నాన్నకు ప్రేమతో..
ABN , Publish Date - Mar 20 , 2025 | 02:41 AM
ప్రస్తుతం మంచు కుటుంబంలో యుద్ధవాతావరణం నెలకొని ఉంది. ముఖ్యంగా తండ్రీకొడుకులు మోహన్‌బాబు, మనోజ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండే పరిస్థితి. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. తను సంపాదించిన...
‘దక్ష’ లో మోహన్‌బాబు
ప్రస్తుతం మంచు కుటుంబంలో యుద్ధవాతావరణం నెలకొని ఉంది. ముఖ్యంగా తండ్రీకొడుకులు మోహన్‌బాబు, మనోజ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండే పరిస్థితి. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. తను సంపాదించిన ఆస్తులు, కట్టుకున్న ఇల్లు మనోజ్ ఆక్రమించాడని మోహన్‌బాబు స్వయంగా రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసుల సాయంతో మనోజ్‌ను హైదరాబాద్ జల్‌పల్లిలో ఉన్న తన ఇంటి నుంచి వెళ్లగొట్టారు మోహన్‌బాబు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మోహన్‌బాబు పుట్టిన రోజు వేడుకలు బుధవారం జరిగాయి. తండ్రి పుట్టినరోజు సందర్భంగా మనోజ్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ‘హ్యాపీ బర్త్‌డే నాన్నా.. మనమంతా కలసి వేడుకలు చేసుకునే ఈ రోజు మీ పక్కనే ఉండే అవకాశాన్ని కోల్పోయా. మీతో కలసి ఉండే క్షణాల కోసం ఎదురు చూస్తున్నా.. లవ్ యూ’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. మనోజ్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీనిపై మోహన్‌బాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
విశ్వామిత్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు
తన తండ్రి మోహన్‌బాబు పుట్టినరోజు సందర్భంగా నటి మంచు లక్ష్మీప్రసన్న ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ముఖ్య పాత్రధారిగా తను నిర్మిస్తున్న ‘దక్ష’ చిత్రంలోని లుక్‌ను షేర్ చేసి ‘‘మా ప్రొఫెసర్, డాక్టర్. విశ్వామిత్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. ‘కన్నప్ప’ సినిమాలో మోహన్‌బాబు మహదేవ శాస్త్రిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ‘ఓం నమః శివాయ’ అనే పాటలో ఆయన పాత్రకు సంబంధించిన వీడియో గ్లింప్స్‌ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలిపారు మేకర్స్.