Tanikella Bharani: నాటక కళాకారులకు వెలుగునిస్తోంది
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:07 AM
నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఆంధ్ర నాటకకళాపరిషత్ 96వ వార్షిక జాతీయ నాటకోత్సవంలో పాల్గొని, నాటక కళాకారులకు ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 'కొత్త పరిమళం', 'మా ఇంట్లో మహాభారతం' నాటికలు ఆకట్టుకున్నాయి
- తనికెళ్ల భరణి
ఎందరో మహానుభావులు నాటక రంగానికి సేవలందిస్తూ, కళాకారులను ప్రోత్సహిస్తున్నారని నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. ఆంధ్ర నాటకకళాపరిషత్ 96వ వార్షిక జాతీయ నాటకోత్సవాల్లో భాగంగా అమీర్‌పేటలోని కమ్మసంఘం హాల్‌లో కొనసాగుతున్న పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలకు శుక్రవారం తనికెళ్ల భరణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో మంచి నాటికలు, నాటకాలను ఇప్పటికీ ప్రజలు ఆదరిస్తుండడం వెనుక ఎంతో మంది. కృషి దాగుందన్నారు. నాటక కళాకారులకు వెలుగునిస్తున్న ఆంధ్రనాటక కళాపరిషత్ కృషిని కొనియాడారు. అంతకుముందు శార్వాణీ గ్రామీణ సాంస్కృతిక సేవా సంస్థ ప్రదర్శించిన ‘కొత్త పరిమళం’, మద్దుకూరి ఆర్ట్స్ క్రియేషన్స్ వారు ప్రదర్శించిన ‘మా ఇంట్లో మహాభారతం’ నాటికలు ఆకట్టుకున్నాయి. రావులపాలెంకు చెందిన సామాజిక సేవకుడు డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డికి ఆంధ్రనాటక కళాపరిషత్ జీవిత సాఫల్య సాధన పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు లోని ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ, కమ్మసంఘం ప్రధాన కార్యదర్శి మేకా రామకృష్ణ, హాస్యనటుడు గౌతంరాజు తదితరులు పాల్గోన్నారు.
అమీర్‌పేట, (ఆంధ్రజ్యోతి)