NBK Vs Raviteja: మరోసారి బరిలో...

ABN , Publish Date - Mar 24 , 2025 | 05:02 PM

ఇంతవరకూ బాలకృష్ణ, రవితేజ ఐదు సార్లు బాక్సాఫీస్ బరిలో పోటీ పడ్డారు. అత్యధిక శాతం రవితేజ దే పై చేయిగా నిలిచింది. ఇప్పుడు రీ-రిలీజ్ విషయంలోనూ వీరిద్దరూ పోటీ పడుతుండటం విశేషం.

నటసింహ బాలకృష్ణ (Balakrishna), మాస్ మహరాజా రవితేజ (Raviteja)కు మధ్య ఏదో జరిగింది అంటూ అప్పట్లో భలే టాక్ నడిచింది. వారి మధ్య ఏమీ జరగలేదని ఇద్దరూ బాలయ్య షో 'అన్ స్టాపబుల్'లో తేల్చి చెప్పేశారు. అయితే ఒకప్పుడు బాలయ్య సినిమాలతో రవితేజ చిత్రాలు పోటీగా రిలీజై అందరిలోనూ ఆసక్తిని కలిగించాయి. అలా బాలకృష్ణ, రవితేజ సినిమాలు ఇప్పటికి ఐదుసార్లు బాక్సాఫీస్ బరిలో ఢీ కొన్నాయి. పోటీ అంటే ఒకే రోజున స్టార్స్ మూవీస్ రావడం లేదా ఓ రోజు ముందు వెనకా సినిమాలు రిలీజ్ కావడం ఉంటుంది. కనీసం రెండు సినిమాలకు మధ్య వారం గ్యాప్ ఉన్నా సదరు చిత్రాల మధ్య పోటీ నెలకొందని చెప్పవచ్చు. ఈ తీరున బాలయ్య, రవితేజ మధ్య ఇప్పటికి ఐదు సార్లు బాక్సాఫీస్ వార్ సాగింది. ఇప్పుడు ఆరోసారి బరిలో ఢీ కొట్టబోతున్నారు ఈ ఇద్దరు హీరోలు. ఈ సారి మాత్రం ఇద్దరూ తమ రీరిలీజెస్ తో పోటీకి దిగడం మరింత ఆసక్తి కలిగిస్తోంది.

బాలకృష్ణ హీరోగా రూపొందిన 'ఆదిత్య 369' (Aditya 369) 1991లో విడుదలై సినీఫ్యాన్స్ ను విశేషంగా అలరించింది. ఈ చిత్రం ఏప్రిల్ 4న రీరిలీజ్ అవుతోంది. ఈ సినిమా రిలీజయిన మరుసటి రోజునే అంటే ఏప్రిల్ 5న రవితేజ హీరోగా తెరకెక్కిన 2004 నాటి 'నా ఆటోగ్రాఫ్ - స్వీట్ మెమోరీస్' జనం ముందుకు రానుంది. అది ఇప్పుడు సినీఫ్యాన్స్ లో చర్చకు తావిచ్చింది.


బాలయ్య, రవితేజ మధ్య పోటీ 2008లో మొట్టమొదటిసారి చోటు చేసుకుంది... అప్పట్లో జనవరి 11వ తేదీన సంక్రాంతి బరిలో బాలయ్య 'ఒక్క మగాడు'తో పాటే రవితేజ 'కృష్ణ' కూడా దూకింది... 'ఒక్కమగాడు' అట్టర్ ఫ్లాప్ కాగా, 'కృష్ణ' చిత్రం సూపర్ హిట్ గా నిలచింది... 2009లో బాలయ్య మిత్రుడు సినిమా మే 1న విడుదల కాగా, వారం తరువాత వచ్చిన రవితేజ 'కిక్' బంపర్ హిట్ అయింది. ఇక 2011 సంక్రాంతి సీజన్ లో జనవరి 12న బాలయ్య 'పరమవీర చక్ర' రిలీజ్ కాగా, మరుసటి రోజున రవితేజ 'మిరపకాయ్' వచ్చింది. కమర్షియల్ గా 'మిరపకాయ్' సక్సెస్ సాధించింది. 2012 మే 25న రవితేజ 'దరువు' వచ్చి పరవాలేదనిపించుకుంది. మరుసటి వారమే అనగా జూన్ 1వ తేదీన బాలయ్య త్రిపాత్రాభినయం చేసిన 'అధినాయకుడు' జనం ముందు నిలచింది. 'అధినాయకుడు' బాలయ్య ట్రిపుల్ రోల్ ఎస్సెట్ గా మంచి ఓపెనింగ్స్ చూసింది. ఏది ఏమైనా నాలుగు సార్ల పోటీలో మూడు సార్లు రవితేజదే పైచేయిగా సాగింది. ఒకసారి ఇద్దరూ సో సో గా సాగారు. ఐదవసారి పోటీలో బాలయ్య సినిమా పై చేయి అనిపించుకుంది. 2023 అక్టోబర్ 19న బాలయ్య 'భగవంత్ కేసరి' విడుదల కాగా, మరుసటి రోజున రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'గా వచ్చారు. ఈ సారి 'భగవంత్ కేసరి' బంపర్ హిట్ గా నిలచింది.


తమ కొత్త చిత్రాలతో ఐదుసార్లు పోటీపడ్డ బాలయ్య, రవితేజ ఈ సారి రీ-రిలీజెస్ తోనూ ఢీ కొనడం విశేషంగా మారింది. బాలకృష్ణ 'ఆదిత్య 369' సినిమా అప్పట్లో విశేషాదరణ చూరగొంది. 1991లో వచ్చిన 'ఆదిత్య 369' నటునిగా బాలయ్యకు ఎంతో పేరు సంపాదించి పెట్టింది. ఈ సినిమా ఏప్రిల్ 4వ తేదీన మరోమారు జనం ముందుకు వస్తోంది. మరుసటి రోజున రవితేజ 'నా ఆటోగ్రాఫ్ - స్వీట్ మెమోరీస్' విడుదలవుతోంది. 2004లో వచ్చిన 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్' సినిమా రవితేజకు వరైటీ అనిపించిందే తప్ప విజయం సాధించలేదు. మరి బాలయ్య హిట్ మూవీతో ఈ సారి రవితేజ ఫ్లాప్ పిక్చర్ పోటీ పడుతోంది. మరి ఈ సారి బాక్సాఫీస్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: Emraan Hashmi: ఆవారాపన్ -2 ఆగమనం ఎప్పుడంటే...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 24 , 2025 | 05:02 PM