Naari Review: ఆమని కీలక పాత్ర పోషించిన నారి ఎలా ఉందంటే
ABN , Publish Date - Mar 07 , 2025 | 09:48 PM
విమెన్ ఓరియెంటెడ్ చిత్రాలు తీసే సాహసం చాలా తక్కువమంది మేకర్స్ చేస్తుంటారు. అలాంటి ఓ అరుదైన ప్రయత్నం చేశారు దర్శకుడు సూర్య వంటిపల్లి. ఆమని కీలక పాత్రలో మహిళ సాధికారత, సమస్యలు ఇతివృత్తంలో ఆయన తెరకెక్కించిన చిత్రం నారి.
సినిమా రివ్యూ: 'నారి' (Naari movie review)
విడుదల తేది: 7–3–2025
నటీనటులు: ఆమని(Aamani), వికాస్ వశిష్ఠ, కార్తికేయ దేవ్, నిత్య శ్రీ, మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ, రాజమండ్రి శ్రీదేవి,ఛత్రపతి శేఖర్, నాగ మహేశ్, సునయన తదితరులు.
సాంకేతిక నిపుణులు:
కెమెరా: వి రవికుమార్, భీమ్ సాంబ
మ్యూజిక్ - వినోద్ కుమార్ విన్ను
ఎడిటర్ - మాధవ్ కుమార్ గుల్లపల్లి
నిర్మాత - శ్రీమతి శశి వంటిపల్లి
దర్శకత్వం - సూర్య వంటిపల్లి (Surya vantipalli)
విమెన్ ఓరియెంటెడ్ చిత్రాలు తీసే సాహసం చాలా తక్కువమంది మేకర్స్ చేస్తుంటారు. అలాంటి ఓ అరుదైన ప్రయత్నం చేశారు దర్శకుడు సూర్య వంటిపల్లి. ఆమని కీలక పాత్రలో మహిళ సాధికారత, సమస్యలు ఇతివృత్తంలో ఆయన తెరకెక్కించిన చిత్రం 'నారి' (Naari Movie). శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
నగరంలో ఓ అమ్మాయిపై జరిగిన హత్యాచారం కేసు న్యాయవాది శారద (ప్రగతి) టేకప్ చేస్తుంది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని తపన పడుతుంది. నేరం చేసిన నిందితుల్లో మంత్రి భూపతి (నాగమహేశ్) కొడుకు ఉంటాడు. అయినా లెక్క చేయని లాయర్ శారద బాధితురాలికి న్యాయం చేసేందుకే ముందడుగు వేస్తుంది. ఆమె లైఫ్‌లో కలిసిన ఓ దీర మహిళ భారతి(ఆమని, మౌనిక రెడ్డి) జీవితాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటుంది. ఆ భారతి ఎవరు? ఆమె కథేంటి. చిన్నప్పటి నుంచి కష్టాల మధ్య పెరిగిన భారతి ఎదుర్కొన్న కష్టాలు ఏంటి, వాటిని ఆమె ఎలా అధిగమించింది. మృగాళ్లు మరోసారి ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడకుండా భారతి చేసిన త్యాగం ఏంటి ఆమె చూపించిన పరిష్కారం ఏంటి అనేది తెరపై చూడాలి.
విశ్లేషణ: (Naari movie review)
ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి జీవితంలో ప్రతి దశలోనూ కష్టాలు కామన్‌గా ఉంటాయి. చిన్నప్పుడు తండ్రి, పెళ్లయ్యాక భర్త, తల్లయ్యార పిల్లలు ఇలా మహిళ ఏదో ఒక రూపంలో జీవిత కాలం కష్టాల కడలిని దాటుకు రావాలి అన్నట్లుగానే సమాజంలో తీరు ఉంది. ఇలాంటి నేపథ్యంలో పుట్టి పెరిగిన అమ్మాయి భారతి కథ ఇది. తన జీవితంలో తండ్రితో మొదలైన ఇబ్బందులు, ఆ తర్వాత ప్రేమించి మోసం చేసిన వ్యక్తి పెట్టిన కష్టాలను దాటుకుని గుండె రాయి చేసుకుని జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకున్న తీరును దర్శకుడు తెరపై చూపించాడు. ఇందులో స్ఫూర్తిని కలిగించే అంశం ఇది. మహిళలపై అఘాయిత్యాలు అనే అంశంపై ఎన్నో చిత్రాలు వచ్చాయి. అయితే ఇందులో దర్శకుడు చూపించిన పాయింట్. సమస్యకు పరిష్కారం కొత్తగా ఉంటుంది. ఫాస్ట్ కల్చర్‌లో యువత చెడు దారుల్లోకి పోతున్నారన్నది ఇందులో ఆసక్తికరంగా తెరకెక్కించారు. దారి తప్పిన కొడుకుకు తల్లి ఎలాంటి గుణపాఠం నేర్పింది అనేది ఈ చిత్రంలో గొప్పగా చెప్పుకొనే మరో అంశం. క్లైమాక్స్‌లో ఆమె చెప్పిన గుణపాఠం ఏంటనేది రిలీవ్ చేస్తే ఫీల్ మిస్ అవుతుంది. ఆ సీన్ ఎలాంటి మూర్ఖులుకైనా భావోద్వేగానికి లోను చేస్తుంది.
నటీనటుల పనితీరు: ఈ చిత్రానికి తెరవెనుక దర్శకుడు హీరో అయితే తెరపై హీరో ఆమని. భారతి పాత్రలో ఇమిడి పోయింది. నటిగా తనకున్న అనుభవాన్ని టీచర్ భారతి పాత్రలో ఆమె చూపించింది. ప్రతి సన్నివేశంలోనూ భావోద్వేగాన్ని పండించింది. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే టీచర్‌గా, గాడి తప్పిన కొడుకును దార్లోకి తీసుకురావాలని ఆశపడే తల్లిగా ఆమని నటన అద్భుతం. భారతి యుక్త వయసు క్యారెక్టర్‌లో నటించిన మౌనిక రెడ్డి, ఆపాత్రకు న్యాయం చేసింది. నిత్య శ్రీ విద్యార్థిని అర్చనగా ఆకట్టుకుంటుంది. వికాస్ వశిష్ట క్యారెక్టర్ రివీల్ చేేస్త సస్పెన్స్ పోతుంది. ఈ పాత్రకు వికాస్ బాడీ లాంగ్వేజ్ బాగా సెట్ అయ్యింది. ప్రగతి, ప్రమోదినీ, ఛత్రపతి శేఖర్, కార్తికేయ దేవ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ విషయానికొస్తే.. సినిమాటోగ్రఫీ బాగుంది. చిన్న బడ్జెట్ చిత్రం అయినా క్వాలిటీ విషయంలో నిర్మాత ఎక్కడా తగ్గలేదు. సెకెండాఫ్‌లో ఎడిటర్ కాస్త కత్తెర వేసుకుంటే బాగుండేది. వినోద్ కుమార్ సంగీతం సినిమాకు ఎసెట్. ఇందులో దర్శకుడు తీసుకున్న పాయింట్, చెప్పిన సందేశం మంచిదే. కొన్నింటిని మాత్రం సోసోగా రాసుకున్నాడు. కథకు తగ్గట్టు స్ర్కీన్ ప్లే రాసుకోవడంలో సూర్య వంటిపల్లి విఫలం అయ్యాడనే భావన కలుగుతుంది. ఈ తరహా కాన్సెప్ట్‌తో సినిమా అంటే ప్రతి సీన్ క్యూరియాసిటీ కలిగించేలా ఉండాలి. ఎందుకంటే క్లైమాక్స్‌లో బలమైన పాయింట్ ఉంది కాబట్టి. కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుందా లేదా అన్నది పక్కన పెడితే చక్కని సందేశం మాత్రం ఇచ్చాడు దర్శకుడు. ప్రస్తుత సమాజం చూడదగ్గ సినిమా ఇది.
ట్యాగ్‌లైన్: నారి పోరాటం..