Gaddar Telangana Film Awards: ఆ అవార్డులు కొనసాగుతాయి...
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:41 PM
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులను ఇవ్వడంతో పాటు గతంలో ఉన్న ఎన్టీఆర్ జాతీయ అవార్డులు, రఘుపతి వెంకయ్య అవార్డు, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి - చక్రపాణి అవార్డులనూ ఇవ్వబోతోంది.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నంది అవార్డులు అటకెక్కాయి. రెండు తెలుగు ప్రభుత్వాలు వాటి ఊసే ఎత్తలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తాను అధికారంలోకి రాగానే నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇస్తామని ప్రకటించారు. దానికి సంబంధించిన కార్యచారణ కూడా మొదలెట్టారు. బి. నరసింగరావు ఛైర్మన్ గా ఓ కమిటీని వేసి, విధి విధానాలను ఖరారు చేశారు. 2014 నుండి 2023 వరకూ యేడాదికి ఒక ఉత్తమ చిత్రానికి అవార్డు ఇస్తామని తెలిపారు. అలానే 2024 నుండి వివిధ కేటగిరిల్లోనూ అవార్డులను ఇస్తామన్నారు. దరఖాస్తులకు పిలుపు నివ్వడంతో పాటు సెలక్షన్ కమిటీనీ వేశారు. విశేషం ఏమంటే.... గద్దర్ ఫిల్మ్ అవార్డులతో పాటు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పలు అవార్డులను సైతం తిరిగి ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ఈ విషయమై తెలుగు నిర్మాతల మండలి తమ హర్షాన్ని వెలిబుచ్చుతూ ఓ లేఖను విడుదల చేసింది.
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ తో పాటు గతంలో ఉన్న ఎన్టీఆర్ జాతీయ అవార్డు; బి.ఎన్. రెడ్డి ఫిల్మ్ అవార్డు; నాగిరెడ్డి - చక్రపాణి ఫిల్మ్ అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డులను కూడా ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వబోతోంది. వీటితో పాటుగా కొత్తగా పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డును, కాంతారావు ఫిల్మ్ అవార్డును జత చేశారు. సినిమా రంగానికి సేవలు అందిస్తున్న ప్రముఖులను ప్రభుత్వం ఈ అవార్డులతో సత్కరించబోతోంది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, తెలంగాణ ఎఫ్.డి.సి. ఛైర్మన్ దిల్ రాజు కు తెలుగు నిర్మాతల మండలి ధన్యవాదాలు తెలిపింది. ప్రభుత్వం ఇవ్వబోతున్న అవార్డుల పట్ల చిత్రసీమ హర్షాన్ని వ్యక్తం చేస్తోందని ఆ ప్రకటనలో పేర్కొంది.
Also Read: Committee Kurrollu: నిహారిక కొణిదెల రెండో సినిమా....
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి