Narne Nithiin: మూడో సినిమాతోనూ హిట్ కొట్టాడు!

ABN , Publish Date - Mar 29 , 2025 | 02:13 PM

నార్నే నితిన్ హీరోగా నటించిన మూడో చిత్రం మ్యాడ్ స్క్వేర్ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాతో ఈ యంగ్ హీరోగా హ్యాట్రిక్ సాధించాడు.

మ్యాన్ ఆఫ్‌ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (NTR) బావమరిది నార్నే నితిన్ (Narne Nithiin) సైలెంట్ గా వచ్చి హ్యాట్రిక్ సాధించేశాడు. అతని మూడో చిత్రం 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) శుక్రవారం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. సరిగ్గా రెండేళ్ళ క్రితం 2023 అక్టోబర్ 6న అతను నటించిన 'మ్యాడ్' (Mad) మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నార్నే నితిన్, సంగీత శోభన్ (Sangeeth Sobhan) , రామ్ నితిన్ (Ram Nithin) కూడా కీలక పాత్రలు పోషించారు. కానీ మేకర్స్ మాత్రం సంగీత్ శోభన్ హీరో అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు. అందుకే సంగీత్ శోభన్ కే డెబ్యూ హీరోగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లభించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత యేడాదికి ఆగస్ట్ 15న 'ఆయ్' (Aay) మూవీ వచ్చింది. ఈ సినిమాలో నార్నే నితిన్ సోలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అలానే 'మ్యాడ్'కు సీక్వెల్ గా వచ్చిన 'మ్యాడ్ స్క్వేర్' మార్చి 28న విడుదలై ఈ వీకెండ్ లో వచ్చిన సినిమాల్లో బెటర్ మూవీ అనిపించుకుంది. 'మ్యాడ్'ను తెరకెక్కించిన కళ్యాణ్ శంకరే ఈ మూవీనీ డైరెక్ట్ చేశాడు. విశేషం ఏమంటే... ఈ మూవీ క్లయిమాక్స్ లో అసలు సిసలు ట్విస్ట్ ఇచ్చేది నార్నే నితినే! సో.. ఈ మూవీ వరకూ అతనే హీరో!


narne.jpeg

ఇదిలా ఉంటే... నార్నే నితిన్ మొదటి సినిమాగా 'మ్యాడ్' వచ్చింది కానీ... అది అతను యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ కాదు. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహించిన 'శ్రీశ్రీశ్రీ రాజావారు' మూవీ అతని మొదటి చిత్రం. కానీ ఈ సినిమా విడుదలలో జాప్యం జరగడంతో 'మ్యాడ్' ముందు విడుదలైంది. అంతేకాదు.... దాని తర్వాత కూడా రెండు సినిమాలు వచ్చి, అవి కూడా చక్కని విజయాన్ని అందుకుని నార్నే నితిన్ ను హ్యాట్రిక్ హీరోను చేసేశాయి. అతి త్వరలోనే 'శ్రీశ్రీశ్రీ రాజావారు' సైతం జనం ముందుకు తీసుకొస్తామని మేకర్స్ చెబుతున్నారు.

ఇక్కడ మరో విశేషం ఏమంటే... మార్చి 28న ఇద్దరు నితిన్ లు నటించిన రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి నార్నే నితిన్ 'మ్యాడ్ స్క్వేర్' కాగా రెండోది ఇతనితో పోల్చితే కాస్తంత సీనియర్ అయిన హీరో నితిన్ రెడ్డి. కానీ నితిన్ మూవీ 'రాబిన్ హుడ్' ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. ఆ రకంగా ఈసారి సీనియర్ నితిన్ పై జూనియర్ నితిన్ దే పైచేయి అయ్యింది! అన్నట్టు... నార్నే నితిన్ త్వరలో పెళ్ళి పీటలు కూడా ఎక్కబోతున్నాడు. ఇటీవలే అతని నిశ్చితార్థం శివానీ తాళ్ళూరితో జరిగింది. సో... అన్నీ మంచి శకునములే అంటూ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ముందుకు సాగిపోతున్నాడు.

Also Read: Balakrishna: ఉగాది రోజున ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 29 , 2025 | 02:17 PM