Thala Movie review: అమ్మ రాజశేఖర్ కుమారుడు నటించిన 'తల' ఎలా ఉందంటే
ABN , Publish Date - Feb 15 , 2025 | 08:33 PM
తొలి సినిమా 'రణం'తో దర్శకుడుగా తన కంటూ ఓ ఐడెంటిటీని సంపాదించుకున్న అమ్మ రాజశేఖర్ ఆ తర్వాత తీసిన సినిమాలన్నీ పరాజయం పొందాయి. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉండి ఇప్పుడు తన కుమారుడు అమ్మరాగిన్ రాజ్ ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రమే 'తల'.
సినిమా రివ్యూ: 'తల'
విడుదల తేదీ: 14-2-2025
నటీనటులు: అమ్మ రాగిన్ రాజ్ (Amma Ragin Raj), అంకిత నస్కర్ (Ankita Sarkar), రోహిత్ (Rohith), ఎస్తేర్ (Ester), ఇంద్రజ (Indraja), రాజీవ్ కనకాల (Rajeev Kanakala), ముక్కు అవినాశ్ (Avinash), సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, శ్రవణ్.
సాంకేతిక నిపుణులు
డీఓపీ: శ్యామ్ కె నాయుడు,
మ్యూజిక్: ధర్మ తేజ,
బీజిఎం: అస్లాం కెజి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాధ రాజశేఖర్.
నిర్మాత : శ్రీనివాస గౌడ్ (Srinivasa Goud)
రచన, దర్శకత్వం: అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar),
తొలి సినిమా 'రణం'తో దర్శకుడుగా తన కంటూ ఓ ఐడెంటిటీని సంపాదించుకున్న అమ్మ రాజశేఖర్ ఆ తర్వాత తీసిన సినిమాలన్నీ పరాజయం పొందాయి. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉండి ఇప్పుడు తన కుమారుడు అమ్మరాగిన్ రాజ్ ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రమే 'తల'. వేలంటైన్స్ డే కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ యాక్షన్, సెంటిమెంట్ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ: (Thala Movie Review)
రాంబాబు (అమ్మ రాగిన్ రాజ్)కు తల్లి అంటే ఎంతో ఇష్టం. ఆమె కోసం ఏదైనా చేస్తాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రాంబాబు తండ్రి బతికే ఉన్నాడని, తను చనిపోయేలోపు ఆయనను కలుసుకోవాలనుకుంటున్నానని చెప్పటంతో రాంబాబు నాన్నను తీసుకువస్తానని చెప్పి వేరే రాష్రంలో ఉన్న తండ్రి వద్దకు వెళతాడు. చికెన్ షాప్ నడుపుకుంటున్న నాన్న (రోహిత్) ఎస్తేర్ ను మరో పెళ్ళి చేసుకుని ఉంటాడు. కొడుకును అని చెప్పకుండా ఆ ఇంట్లో పని వాడుగా చేరతాడు. అయితే అదే ఊర్లో క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు తండ్రి ఇంటిమీదకు వచ్చి దౌర్జన్యం చేస్తూ తండ్రిని, పిన్నిని చంపబోయినపుడు రాంబాబు ఆ గూండాల లీడర్ ను నరికేస్తాడు. ఆ తర్వాత ఆ గ్యాంగ్ ఈ ఫ్యామిలీ వెంట పడుతుంది. నాన్నను, ఫ్యామిలీని కాపాడుకోవడానికి రాంబాబు ఏం చేశాడు? తన తల్లి వద్దకు తండ్రిని తీసుకు వెళతాడా? చివరకు ఏం జరిగిందన్నదే 'తల' కథ.
విశ్లేషణ: (Thala Movie Review)
అమ్మ సెంటిమెంట్ చుట్టూ కథ రాసుకొన్న అమ్మ రాజశేఖర్, దానికి యాక్షన్, లవ్, సెంటిమెంట్, ఎమోషన్ ను జోడించి 'తల' తీశాడు. అయితే మెయిన్ పాయింట్ చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు బలంగా లేక పోవడంతో పరమ రొటీన్ సినిమాగా తయారైంది. ప్రత్యేకించి విలన్ గ్యాంగ్ ఎంపిక మరీ వీక్ గా ఉంది. ఇంద్రజ, రాజీవ్ కనకాల, అజయ్, సత్యం రాజేశ్, అవినాశ్ వంటి ఆర్టిస్ట్ లను ఎంపిక చేసుకుని కూడా వారికి తగిన పాత్రలు క్రియేట్ చేయటంలో ఫెయిల్ అయ్యాడు అమ్మరాజశేఖర్. హింస ఎక్కువగా ఉంటే చూస్తారనే భావం ఇటీవల కాలంలో దర్శకుల మనసుల్లో బాగా నాటుకున్నట్లు ఉంది. దానికి అమ్మ రాజశేఖర్ కూడా అతీతుడు కాదేమో అనిపిస్తుంది ఈ సినిమా చూసిన వారికి.
నటీనటుల విషయానికి వస్తే అమ్మ రాగిన్ రాజ్ కి ఇది తొలి చిత్రం అయినా ఎక్కడా ఆ ఫీలింగ్ కనిపించకుండా అనుభవం ఉన్న హీరోలా నటించటం విశేషం. నటనలోనే కాదు ఫైట్స్, పాటలు, ఎమోషన్స్ సీన్లలో కూడా మంచి భవిష్యత్ ఉంటుందనే నమ్మకాన్ని కలిగించాడు. హీరోయిన్ గురించి మాట్లాకపోవడమే బెటర్. ఇక '6టీన్స్' హీరో రోహిత్ కు, ఎస్తేర్ కు ఇందులో మంచి పాత్రలే లభించాయి. వాటికి వారు తగిన న్యాయం చేశారు. ఇంద్రజ, అవినాష్, అజయ్, సత్యం రాజేశ్ పాత్రల పరిధి తక్కువ. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే. ధర్మ తేజ అందించిన పాటలు సినిమాలో చూడటానికి ఓకె. అయితే అస్లాం కేజీ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, శ్యామ్ కే నాయుడు ఫోటోగ్రఫీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. నిర్మాణ విలువలు బాగున్నాయి. తల సినిమా గురించి చెప్పాల్సి వస్తే.. అమ్మ రాజశేఖర్ కమ్ బ్యాక్ కి ఇది తగిన చిత్రం కానే కాదు.
చికెన్ షాప్ లో పని కి కుదిరిన తొలి రోజు చంపిన కోడి తలను తన వద్దే అట్టిపెట్టుకుంటాడు హీరో రాంబాబు. ఆ కోడి తలతోనే విలన్ గ్యాంగ్ లో కొందరిని చంపుతాడు. అంతే కాదు ఆ తలను తను ప్రేమించిన అమ్మాయికి గిప్ట్ గా కూడా ఇస్తాడు. అందుకే సినిమాకు టైటిల్ 'తల' అని పెట్టాడు అమ్మరాజశేఖర్. ఆడియన్స్ కు డైజెస్ట్ కాని ఇలాంటి అంశాలు సినిమాలు లెక్కలేనన్ని ఉన్నాయి.