19-2-2025
నటీనటులు: బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఎగుర్ల, రాచ రవి, గంగవ్వ
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: వాసు పెండెం
సంగీతం: RR ధ్రువన్
ఎడిటింగ్: అనిల్ ఆలయం
బ్యానర్: కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్
నిర్మాతలు: రాజు, సిహెచ్. భాను ప్రసాద్ రెడ్డి
రచన, దర్శకత్వం: దయా
నటుడు బ్రహ్మాజీ (Brahmaji)ఈ మధ్య కాలంలో కామెడీ పాత్రలకే ఎక్కువ పరిమితం అయిపోయాడు. అయితే తనలోనూ మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకోవడానికి ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నాడు. నటుడిగా గుర్తింపు పొందిన తర్వాత రెండు మూడు సినిమాలలో హీరోగా నటించినా... చివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా స్థిరపడిపోయాడు. అలాంటి బ్రహ్మాజీ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కింది 'బాపు' సినిమా. దయా దర్శకత్వంలో రాజు, సిహెచ్ భాను ప్రసాద్ ప్రొడ్యూస్ చేసిన 'బాపు' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే సినిమా మీద ఉన్న నమ్మకంతో మేకర్స్ ముందే ప్రీమియర్ షో స్ వేసేశారు. తెలంగాణ పల్లెల్లో తండ్రిని బాపు అని పిలుస్తుంటారు. అలాంటి ఓ తండ్రి చుట్టూ తిరిగే కథ కాబట్టి ఆ పేరు పెట్టారు. సినిమా టైటిల్ ట్యాగ్ లైన్ లోనే తాము ఏ అంశాన్ని డీల్ చేస్తున్నారో కూడా చెప్పకనే చెప్పేశారు మేకర్స్. 'ఏ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ' అనే ట్యాగ్ లైన్ పెట్టి... అందులో సూసైడ్ అనే పదాన్ని కొట్టేశారు. బ్రహ్మాజీకి ఇండస్ట్రీలో ఉన్న పరిచయాల కారణంగా మూవీకి విడుదలకు ముందు బాగానే పబ్లిసిటీ దక్కింది. మరి ఆ స్థాయిలో సినిమా ఉందా? లేదా? తెలుసుకుందాం.
కథ: (Baapu movie Review)
తెలంగాణలోని ఓ పల్లెలో తన తండ్రి రాజయ్య ('బలగం' సుధాకర్ రెడ్డి), భార్య సరోజ (ఆమని) తో కలిసి జీవితాన్ని గడుపుతుంటాడు రైతు మల్లయ్య (బ్రహ్మాజీ). అతనికి కూతురు వరలక్ష్మీ (ధన్యా బాలకృష్ణ), కొడుకు రాజు (మణి ఏగుర్ల) ఉంటారు. కొడుకు రాజు చదువు ఆపేసి ఆటో నడుపుతూ ఉంటాడు. కూతురు సిటీకి వెళ్ళి పై చదువులు చదవాలని ఆశపడుతూ ఉంటుంది. వరుసగా కొన్నేళ్ళుగా పండించిన పంట చేతికి రాకపోవడంతో మల్లయ్య ఊరి నిండా అప్పులు చేస్తాడు. ఊరి పెద్దలు అప్పులు తీర్చమని మల్లయ్యపై ఒత్తిడి తెస్తారు. లేదంటే పొలాన్ని జప్తు చేస్తామని బెదిరిస్తారు. తాను ఆత్మహత్య చేసుకుంటే..ప్రభుత్వం నుండి ఎంతో కొంత పరిహారం లభిస్తుందని, దాంతో కష్టాలు తీరతాయని మలయ్య భావిస్తాడు. 'ఈ కష్టాల నుండి గట్టెక్కడానికి మల్లయ్య ఆత్మహత్య చేసుకుని కుటుంబం మొత్తాన్ని అనాధను చేయడం కంటే.. మావ రాజయ్య చనిపోతే మంచిది కదా'! అనే ఆలోచన భర్త బుర్రలోకి ఎక్కిస్తుంది సరోజ. మనసు చంపుకుని ఇంటికి పెద్దగా ఉన్న తండ్రిని ఆత్మహత్య చేసుకోమని మల్లయ్య కోరతాడు. కొడుకు మాటలను రాజయ్య ఎలా స్వీకరించాడు? కష్టాల నుండి బయట పడటం కోసం ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఎంత వరకూ సబబు? ఈ వ్యవహారంలో ఊరిలో చంటి (రచ్చ రవి)కి దొరికిన అమ్మవారి పురాతన విగ్రహం పాత్ర ఏమిటీ? అనేది మిగతా కథ.
విశ్లేషణ: (Baapu movie Review)
తెలంగాణ రైతాంగం ఒకప్పుడు కరువు కాటకాలతో విలవిలలాడిన మాట వాస్తవం. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ కష్టాలు చాలావరకూ తీరాయని, లక్షల ఎకరాలకు సాగునీరు చేరుతోందని గత ప్రభుత్వాలు చెప్పాయి. గతంతో పోల్చితే రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. అలాగని పూర్తిగా లేవని కాదు! అప్పుడో ఇప్పుడో కొందరు అభాగ్యులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నట్టు చూపించడం దారుణం. అదీ ఇంటి పెద్దనే ఆ పనికి పూనుకోమనడం, ఇచ్చిన మాటను ఆ ఇంటి పెద్ద మర్చిపోవడంతో ఏకంగా కుటుంబ సభ్యులంతా కలసి ఆయన్ని చంపడానికి పథక రచన చేయడమనేది ఎవరూ హర్షించలేనిది. ఇంత సంక్లిష్టమైన కథను డార్క్ కామెడీతో రక్తి కట్టించే ప్రయత్నం దర్శకుడు దయా చేశాడు. కేవలం రైతు, అతని కష్టాలు కడగండ్లకు పరిమితం కాకుండా ఇందులో ఇటు వరలక్ష్మీకి, అటు రాజు కూ రెండు ప్రేమకథలను దర్శకుడు జోడించాడు. ప్రతికూల పరిస్థితుల ప్రభావం ప్రేమ మీద ఎలా పడుతుందో కళ్ళకు కట్టినట్టు చూపించాడు. అయితే ప్రధానాంశంలోనే మానవీయత లేకపోవడంతో ప్రేక్షకులు మూవీతో పెద్దంతగా కనెక్ట్ కారు. ఒక్కోసారి నిర్లక్ష్యంగా మాట్లాడే మాటలు కుటుంబాలను ఎంత దారుణమైన క్షోభకు గురిచేస్తాయో ఇందులో చూపించాడు. సెల్ ఫోన్ అనేది ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న మారణాయుధం అని గుర్తు చేశాడు. చిత్రం ఏమిటంటే.. మూవీ టైటిల్ 'బాపు' అని పెట్టిన దర్శకుడు సినిమాలో ఓ ఒక్కసన్నివేశంలోనూ తండ్రిని బాపు అని పిలిపించిన దాఖలాలు లేవు!
నటీనటుల విషయానికి వస్తే... ప్రధాన పాత్రలు పోషించిన 'బలగం' సుధాకర్ రెడ్డి, బ్రహ్మాజీ, ఆమని, ధన్య బాలకృష్ణ, అవసరాల శ్రీనివాస్, మణి ఏగుర్ల, అబిత వెంకట్, రచ్చ రవి, గంగవ్వ... తదితరులు ఎక్కడా అతి లేకుండా... సహజమైన నటనను ప్రదర్శించారు. పాటలు సినిమా ఫ్లో కి అడ్డుపడినా... వాటి చిత్రీకరణ, స్వరకల్పన బాగానే ఉంది. సాహిత్యం అర్థవంతంగా సాగింది. ఈ చిత్రానికి ఆర్.ఆర్. ధ్రువన్ సంగీతాన్ని అందించాడు. తెలంగాణ పల్లె వాతావరణాన్ని వెండితెరపై సినిమాటోగ్రాఫర్ వాసు పెండెం చక్కగా ఆవిష్కరించాడు. సహజంగా ఇలాంటి క్లిష్టమైన కథను ఎంచుకున్నప్పుడు దర్శకుడు క్లయిమాక్స్ విషయంలో ఎంతోకొంత రాజీ పడుతుంటాడు. కానీ అలా కాకుండా ఓ అర్థవంతం, ఆదర్శనీయమైన ముగింపును ఇవ్వడం అభినందించదగ్గది.
ట్యాగ్ లైన్: డార్క్ కామెడీతో 'బాపు'