హీరోలు నమస్కారాలు పెట్టాలనుకునేంత లో లెవల్‌ వ్యక్తులం కాము

ABN , Publish Date - Jan 05 , 2025 | 06:28 AM

‘‘సినిమా టికెట్ల పెంపుతో హీరోలకు పనేంటి? ప్రభుత్వాల దగ్గరకు హీరోలు ఎందుకు రావాలి? అది మాకు ఇష్టం లేదు. నిర్మాతలు రండి. ఒక ట్రేడ్‌ బాడీ లేదా యూనియన్‌గా రండి. మేం అనుమతులు ఇస్తాం. అంతేగానీ హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి అని ఆలోచించేంత లో లెవల్‌ వ్యక్తులం కాదు మేం’ అని....

  • సినీ పరిశ్రమంటే చంద్రబాబుకు గౌరవం

  • ‘బ్లాక్‌’ నిరోధానికే టికెట్ల ధరల పెంపు

  • నిర్మాతలకే కాదు.. ప్రభుత్వానికీ 18 శాతం జీఎస్టీ రూపంలో ఆదాయం

  • ‘మెగా’ కుటుంబానికి అహంకారం లేదు

  • ‘గేమ్‌ఛేంజర్‌’ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలు

‘‘సినిమా టికెట్ల పెంపుతో హీరోలకు పనేంటి? ప్రభుత్వాల దగ్గరకు హీరోలు ఎందుకు రావాలి? అది మాకు ఇష్టం లేదు. నిర్మాతలు రండి. ఒక ట్రేడ్‌ బాడీ లేదా యూనియన్‌గా రండి. మేం అనుమతులు ఇస్తాం. అంతేగానీ హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి అని ఆలోచించేంత లో లెవల్‌ వ్యక్తులం కాదు మేం’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గేమ్‌చేంజర్‌’. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించారు. ఈనెల 10న విడుదలవుతోంది. శనివారం రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టికెట్ల ధరల పెంపుతో కేవలం నిర్మాతలకు మాత్రమే కాకుండా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తోందని తెలిపారు. ప్రతి టికెట్‌పై ప్రభుత్వానికి 18శాతం జీఎస్టీ రూపంలో ఆదాయం సమకూరుతోందన్నారు. ఇదంతా డిమాండ్‌, సప్లయ్‌ ఆధారంగా జరుగుతోందని తెలిపారు. అంతేకాదు.. బ్లాక్‌ టికెట్ల విక్రయాలను నిరోధించేందుకు కూడా ఇది దోహద పడుతుందన్నారు. గత ప్రభుత్వంలో తన సినిమా ‘భీమ్లా నాయక్‌’కు టికెట్లు పెంచకపోగా తగ్గించేశారని తెలిపారు. సినిమా హీరోలు వచ్చి నమస్కారాలు పెట్టాలని తాము కోరుకోబోమని, గతంలో ఎప్పుడూ ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయాలనుకోలేదన్నారు. కానీ, గత ప్రభుత్వం(వైసీపీ) మాత్రం తాను అభిమానించే చిరంజీవితోపాటు ప్రభాస్‌, మహేశ్‌బాబు వంటి హీరోలను రప్పించుకుందని అన్నారు. తాము మాత్రం అలా కోరుకోలేదని చెప్పారు. ‘‘ఎక్కువమంది హీరోలు కూటమికి సపోర్టు చేయలేదు. అయినా మేం సినిమా పరిశ్రమకు రాజకీయ రంగు పులమం. మేం నిర్మాతలతో మాట్లాడతాం. వారిని గుర్తిస్తాం. టికెట్‌ ధరల పెంపు కోసం హీరోలు రావక్కర్లేదు. మేం అల్పస్థాయి వ్యక్తులం కాదు’’ అని పరోక్షంగా వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్‌ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలతో వ్యవహరించిన తీరును డిప్యూటీ సీఎం తప్పుబట్టారు. తమకు సినిమా పరిశ్రమ మీద గౌరవం ఉందన్నారు. చంద్రబాబు నాలుగోసారి సీఎంగా ఉన్నారని, ఆయన ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమకు మేలు చేశారు తప్ప ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం కూడా తమకు ఇష్టం లేదన్నారు. టికెట్ల పెంపు అంశంపై ప్రతిసారీ తప్పడు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయాలు చేయొద్దు


‘‘సినిమాలు తీసేవాళ్లే మాత్రమే చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలి. సినిమాలు తీయని వాళ్లు మాట్లాడొద్దు. సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసేవాళ్లు మాకు నచ్చరు. ఈ మాట నేను ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం తరఫున చెబుతున్నా. ఎన్టీఆర్‌ పాటించిన ఔన్నత్యాన్ని మేం పాటిస్తున్నాం’’ అని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. సినిమాలు తీసి, దాని సాధకబాధకాలు తెలిసిన వారితోనే తాము మాట్లాడతామని స్పష్టం చేశారు. దర్శకుడు శంకర్‌ సామాజిక బాధ్యతతో సినిమాలు తీస్తారని పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. ‘‘ఆయన తీసిన సినిమా ‘జంటిల్‌మెన్‌’కు నేను కూడా బ్లాక్‌లో టికెట్‌ కొనుక్కొని వెళ్లా. అదో సరదా. ఇలానే చాలామంది అభిమానులు తమకు ఇష్టమైన హీరో సినిమాలకు వెళ్తారు. వారి డబ్బులు ‘బ్లాక్‌’లోకి వెళ్లకుండా నిర్మాతలకు, తద్వారా ప్రభుత్వానికి ఆదాయం రూపంలో వస్తేనే మంచిది’’ అని వ్యాఖ్యానించారు.

ఈ సంస్కృతి సరికాదు


నేనైనా, రామ్‌చరణ్‌ అయినా చిరంజీవి ఇచ్చిన ఊతంతోనే నిలబడగలిగాం. తండ్రి మెగాస్టార్‌ అయితే కొడుకు గ్లోబల్‌స్టార్‌ అయ్యాడు. ‘గేమ్‌ చేంజర్‌’ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు. ‘మెగా’ కుటుంబంలో ఎవరికీ అహంకారం లేదని, ఎవరి పట్లా వివక్ష చూపదని అన్నారు. ‘‘వేరే హీరోలను ద్వేషించే కుటుంబం కాదు మాది. ఒక హీరో సినిమా పోవాలని కూడా కోరుకోం. అందరూ బాగుండాలనే ఆలోచనను మా నాన్న నేర్పారు. సర్వేజనా సుఖినోభవంతు అని చెప్పారు’’ అన్నారు.

ఆ ఔన్నత్యం కావాలి!

‘‘మహానుభావుడు ఎన్టీఆర్‌ నుంచి ఎన్నో నేర్చుకోవాలి. కోట శ్రీనివాస్‌ వంటి నటులు ఎన్ని విమర్శలు చేసినా, షూటింగ్‌లో కలిసినప్పుడు మాత్రం.. ‘ఏం బ్రదర్‌ ఎలా ఉన్నార’ని ఎన్టీఆర్‌ కుశల ప్రశ్నలు వేసేవారు. కృష్ణ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నా, ఇద్దరూ కలుసుకున్నప్పుడు ఆప్యాయంగా మాట్లాడుకునేవారు. అలా చిత్రపరిశ్రమ ఔనత్యాన్ని పెంచాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ హితవు పలికారు.

-రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి)


‘‘అడగ్గానే టికెట్ల ధరలు ఎందుకు పెంచారని, ఎందుకు పెంచాలని కొందరు అడుగుతుంటారు. సినిమాకు ‘డిమాండ్‌-సప్లయ్‌’ సూత్రం వర్తిస్తుంది. సినిమా విడుదలైన మొదటి రోజే చూడాలనుకోవడం డిమాండ్‌. ఇవాళ తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. దానికి తగ్గట్లు సినిమాలు ఉండాలి. సినిమాలు అలా తీయాలంటే డబ్బు కావాలి. అందుకే టికెట్ల ధరలు పెంచాలని కోరతారు’’

- పవన్‌ కల్యాణ్‌

Updated Date - Jan 05 , 2025 | 06:28 AM