Tollywood: మూడు నెలల్లో మిశ్రమ స్పందన
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:53 PM
ఈ యేడాది తొలి మూడు మాసాలలో 77 సినిమాలు విడుదలైతే అందులో ఆరు చిత్రాలు మాత్రమే ఆశించిన స్థాయిలో విజయాలను అందుకున్నాయి.
కొత్త సంవత్సరంలో చూస్తుండగానే మూడు నెలలు గడిచిపోయాయి. జనవరి నుండి మార్చి నెలాఖరు వరకూ తెలుగులో 77 సినిమాలు వచ్చాయి. ఇందులో 56 స్ట్రయిట్ తెలుగు సినిమాలు కాగా 21 డబ్బింగ్ సినిమాలు. అయితే ఈ మొత్తం సినిమాలలో సాలీడ్ గా నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు ఆరు మాత్రమే! ఈ యేడాది జనవరిలో మొత్తం 23 సినిమాలు వస్తే.. అందులో రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' (Game Changer) తీవ్ర నిరాశ పర్చగా... వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vastunnam) సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సీనియర్ స్టార్ హీరోలలో రూ. 300 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిన హీరోగా వెంకటేశ్ ను అగ్రస్థానంలో నిలబెట్టింది. అదే సంక్రాంతికి వచ్చిన బాలకృష్ణ 'డాకు మహరాజ్' (Daaku Maharaj) సినిమా సైతం అభిమానులను మెప్పించి విజయపథంలో సాగింది. ఈ నెలలో వచ్చిన ఇతర చిత్రాలేవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు.
ఫిబ్రవరి మాసంలో ఇరవై మూడు సినిమాలు విడుదలైతే.. అందులో 17 స్ట్రయిట్ తెలుగు సినిమాలు, ఆరు డబ్బింగ్ చిత్రాలు. ఫిబ్రవరి 7న విడుదలైన 'తండేల్' (Thandel) మూవీ చక్కని విజయాన్ని సాధించడమే కాదు... నాగచైతన్యను రూ. 100 కోట్ల క్లబ్ లో తొలిసారి చేర్చేసింది. ఇదే నెలలో వచ్చిన పలు చిత్రాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. 'లైలా, బ్రహ్మానందం, బాపు, రామం రాఘవం, మజాకా' వంటి చిత్రాలు బాక్సాఫీస్ లో ప్రభావం చూపలేకపోయాయి.
మార్చి నెలలో మొత్తం 31 చిత్రాలు విడుదల కాగా అందులో 24 స్ట్రయిట్ తెలుగు సినిమాలు, 7 డబ్బింగ్ చిత్రాలు. ఇందులో రెండు సినిమాలు అనూహ్య విజయాన్ని అందుకున్నాయి. నాని, ప్రశాంతి తిపుర్నేని నిర్మించిన 'కోర్ట్' (Court) మూవీ అందులో ఒకటి. ఈ మంచి విజయాన్ని అందుకుని రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది. 'డార్లింగ్' మూవీ పరాజయంతో డీలా పడ్డ ప్రియదర్శి కెరీర్ కు 'కోర్ట్' కొత్త ఊపిరిని అందించింది. ఇదే నెలలో 28న వచ్చిన 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) కూడా యూత్ ను ఆకట్టుకుంది. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడమే కాదు... రన్ కూడా బాగానే ఉండేలా కనిపిస్తోంది. ఈ నెలలో వచ్చిన ఇతర చిత్రాలు 'దిల్ రుబా, పెళ్ళికాని ప్రసాద్, షణ్ముఖ, రాబిన్ హుడ్' నిరాశ పర్చాయి.
గడిచిన మూడు నెలల్లో వచ్చిన 21 డబ్బింగ్ మూవీస్ లో ఒక్క సినిమా మాత్రమే తెలుగు వారికి లాభాలు తెచ్చిపెట్టింది. విశాల్ నటించిన 'మదగజరాజా', విష్ణువర్థన్ 'ప్రేమిస్తావా', ధనుష్ డైరెక్ట్ చేసిన 'జాబిలమ్మ నీకు అంతకోపమా', ఆది పినిశెట్టి 'శబ్దం', జీవా 'అగాత్య', జీవీ ప్రకాశ్ 'కింగ్ స్టన్', విక్రమ్ 'వీరధీరశూరన్ -2', హిందీ డబ్బింగ్ చిత్రాలు 'ఛావా', 'కిస్ కిస్ కిస్సిక్', మలయాళ డబ్బింగ్ మూవీలు 'మార్కో', 'ఐడెంటిటీ', 'ఆఫీసర్', 'ఎంపురాన్'... తెలుగువారిని మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఈ మొత్తం సినిమాలలో ప్రదీప్ రంగనాథన్ నటించిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మాత్రమే విజయాన్ని సాధించింది.
మొత్తం మీద ఈ మూడు నెలల్లో సాలీడ్ హిట్ మూవీస్ అంటే కేవలం ఆరు మాత్రమే!
Also Read: L2: Empuraan : సినిమా పెట్టిన చిచ్చు....
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి