Tollywood: యువ కథానాయకులకేమైంది...

ABN , Publish Date - Apr 14 , 2025 | 03:30 PM

గత కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరోలకే కాదు... సక్సెస్ లో ఉన్న ఒకరిద్దరికి కూడా గడిచిన మూడు మాసాల్లో వచ్చిన సినిమాలు చుక్కులు చూపించాయి. మరి ఈ పరాజయాలనుండి వారు పాఠాలు నేర్చుకుంటారో లేదో చూడాలి.

ప్రతి యేడాది అగ్ర కథానాయకుల చిత్రాలే కాదు యంగ్ హీరోస్ మూవీస్ కూడా హిట్ అవుతూ ఉంటాయి. దాంతో కొత్త నిర్మాతలు పలువురు సినిమా రంగంలోకి అడుగుపెడుతూ ఉంటారు. చిన్న సినిమాలు ఎన్ని నిర్మితమైతే... ఇక్కడుండే 24 క్రాఫ్ట్స్ వారికి అంత పని లభిస్తుంది. అందువల్ల అగ్ర కథానాయకుల సినిమాల కంటే... మీడియం, స్మాల్ బడ్జెట్ మూవీస్ ఎక్కువ విజయవంతం కావాలని సినిమా రంగానికి చెందిన వారు కూడా కోరుకుంటారు. ఎందుకంటే పెద్దహీరోలు యేడాదికి ఒకటో రెండో సినిమాలు చేస్తారు. అదే మీడియం బడ్జెట్ మూవీస్ చేసే యంగ్ హీరోలైతే... యేడాదికి కనీసం నాలుగైదు సినిమాలు చేసే ఆస్కారం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ హీరోలు కూడా రెండు మూడు సినిమాలను మించి చేయడం లేదు. నిజానికి వీరు చేసే సినిమాలు పరాజయం పాలైనా... నిర్మాతలు కానీ బయ్యర్లు గానీ దారుణమైన నష్టాలనైతే చవి చూడరని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి. థియేట్రికల్ రన్ రాకపోయినా... ఓటీటీ హక్కులు ద్వారా చాలా వరకూ నష్టం రికవర్ అవుతుందని అంటుంటారు. అలానే సినిమాలో కమర్షియల్ గా పే చేయకపోయినా... కథలో కొత్తదనం ఉంటే... ఇతర భాషల్లో డబ్బింగ్ రైట్స్ రూపంలోనూ ఎంతో కొంత మొత్తం వచ్చే ఆస్కారమైతే ఉంటుంది. కానీ ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు ఈ తరహా సినిమాలు తీసే నిర్మాతలను భయానికి గురిచేస్తున్నాయి. దానికి ప్రధాన కారణం మూవీ విడుదలకు ముందు ఎంత బజ్ క్రియేట్ అయినా... థియేటర్లలో షో పడగానే దారుణమైన టాక్ వచ్చి... కలెక్షన్స్ మరీ దారుణంగా ఉంటున్నాయి. ఈ యేడాది గడిచిన మూడునెలల్లో యంగ్ హీరోస్ నటించిన సినిమాలు ఊహకందని విధంగా పరాజయం పాలయ్యాయి.


విశ్వక్ సేన్ కు 'హిట్' (Hit) మూవీ తర్వాత సాలీడ్ హిట్ పడలేదు. కొన్ని సినిమాలు ఫర్వాలేదనిపించినా... చాలా సినిమాలు నిర్మాతలకు నష్టాలనే తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14న 'లైలా' (Laila) సినిమా వచ్చింది. ఇందులో విశ్వక్ సేన్ (Vishwak sen) లేడీ గెటప్ లో కనిపించడం యూత్ ను ఆకట్టుకుంటుందని దర్శక నిర్మాతలు భావించారు. లేడీ గెటప్ లో విశ్వక్ మెప్పించినా... అతని బాడీ లాంగ్వేజ్, ఓవర్ యాక్షన్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ బూమరాంగ్ అయ్యాయి. సినిమా దారుణమైన పరాజయాన్ని పొందింది. చివరకు ఇలాంటి చిత్రాలను ఇకపై చేయనని విశ్వక్ సేన్ అభిమానులకు సారీ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలానే సందీప్ కిషన్ (Sundeep Kishan) కూడా కొంతకాలంగా విజయాలు లేక ఇబ్బందులు పడుతున్నాడు. ధనుష్ తమిళ చిత్రం 'రాయన్'లో కీ-రోల్ ప్లే చేశాడు. తమిళంలో ఆ సినిమా ఫర్వాలేదనిపించింది కానీ తెలుగులో ఆడలేదు. దాంతో సందీప్ కిషన్ 'మజాకా' (Mazaka) మూవీ మీద ఆశలు పెట్టుకున్నాడు. రీతువర్మ (Reethu Varma) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మాస్ ను ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మారు. కానీ వాళ్ళ నమ్మకాన్ని ప్రేక్షకులు వమ్ము చేశారు. ఈ మూవీ ఓటీటీలో కాస్తంత ఫర్వాలేదనిపించింది. ఇక గత యేడాది దీపావళికి 'క' (Ka) సినిమాతో మెప్పించిన కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) ఈ యేడాది మార్చి 14న 'దిల్ రుబా' (Dil Ruba) తో జనం ముందుకు వచ్చాడు. ఈ లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. అలానే కొన్నేళ్ళుగా హిట్ లేకుండా కాలాన్ని గడిపేస్తున్న ఆది సాయికుమార్ (Aadi Saikumar) కూడా డివోషనల్ థ్రిల్లర్ మూవీ 'షణ్ముఖ'తో మెప్పించలేకపోయాడు.


నిజం చెప్పాలంటే నితిన్ (Nithin) కు పరాజయాలను ఎదుర్కొనడం కొత్తేమీ కాదు. కానీ ఈ మధ్యకాలంలో అవే ఎక్కువగా పలకరిస్తున్నాయి. అయినా నితిన్ సినిమా అంటే మినిమమ్ ఓపెనింగ్స్ వస్తాయని బయ్యర్లు భావిస్తుంటారు. కానీ మార్చి 29న వచ్చిన 'రాబిన్ హుడ్' (Robinhood) మూవీ నితిన్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది. దర్శకుడు వెంకీ కుడుముల సినిమా ప్రచారంపై చూపించిన శ్రద్థ మేకింగ్ మీద చూపించి ఉంటే... మూవీ మరో మెట్టుపైన ఉండేదనే విమర్శలు వచ్చాయి. వీళ్ళందరి కథ ఒక్కటైతే... 'డీజే టిల్లు, టిల్లు స్క్వేర్' చిత్రాలతో విజయ పథంలో సాగుతున్న సిద్థు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) 'జాక్' (Jack) మూవీ పరాజయం కావడం మరో ఎత్తు. 'బొమ్మరిల్లు' భాస్కర్, సిద్థు ఫస్ట్ కాంబినేషన్ ల వచ్చిన ఈ సినిమా ఏ వర్గాన్ని మెప్పించలేకపోయింది. పైగా సిద్థు గత చిత్రాలతో పోల్చలేనంత తక్కువగా ఓపెనింగ్స్ సాధించింది. ఇందులో కొన్ని సినిమాల హీరోలు, దర్శక నిర్మాతలైతే... విడుదలకు ముందు సక్సెస్ ఖాయమంటూ చెప్పిన మాటలను జనం బాగా గుర్తుపెట్టుకుని గుణపాఠం చెప్పారని కొందరు వ్యాఖ్యానించారు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందనే సామెత ఊరికే రాలేదనీ కొందరు అన్నారు. ఏదేమైనా... సినిమా రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లాలంటే... పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా సక్సెస్ కావాలి. యంగ్ హీరోస్ సినిమాలు సక్సెస్ అయితేనే... అందరికీ పని ఉంటుంది. అలాంటి రోజు రావాలని, వీరందరికి విజయాలు దక్కాలని కోరుకుందాం.

Also Read: Hit 3: నేచురల్ స్టార్ నాని విధ్వంసం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 14 , 2025 | 03:31 PM