Nitin: రాబిన్ హుడ్ రేట్లూ పెంచేశారు

ABN , Publish Date - Mar 25 , 2025 | 01:11 PM

నితిన్, శ్రీలీల జంటగా నటించిన 'రాబిన్ హుడ్' చిత్రం మార్చి 28న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఏపీలో టిక్కెట్ రేట్లను పెంచుతూ జీవో జారీ చేశారు.

సినిమా టిక్కెట్ రేట్లను పెంచడం విషయంలో ప్రభుత్వాలకు ఓ పాలసీ ఉన్నట్టుగా అనిపించడం లేదు. నిర్మాతలు కోరితే చాలు ప్రత్యేక షోస్ ప్రదర్శనకు అనుమతితో పాటు టిక్కెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చేస్తున్నారు. ఈ విషయంలో అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రభుత్వాలను కోర్టులు హెచ్చరించాయి. పదహారేళ్ళ లోపు పిల్లలను అర్థరాత్రి షోస్ కు అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. అయితే ఆ తర్వాత సెకండ్ షోస్ వరకూ ఓకే చెప్పాయి. కానీ ఈ విషయంలో సినిమా వాళ్ళు సంబంధితులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోమని కోర్టులు సలహా ఇచ్చాయి. అలానే బెనిఫిట్ షోస్ ను, వాటి ప్రదర్శన కోసం అడ్డగోలుగా టిక్కెట్ రేట్లను పెంచడాన్ని కూడా తప్పు పట్టాయి. దీంతో తెలంగాణ సర్కార్ ఈ విషయంలో కాస్తంత పట్టుగానే ఉందని, కానీ ఏపీలో మాత్రం టిక్కెట్ రేట్లు పెంచుకునే విషయంలో ప్రభుత్వ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.


మార్చి 28న నితిన్ (Nitin) హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ (Mythri Movie Makers) నిర్మించిన 'రాబిన్ హుడ్' (Robinhood) మూవీ జనం ముందుకు వస్తోంది. ఈ చిత్ర నిర్మాతలైన నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఏపీ ప్రభుత్వాన్ని అ్రపోచ్ అయ్యి టిక్కెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతి కోరారు. దాంతో వారం రోజుల పాటు సింగిల్ థియేటర్లలో రూ. 50, మల్టీప్లెక్స్ లలో రూ. 75 చొప్పున పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. నిజానికి గత కొంత కాలంగా నితిన్ కి హిట్ లేదు. సినిమాకు ఓపెనింగ్స్ వస్తాయో రావో అనే డౌట్ కూడా ఉంది. దానికి తోడు ఇవాళ చిన్న సినిమాలు ఇబ్బడి ముబ్బడిగా విడుదల అవుతున్నాయి. అయితే అవి ఆశించిన స్థాయిలో ఉండకపోవడంతో రెండో ఆటకు జనాలు థియేటర్లకు రాని పరిస్థితి కనిపిస్తోంది. టిక్కెట్ రేట్ల ప్రభావం కూడా దీనిపై ఉంది. బాగున్న సినిమాలను పెద్ద, చిన్న అనే తేడా లేకుండా ప్రేక్షకులు చూస్తున్నారు. ఆదరిస్తున్నారు. ఇటీవల వచ్చిన 'కోర్ట్' (Court) సినిమా అందుకు ఉదాహరణ. లిమిటెడ్ బడ్జెట్ తో నాని (Naani), ప్రశాంతి తిపుర్నేని నిర్మించిన ఈ సినిమా రూ. 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇప్పుడు నితిన్ సినిమా టిక్కెట్ రేట్లను పెంచుకోవాలని మైత్రీ మూవీ మేకర్స్ వారు అనుకోవడం, ప్రభుత్వం వారి ఆలోచనలకు మద్దత్తు పలకడం ఎంత వరకూ వర్కవుట్ అవుతుందనే సందేహం ఉంది. నిజంగా సినిమాలో దమ్ము ఉంటే... ఖచ్చితంగా ఆడుతుంది, ప్రేక్షకులు ఆదరిస్తారు. అలా కాకుండా టిక్కెట్ రేట్లను పెంచేసి నిర్మాతలు త్వరత్వరగా సొమ్ము చేసుకోవాలనుకుంటే మాత్రం ప్రేక్షకులు ఝలక్ ఇవ్వటం ఖాయం. మరి సినిమాలో దమ్ము ఉందో లేదో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

Also Read: Shashtipoorthi: ఒక పాట కోసం ఇళయరాజా, బాలు, డీఎస్పీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 25 , 2025 | 01:25 PM