Kalyan Ram: అర్జున్ సన్నాఫ్ వైజయంతి రివ్యూ

ABN , Publish Date - Apr 18 , 2025 | 02:41 PM

విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లీ కొడుకులుగా నటించిన యాక్షన్ డ్రామా 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' శుక్రవారం జనం ముందుకొచ్చింది.

'బింబిసార' (Bimbisara) చిత్రం తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) నటించిన 'అమిగోస్', 'డెవిల్' చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో కాస్తంత వేగాన్ని తగ్గించి, కళ్యాణ్ రామ్ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' (Arjun S/o Vyjayanthi) మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జాతీయ ఉత్తమనటి విజయశాంతి (Vijayasanthi) తో మదర్ సెంటిమెంట్ మూవీ చేసి, తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని కళ్యాణ్ రామ్ భావించాడు. మరి అతని కోరిక నెరవేరిందో లేదో తెలుసుకుందాం.

కథ ఏమిటంటే...

'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' కథేమిటంటే... ఐపీఎస్ అధికారిణి వైజయంతి (విజయశాంతి) తన కొడుకు అర్జున్ (కళ్యాణ్ రామ్) కూడా తనలానే ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కలలు కంటుంది. కోస్ట్ గార్డ్ ఆఫీసర్ అయిన అర్జున్ తండ్రి విశ్వనాథ్‌ (ఆనంద్) ను స్మగ్లర్ మాణిక్యం, అతని తమ్ముడు పైడితల్లి హత్య చేసి శవాన్ని మాయం చేస్తారు. వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, కోర్టు ద్వారా వారికి శిక్షపడేట్టు చేద్దామని తల్లి వైజయంతి కొడుక్కి నచ్చచెబుతుంది. చట్టంలోని లొసుగుల కారణంగా శిక్ష పడకుండా తప్పించుకున్న పైడితల్లి, తన తల్లిని కూడా చంపుతానని హెచ్చరించడంతో తట్టుకోలేక కోర్టు ఆవరణలోనే అతన్ని చంపేస్తాడు అర్జున్. పోలీసులకు లొంగిపొమ్మని వైజయంతి కొడుకును కోరుతుంది. కానీ అతనేమో తనను నమ్మకున్న మత్స్యకారులను కాపాడటం కోసం వైజాగ్ సిటీలో సమాంతర ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తాడు. హంతకుడనే ముద్ర పడిన అర్జున్ తల్లికి దూరమై ఓ పక్క తల్లడిల్లుతుంటే... ఆమె కారణంగా జైలు పాలైన పఠాన్ (సోహైల్ ఖాన్) అక్కడ నుండి తప్పించుకుని వచ్చి ఆమెను హతమార్చాలనుకుంటాడు. తల్లిని పఠాన్ బారినుండి అర్జున్ ఎలా కాపాడాడు? అందుకోసం ఏం త్యాగం చేయాల్సి వచ్చింది? అనేది ఈ చిత్ర కథ.


విశ్లేషణ...

విజయశాంతి దాదాపు పదిహేనేళ్ళ తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' మూవీతో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఐదేళ్ళకు ఇప్పుడు 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీలో నటించింది. ఇంతగా ఆమె ఆచితూచి పాత్రలను ఎంచుకుంటోందంటే... ఈ కథలో ఏదో దమ్ము ఉందని అంతా భావించారు. విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లీ కొడుకులుగా వెండితెరపై భావోద్వేగాలను అద్భుతంగా పండిస్తారని ప్రేక్షకులు ఆశపడ్డారు. నిజానికి ఇది మదర్ సెంటిమెంట్ తో తీసిన సినిమానే. కాకపోతే ఐపీఎస్ అధికారి అయిన వైజయంతి, పారలల్ గవర్నమెంట్ ను నడిపే ఆమె కొడుకు అర్జున్ ఇద్దరు కలిసి... సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ అసాంఘీక శక్తులను ఏరివేయడానికి రక్తాన్ని వరదలా వెండితెరపై పారించారు. దాంతో మదర్ సెంటిమెంట్ అనే దానికి ప్రాధాన్యం తగ్గిపోయింది. ఈ హై యాక్షన్ డ్రామాలో అప్పుడప్పుడూ, అక్కడక్కడా సెంటిమెంట్ సీన్స్ ను దర్శకుడు జత చేస్తూ వచ్చాడు. ఫ్యామిలీ సెంటిమెంట్ యాక్షన్ డ్రామా అని మేకర్స్ చెప్పినా... ఉన్నదంతా యాక్షన్ సీన్సే!

నటీనటులు... సాంకేతిక నిపుణులు...

విజయశాంతి ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా పోషించగలదు. ఇక ఖాకీ డ్రస్ ధరిస్తే... ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవల్ లో ఉంటుంది. ఇందులోనూ అంతే... ఐపీఎస్ అధికారిగా ఆమె చేసే పోరాటాలు ఆకట్టుకుంటాయి. కాకపోతే సెంటిమెంట్ సీన్స్ చిత్రీకరణలో బలం లేకపోవడంతో ఆ యా సన్నివేశాలు తేలిపోయాయి. కళ్యాణ్ రామ్ సైతం సెంటిమెంట్ పండించడం మీద కంటే యాక్షన్ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికే ఎక్కువ ప్రయత్నించాడు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. హీరోయిన్ సాయి మంజ్రేకర్ పాత్రకు పెద్దంత ప్రాధాన్యం లేదు. విలన్ సోహైల్ ఖాన్ పాత్రనూ చెప్పుకోదగ్గ రీతిలో దర్శకుడు మలచలేదు. ఉన్నంతలో శ్రీకాంత్, పృథ్వీ, ఆనంద్ తమదైన నటనతో మెప్పించారు. వీరి పాత్రలు సినిమాకు కాస్తంత బలాన్ని చేకూర్చాయి. కాస్తంత గుర్తింపు ఉన్న నటీనటులు చాలా మందే ఇందులో వున్నా, ఎవరిదీ చెప్పుకోదగ్గ పాత్ర కాదు.


గురువారం విడుదలైన 'ఓదెల -2' (Odela -2) కు సంగీతం అందించిన అజనీశ్ లోక్ నాథ్ (Ajaneesh Loknadh) ఈ సినిమాకూ మ్యూజిక్ ఇచ్చారు. అతను అందించిన నేపథ్య సంగీతం యాక్షన్ సీన్స్ ను ఎలివేట్ చేసింది. బట్... ఏ పాటా చెప్పుకోదగ్గదిగా లేదు. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. గెస్ట్ రోల్ లోనూ రాంప్రసాద్ మెరపులా మెరిశారు. సంభాషణలు బాగున్నాయి. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ పడిన శ్రమ తెర మీద కనిపిస్తోంది. అయితే... మూవీ టైటిల్, మేకర్స్ చెప్పిన మాటలు నమ్మి... ఇదేదో మదర్ సెంటిమెంట్ చిత్రం అనే భావనతో వచ్చిన వారు కొంత నిరాశకు గురికాకతప్పదు. మాస్, యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి నచ్చే ఆస్కారం ఉంది.

వాస్తవానికి హీరోకి సంబంధించిన ఎలివేషన్ షాట్స్ మీద పెట్టిన దృష్టి కథ, కథనాల మీద దర్శకుడు ప్రదీప్ చిలుకూరి పెట్టి ఉంటే... సినిమా కొంతలో కొంత బెటర్ గా ఉండేది. అలా చేయకపోవడంతో ఇది రొటీన్ యాక్షన్ డ్రామాగా మిగిలిపోయింది. నిర్మాతలు అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఖర్చు విషయంలో వెనకాడలేదు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలతో పోల్చితే... 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'కి మంచి ఓపెనింగ్స్ లభించడం పాజిటివ్ సైన్ అనే చెప్పాలి!

ట్యాగ్ లైన్: రొటీన్ రివేంజ్ యాక్షన్ డ్రామా!

రేటింగ్: 2.5/5

Also Read: Madhuram movie : మధురం సినిమా రివ్యూ

Also Read: Odela -2 Movie : ఓదెల 2 మూవీ రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 18 , 2025 | 03:42 PM