కార్తీక్‌ స్టైల్లో ఆకట్టుకుంటుంది

ABN , Publish Date - Apr 27 , 2025 | 01:28 AM

‘‘రెట్రో’ కార్తీక్‌ సుబ్బరాజ్‌ స్టైల్లో ఉండే సినిమా. ఆయన శైలి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. మంచి సినిమాటిక్‌ అనుభూతినిస్తుందీ చిత్రం. ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఇందులో చాలా మంది గొప్పవారితో కలసి...

‘‘రెట్రో’ కార్తీక్‌ సుబ్బరాజ్‌ స్టైల్లో ఉండే సినిమా. ఆయన శైలి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. మంచి సినిమాటిక్‌ అనుభూతినిస్తుందీ చిత్రం. ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఇందులో చాలా మంది గొప్పవారితో కలసి నటించడం మరిచిపోలేని అనుభూతి’’ అని హీరో సూర్య చెప్పారు. ఆయన కథానాయకుడిగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ తెరకెక్కించిన చిత్రం ‘రెట్రో’. మే1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శనివారం ప్రీరిలీజ్‌ వేడుక ఏర్పాటు చేశారు. సూర్య మాట్లాడుతూ ‘నాపై మీరు చూపిస్తోన్న ప్రేమ ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. సంతో్‌షనారాయణ్‌గారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఈ సినిమాకు తెలుగులో కాసర్ల శ్యామ్‌ హృదయానికి హత్తుకునే లిరిక్స్‌ ఇచ్చారు. ‘రెట్రో’తో పాటు నా మిత్రుడు నాని నటించిన ‘హిట్‌ 3’ కూడా ఘనవిజయం సాధించాలి. చిరంజీవిగారి బ్లడ్‌ బ్యాంక్‌ స్ఫూర్తితోనే ‘అగరం’ ఫౌండేషన్‌ స్థాపించా. మీ ప్యాషన్‌ను వెతుక్కుంటూ వెళ్లండి. అదే మీకు దారి చూపుతుంది. నన్ను ఇన్నేళ్లుగా సపోర్ట్‌ చేస్తున్న అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అన్నారు. ముఖ్య అతిథి విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘సూర్య అన్న సినిమాలను నేను స్కూల్‌, కాలేజీ డేస్‌లో విపరీతంగా చూసేవాడ్ని. ‘గజనీ’ సినిమా చూశాక, ఆయన యాక్టింగ్‌తో ప్రేమలో పడిపోయా. ఆయనను కలవాలని చాలా సార్లు ప్రయత్నించాను. ఇప్పటికి కుదిరింది. ఈ సందర్భం నాకు చాలా ప్రత్యేకం. ఆయనలా ప్రయోగాత్మక పాత్రలు చేయాలంటే చాలా ధైర్యం కావాలి. సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను. ‘అగరం’ ఫౌండేషన్‌ ద్వారా ఆయన చేసే సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకం’’ అని అన్నారు.


‘‘ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ హక్కులు ఇచ్చిన సూర్యగారికి కృతజ్ఞతలు. ఆయన హీరోగా నేను నిర్మిస్తోన్న సినిమా గురించే ఇప్పుడేమీ చెప్పను. అది ప్రేక్షకుల ఊహకే వదిలేస్తున్నాను’’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. ‘‘ఒక సినిమా కోసం ఓ యాక్టర్‌ ఎంతలా కష్టపడతాడో గజనీ’ చూశాకే తెలిసింది. ఆయన చేసిన సినిమాలు జీవిత పాఠాలు’’ అని దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పారు.

Updated Date - Apr 27 , 2025 | 01:28 AM