Brahma Anandam Review: తండ్రీ, కొడుకు కలిసి నటించిన 'బ్రహ్మా ఆనందం’ మెప్పించిందా..

ABN , Publish Date - Feb 14 , 2025 | 01:08 PM

టాలీవుడ్‌కి కామెడీ కింగ్‌ బ్రహ్మానందం(Brahmanandam)దాదాపు నాలుగు దశాబ్ధాలుగా వెండితైరపై తనదైన శైలి నటనతో ఆకట్టుకున్న ఆయన ఈమధ్యన సినిమాలు చేయడం తగ్గించారు. చాలా సెలెక్టివ్‌గా, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తున్నారు. అలా చేసిన చిత్రమేు 'బ్రహ్మ ఆనందం’.

సినిమా రివ్యూ: బ్రహ్మ ఆనందం’ (Brahma Anandam Review)
విడుదల తేది: 14-2-2025
నటీనటులు: బ్రహ్మానందం, రాజా గౌతమ్‌, ప్రియా వడ్లమాని, తాళ్లూరి రామేశ్వరి, మిర్చి సంపత్‌, రాజీవ్‌ కనకాల, ప్రభాకర్‌, దివిజ, ఐశ్వర్యా హోలక్కల్‌ తదితరులు.
సాంకేతిక నిపుణులు
సినిమాటోగ్రఫీ: మితేష్‌ పర్వతనేని
సంగీతం: శాండిల్యా పీసపాటి
నిర్మాత: రాహుల్‌ యాదవ్‌ నక్కా
దర్శకత్వం: ఆర్‌.వి.ఎస్‌.నిఖిల్‌

టాలీవుడ్‌కి కామెడీ కింగ్‌ బ్రహ్మానందం(Brahmanandam)దాదాపు నాలుగు దశాబ్ధాలుగా వెండితైరపై తనదైన శైలి నటనతో ఆకట్టుకున్న ఆయన ఈమధ్యన సినిమాలు చేయడం తగ్గించారు. చాలా సెలెక్టివ్‌గా, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తున్నారు. అలా చేసిన చిత్రమేు 'బ్రహ్మ ఆనందం’. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్‌ (Raja goutham) కలిసి నటించడం, ట్రైలర్లు, టీజర్లు ఆకట్టుకోవడంతో సినిమాకు మంచి బజ్‌ ఏర్పడింది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చిరంజీవి అతిథిగా వచ్చి సినిమా గురించి మాట్లాడటంతో మరింత హైప్‌ పెరిగింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించింది? రాజా గౌతమ్‌కు హీరోగా కమ్‌బ్యాక్‌ ఇచ్చిందా? అన్నది చూద్దాం.

కథ: (Brahma anandam review)

బ్రహ్మానందం(రాజా గౌతమ్‌) ఓ థియేటర్‌ ఆర్టిస్ట్‌. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతాడు. తాత మూర్తి (బ్రహ్మానందం), కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా దగ్గర లేకపోవడంతో నాకు నేనే అన్నట్లు స్వార్థంగా బతుకుతుంటాడు. ఎప్పటికైనా పెద్ద నటుడు కావాలన్నది తన కోరిక. దాని కోసం థియేటర్‌ ఆర్టిస్ట్‌గా ప్రయత్నాల్లో ఉండగా తన గురువు తనికెళ్ల భరణి సాయంతో ఢిల్లీలో జరుగుతున్న కళారంగ్‌ మహోత్సవంలో నాటకం వేేస అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు. అయితే ఇందులో పాల్గొనాలంటే స్పాన్సర్‌షిప్‌గా రూ.6 లక్షలు ఇవ్వాలని ఈవెంట్‌ ఆర్గనైజర్‌ డిమాండ్‌ చేస్తారు. స్నేహితుడు గిరి (వెన్నెల కిశోర్‌)పై ఆధారపడి బతికే అతనికి ఆరు లక్షలు పుట్టడం కష్టం అవుతుంది. సరిగ్గా అప్పుడే వృద్థాశ్రమంలో ఉండే తన తాత మూర్తి అలియాస్‌ ఆనంద రామ్మూర్తి (బ్రహ్మానందం) తన పేరు మీద ఊర్లో కొంత భూమి ఉందని, తాను చెప్పినట్లు చేస్తే అది తనకు ఇస్తానని ఊరికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్లాక ఏం జరిగింది? తాను చెప్పినట్లుగా బ్రహ్మకు మూర్తి పొలం రాసిచ్చాడా? దాని కోసం అతను  ఎలాంటి కండీషన్ పెట్టాడు. మూర్తి వృద్ధాశ్రమంలో ఉండిపోవడానికి కారణం ఏంటి? జ్యోతి (తాళ్లూరి రామేశ్వరి)కి మూర్తికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? బ్రహ్మను ఎంతో ఇష్టంగా ప్రేమించిన తార (ప్రియా వడ్లమాని) తనని ఎందుకు వదిలి వెళ్ళిపోయింది? నటుడు అవ్వాలనే బ్రహ్మ కోరిక నెరవేరిందా? లేదా అన్నది కథ.


Priya.jpg
విశ్లేషణ: (Brahma anandam review)

వాలంటైన్స్‌ డే సందర్భంగా  ‘బ్రహ్మాఆనందం' (Brahmanandam) సినిమా అంటే.. ఇది బ్రహ్మానందం కొడుకు ప్రేమ కథ అయ్యి ఉంటుందిలే అని అంతా అనుకున్నారు. కానీ ‘బ్రహ్మాఆనందం'లో కొడుకు ప్రేమ కథ కాదు.. తన వృద్థ ప్రేమకథని చూపించి షాక్‌ ఇచ్చారు బ్రహ్మీ. తాత-మనవడు అనుబంధం తో సాగే కథతో ముడిపడిన కథ ఇది. తాతగా బ్రహ్మానందం, మనవడిగా రాజా గౌతమ్‌ నటించారు. నిజజీవితంలో తండ్రీకొడైకులైన వీరిద్దరూ ఈ పాత్రలు చేయడంతో ఈ సినిమా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫస్టాఫ్‌ అంతా పాత్రల పరిచయంతో సాగదీతగా సాగుతుంది. థియేటర్‌ ఆర్టిస్ట్‌గా బ్రహ్మ పరిచయ సన్నివేశాలు తనకు ఎదురయ్యే సవాళ్లు.. మిత్రుడు గిరి (వెన్నెల కిషోర్‌)తో అనుబంధం. తారతో(ప్రియా వడ్లమాని) లవ్‌స్టోరీ, బాబాయ్‌ కుటుంబంతో ఉన్న సమస్యలు ఇలా సన్నివేశాలు సాగుతాయి. ఆర్టిస్ట్‌ కావాలనే తన ప్రయత్నాల్లో బ్రహ్మకు రూ.6 లక్షలు అవసరం పడటం, ఆ ప్రయత్నాలు ఫెయిల్‌ అవ్వడం, అదే సమయంతో అతనొక స్వార్థపరుడని గ్రహించి తార దూరం కావడంతో అప్పటి దాకా నత్తనడకన సాగిన కథలో కాస్త వేగం పెరుగుతుంది. తెరపైకి ఫుల్‌ప్లెడ్జ్‌గా బ్రహ్మీ ఎంట్రీ ఇచ్చిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి కథ, కథనంలో వేగం పెరుగుతుంది. బ్రహ్మ అవసరాన్ని తెలుసుకుని అతనికి పొలం ఇస్తానని చెప్పి ఊరికి తీసుకెళ్లడం, కొన్ని షరతులతో మూర్తి వేసే ముడులు, సర్పంచ్‌ (రాజీవ్‌ కనకాల) ఇంటి సన్నివేశాలు నవ్విస్తాయి. ప్రథమార్థంలో రాజా - వెన్నెల కిషోర్‌ - బ్రహ్మానందం మధ్య సాగే ట్రాక్‌, డైలాగ్స్‌ బాగా పేలాయి. పొలం ఎక్కడ అంటూ మూర్తిని సతాయించే సన్నివేశాలు, అతను ఆడే డ్రామా కథకు అతికినట్లు ఉండవు. సాగదీతగా అనిపిస్తుంది.

పొలం లేదని తెలిశాక హీరో స్పందించే తీరు, బ్రహ్మానందం ఇచ్చే ట్విస్ట్‌ ద్వితీయార్దంపై ఆసక్తి పెంచుతాయి. అయితే ఫస్టాఫ్‌లో హీరోకి ఓ లక్ష్యం ఉంటుంది. సెకెండాఫ్‌కి వచ్చేసరికి ఆ లక్ష్యం ప్రస్తావనే రాదు. ఆ ట్రాక్‌, తనికెళ్ల భరణి, షోలో అవకాశం ఇచ్చిన భూషణం పాత్రలు ఎక్కడా కనిపించవు. ఆ ట్రాక్‌ మొత్తం పక్కకు వెళ్లిపోయింది. దాంతో కథ గాడి తప్పినట్లుగా అనిపిస్తుంది. టెన్త్‌ క్లాస్‌ టీచర్‌గా రాజా, సంపత్‌ల మధ్య సన్నివేశాలు తెరపై కాస్త భారంగా ఉంటాయి. వృద్ధాశ్రమంలో కొన్నేళ్లుగా ఉన్న జ్యోతి, మూర్తిల ప్రేమకథతో నవ్వించాలని ప్రయత్నం చేసినా అది వర్కవుట్‌ కాలేదు. ఒక వయసు వచ్చాక వృద్థాప్యంలో ఓ తోడుండాలని దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్‌ బావుంది. కానీ భావోద్వేగంగా, హత్తుకునేలా చెప్పడంలో దర్శకుడు తడబాటుకు గురయ్యాడు. జ్యోతి, మూర్తిల మధ్య ఉన్న బంధం చూసి హీరో మారడం, తను చేసిన పొరపాట్లు తెలుసుకుని తాత ప్రేమను గెలిపించడం కోసం రంగంలో దిగుతాడు. అయితే ఈ క్రమంలో మూర్తి - జ్యోతిల పెళ్లి చుట్టూ డ్రామా, జ్యోతి కొడుకు సర్పంచ్‌ చేసే హంగామా కథకు సింక్‌ అవలేదనిపిస్తుంది. సినిమా ఎండ్‌ కార్డ్‌ కూడా మెప్పించేలా లేదు.


Anandam.jpg

నటీనటుల పనితీరు.. (Brahma anandam review) బ్రహ్మానందం పాత్రలో రాజా గౌతమ్‌ నటనలో డెవలప్‌మెంట్‌ కనిపించింది. వాయిస్‌ కూడా పర్ఫెక్ట్ గా కుదిరింది. ఎమోషనల్‌ సీన్స్‌లో నేచురల్‌గా కనిపించాడు. ఇక మూర్తిగా బ్రహ్మానందం ఓవైపు నవ్విస్తూనే.. మరోవైపు ఎమోషనల్‌గా మనసును బరువెక్కించే ప్రయత్నం చేశారు. అయితే బ్రహ్మానందం రేంజ్‌ క్యారెక్టర్‌ కాదిది. దర్శకుడి అనుభవ లేమి, రచనా లోపం వల్ల ఆ పాత్రను పూర్తిగా ఉపయోగించుకో లేదనిపించింది. అక్కడక్కడా బ్రహ్మీ ఫేస్‌లో సహజత్వం మిస్‌ అయింది. గిరి పాత్రలో వెన్నెల కిశోర్‌ నవ్వించాడు. కిశోర్‌ (Vennela Kishore), రాజాకు మధ్య సెట్‌ చేసిన  ట్రాక్స్‌.. అందులో పలికిన కొన్ని సింగిల్‌ లైనర్స్‌ పేలాయి. సర్పంచ్‌గా రాజీవ్‌ కనకాల ఒకటి, రెండు సన్నివేశాల్లో నవ్వించారు. సంపత్‌ పాత్ర అవసరం లేదనిపించింది. ప్రియా వడ్లమాని, దివిజ పాత్రలు ఫర్వాలేదు. దర్శకుడు చెప్పాలనుకున్న లైన్‌ భిన్నంగా ఉన్నా చెప్పడంలో కన్‌ఫ్యూజ్‌ అయ్యాడు. స్క్రీన్ ప్లే వీక్‌గా ఉంది. శాండిల్య సంగీతం, జాతర పాట ఆకట్టుకుంది. అక్కడక్కడా ఆర్‌ఆర్‌ అలరించింది. మితేశ్‌ కెమెరా వర్క్‌ బావుంది. పల్లె అందాలు బాగా చిత్రీకరించారు. ఎడిటర్‌ ఇంకాస్త పని పెట్టి ఉంటే కథ క్రిస్ప్‌గా సాగేది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు.  పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకున్న ప్రేమ కథలు ఎన్నో చూశాం. వృద్థ వయసులో ఉన్న ఆ పెద్దలే ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే వైవిధ్యమైన పాయింట్‌తో దర్శకుడు ఈ సినిమా తీశారు. ‘అమ్మ ప్రేమని తిరిగి ఇచ్చేద్దాం.. తన ఆనందాన్ని తనకి ఇచ్చేద్దాం అనే చక్కని సందేశం ఉంది. అయితే సహజత్వం మిస్‌ కావడం, కథను చెప్పే తీరులో తడబాటుకి గురికావడంతో సినిమా ట్రాక్‌ మారింది. సెన్సిబుల్‌ సబ్జెక్ట్‌ కాబట్టి కమర్షియల్‌ సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవచ్చు.

ట్యాగ్‌లైన్‌:
మా తాతకు పెళ్లి..  వృద్ధ ప్రేమకథ!

Updated Date - Feb 14 , 2025 | 06:58 PM