Akkada Ammayi Ikkada Abbayi: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ రివ్యూ

ABN , Publish Date - Apr 11 , 2025 | 04:23 PM

ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి జంటగా నటించిన చిత్రం 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. శుక్రవారం జనం ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం...

యాంకరింగ్ తో పాపులారిటీ సంపాదించుకుని ఆపైన నటుడిగా మారాడు ప్రదీప్ మాచిరాజు. అంతేకాదు నాలుగేళ్ళ క్రితం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమాతోనూ సిల్వర్ స్క్రీన్ కు హీరోగా పరిచయం అయ్యాడు. మ్యూజికల్ హిట్ గా పేరు తెచ్చుకున్న ఆ సినిమా కమర్షియల్ గా థియేటర్లలో సందడి చేయలేకపోయింది. దాంతో కాస్తంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు రెండోసారి హీరోగా తన అదృష్టం పరీక్షించుకున్నాడు. ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి జంటగా నటించిన 'అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి' సినిమా శుక్రవారం జనం ముందుకు వచ్చింది.

ప్రముఖ నటుడు, ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమైన సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు... అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 29 సంవత్సరాల క్రితం వచ్చిన ఆ సినిమా పేరును ప్రదీప్ మాచిరాజు తన సినిమాకు పెట్టేసుకున్నాడు. దానివల్ల బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ లభించింది. అయితే... ఇలాంటి పాపులర్ మూవీ టైటిల్ పెట్టడం అనేది కత్తి మీద సాము లాంటిది. అయినా ఫర్వాలేదనే ధీమాను దర్శకులు నితిన్, భరత్ కూడా వ్యక్తం చేశారు. మరి వారి ధీమా నిజమైందా!?


కథేంటంటే...

ఆంధ్రా తమిళనాడు బోర్డర్ లో ఉండే ఓ గ్రామంలో కొన్ని సంవవత్సరాల పాటు కరువుకాటకాలు తాండవించి అందరి ఇళ్ళలో అబ్బాయిలే పుడతాడు. అయితే ఓ ఇంట ఆడపిల్ల జన్మిస్తుంది. దాంతో ఆ ఊరికి పట్టిన శని వదలి సుభిక్షంగా మారుతోంది. అప్పుడు ఆ ఊరి పెద్ద ఆ అమ్మాయి ఊరు దాటరాదని, ముందు పుట్టిన 60 మంది అబ్బాయిల్లో ఎవరో ఒకరిని పెళ్ళాడితే తన యావదాస్తితోపాటు మనుసుబు గిరీ కూడా కట్టబెడతానంటాడు. ఆ అమ్మాయి తండ్రి అందుకు ఒప్పుకుంటాడు. పెరిగి పెద్దదైన ఆ అమ్మాయి (దీపిక పిల్లి) ఆ ఊరికి ఇంజనీరుగా వచ్చిన ప్రదీప్ ప్రేమలో పడుతుంది. వారి ప్రేమ ఫలించాలంటే ముందు పుట్టిన 60 మంది అబ్బాయిలకు పెళ్లి చేసి తర్వాత వారిద్దరూ పెళ్లాడాలని తీర్మానం చేస్తారు. దానికి ఒప్పుకున్న ప్రదీప్ ఏం చేస్తాడు? అందుకు ఎదురైన అడ్డంకులు ఏమిటి? వాటిని ఎలా అధిగమిస్తాడనేదే ఈ సినిమా కథ.


విశ్లేషణ...

మంచి లైన్ ఎంపిక చేసుకున్న దర్శకద్వయం నితిన్-భరత్ దాని ట్రీట్ మెంట్ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోలేకపోయారు. పల్లెటూరులో సాగే ప్రథమార్ధం పర్వాలేదనిపించినా ఒక్కసారి పల్లెదాటి పట్నంబాట పట్టిన తర్వాత గాడితప్పినట్లు అనిపిస్తుంది. బుల్లితెరపై స్కిట్స్ తో నవ్వించగలిగిన దర్శకద్వయం సినిమాలో కూడా అక్కడక్కడ ఎంటర్ టైన్ చేయగలిగారు. అయితే సినిమా కోర్ పాయింట్ 60 మందికి పెళ్ళి చేసే అశంను మాత్రం అంత సమర్ధవంతంగా తెరకెక్కించలేక పోయారు. చివరలో ఏదో తూతూ మంత్రంగా జరిపించేసి మమ అనిపించారు. ఇక హీరో, హీరోయిన్లుగా ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి నటించటంతో వారిని బుల్లితెరపై చూసినట్లే అనిపిస్తుంది కానీ వెండితెర ఫీలింగ్ కలగదు. ఇద్దరిలో ఏ ఒక్కరు మారినా వేరేగా ఉండేదేమో!

నటీనటులు సాంకేతిక నిపుణులు...

నటీనటుల విషయానికి వస్తే ప్రదీప్ మాచిరాజు కి ఈ తరహా పాత్ర పోషించటం నల్లేరు బండిమీద నడకే. ఇక సత్య, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు ఆయువు పట్టు. వీరి కామెడీయే లేకుంటే సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. బ్రహ్మాజీ, మురళీదర్ గౌడ్, రోహిణి, జాన్ విజయ్, ఝాన్సీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ప్రదీప్ ముందు సినిమా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' మ్యూజికల్ గా హిట్ అయింది. సందీప్ బొల్లా మాటలు అక్కడక్కడా బాగా ఎంటర్ టైన్ చేశాయి. అయితే ఈ సినిమా పాటలు మాత్రం ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయాయనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకె. బాల్ రెడ్డి కెమెరా పల్లె అందాలను ఇంకాస్త బాగా చూపించి ఉండాల్సింది. నిర్మాతలు బిజినెస్ తో సంబంధం లేకుండా బాగానే ఖర్చు పెట్టారు.

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన 'జాట్, గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలు గురువారం విడుదలై, పేలవమైన ఫలితాన్ని చవిచూశాయి. వీళ్ళే విడుదల చేసి 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' కూడా వాటి ఫలితాన్నే అందించేలా సాగటం విశేషం. ప్రదీప్ టీమ్ జనరేట్ చేసిన ఫన్ ఆడియన్స్ ను థియేటర్స్ రప్పించగలుగుతుందా అన్నది ప్రశ్నార్థకమే!? ఏది ఏమైనా ఈ వారం మైత్రీ వారికి చేదు ఫలితాలనే అందిస్తుందన్నది వాస్తవం…

ట్యాగ్ లైన్: అక్కడక్కడ వినోదం

రేటింగ్: 2.25/5

Also Read: Jack Movie Review: జాక్ మూవీ రివ్వూ

Also Read: Good Bad Ugly: గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రివ్యూ

Also Read: JAAT Review: జాట్ రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 11 , 2025 | 04:23 PM