W/O Anirvesh: ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ జీవితం.. త్వరలో
ABN , Publish Date - Feb 01 , 2025 | 06:16 PM
ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ తనకి వచ్చిన ఇబ్బందులను, తనకి తెలిసిన కళతో ఎలా దూరం చేసుకున్నాడనే కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘వైఫ్ ఆఫ్ అనిర్వేష్’. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
ఫేమస్ ఆర్టిస్ట్‌ల వాయిస్‌లను అన్వయించడం, జంతువులు ఎలా అరుస్తాయో అలా అరిసి చూపించడం వంటి యాక్ట్‌ల ఉన్న కళ మిమిక్రీ. ఎందరో మిమిక్రీ కళాకారులు సినిమా అవకాశాలను సైతం సొంతం చేసుకున్నారు. ఎప్పుడూ నవ్విస్తూ ఎంటర్‌టైన్ చేసే వారి జీవితాలలోనూ ఇబ్బందులు ఉంటాయని తెలిపేందుకు ఇప్పుడో చిత్రం రాబోతోంది. ఆ సినిమానే ‘W/O అనిర్వేష్’. మహేంద్ర గజేంద్ర సమర్పణలో గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మిస్తున్నారు. గంగ సప్తశిఖర దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ విడుదల చేశారు.
Also Read- Janhvi Kapoor: జాన్వీ కపూర్ కండోమ్ యాడ్‌కు పర్ఫెక్ట్.. కండోమ్ సంస్థ అధినేత
ఫస్ట్ లుక్ విడుదల అనంతరం ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. ఒక సరికొత్త కాన్సెప్ట్ ఇది. ఇప్పటి వరకు బహుశా ఎవరూ ట్రై చేయలేదని అనుకుంటున్నాను. అద్భుతమైనటువంటి స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ ‘W/O అనిర్వేష్’ చిత్రం కచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా సంతోషం. మూవీ యూనిట్‌కు నా అభినందను తెలియజేస్తున్నానని అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ జీవితంలో జరిగిన ఇబ్బందులని తనకు తెలిసిన కళతో ఎలా ఎదుర్కొని పరిష్కరించాడు అనేది దర్శకుడు ఎంతో ఆసక్తిగా తెరకెక్కించారు. మా బ్యానర్‌లో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది. ఈ చిత్రాన్ని ఎస్ కె ఎం ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర మరియు తెలంగాణలో అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ ఎడిటింగ్. ‘లింక్డ్ స్క్రీన్‌ప్లే’ అనే ఫిలిం టెక్నిక్‌తో ఎడిటర్ హేమంత్ నాగ్ కొత్త తరహా ఎడిటింగ్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని తెలిపారు. రాంప్రసాద్, జెమినీ సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, సాయి కిరణ్, నజియా ఖాన్, అద్వైత చౌదరి తదితరులు నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది.