Sumaiah Reddy Actress: మంచి కథను అందించాలనే

ABN , Publish Date - Apr 13 , 2025 | 11:58 PM

సుమయ రెడ్డి నిర్మించిన మరియు కథానాయికగా నటించిన చిత్రం ‘డియర్ ఉమ’ ఈ శుక్రవారం విడుదల కానుంది. వైద్య వ్యవస్థ ప్రక్షాళన, ప్రేమ కథతో కూడిన ఈ సినిమా ప్రేక్షకులకు మెసేజ్ ఇవ్వడమే లక్ష్యం

  • సుమయ రెడ్డి

‘నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఆసక్తి. ఇంట్లో ఎక్కువగా బాలకృష్ణ గారి సినిమాలే చూసేవాళ్లం. చదువు పూర్తయ్యాక కొన్నాళ్లు మోడలింగ్‌ చేశా. సినిమాల్లో నటించాలనేది నా చిరకాల కోరిక. అందుకని చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను’ అని అన్నారు సుమయ రెడ్డి. ఆమె నిర్మిస్తూ కథానాయికగా నటించిన చిత్రం ‘డియర్‌ ఉమ’. సాయి రాజేశ్‌ మహదేవ్‌ దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సుమయ రెడ్డి ‘చిత్రజ్యోతి’తో మాట్లాడుతూ ‘ఓ మంచి కథను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ‘డియర్‌ ఉమ’ కథ రాశాను. దర్శకుడు సాయి రాజేశ్‌ మహదేవ్‌ గారితో నాకు ఎన్నో ఏళ్ల పరిచయం ఉంది. అర్థవంతమైన కథ అందరికీ పనికొస్తుంది అన్నారు. నన్ను నమ్మి డబ్బులు పెట్టి సినిమా తీసేందుకు ఏ నిర్మాత ముందుకు వస్తారు అనే సంశయంలో పడిపోయా. అప్పుడు మా అమ్మ సపోర్ట్‌తో నేనే నిర్మాతగా సినిమా తీయాలని నిర్ణయించుకున్నా. నేడు కార్పోరేట్‌ ఆస్పత్రుల్లో చోటు చేసుకుంటున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. సొసైటీకి మెసేజ్‌ ఇవ్వడమే కాదు పరిష్కారాన్నీ చూపించే ప్రయత్నం చేశాం. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో పాటు ఈ సినిమాలో మంచి లవ్‌ ట్రాక్‌ కూడా ఉంది. హీరో, హీరోయిన్లు ఒకరి లక్ష్య సాధనకు మరొకరు ఎలా సాయపడ్డారనే అంశాన్ని అద్భుతంగా తెరకెక్కించాం. వీరిద్దరూ కలసి వైద్య వ్యవస్థ ప్రక్షాళనకు ఎలా పోరాడారన్నది ప్రధాన ఇతివృత్తం. ఒక తెలుగమ్మాయిగా నా సినిమాలో తెలుగు హీరోనే పెట్టాలనుకున్నాను. కొంతమందిని సంప్రదించాను కానీ డేట్స్‌ కుదరలేదు. అందుకని హీరోగా పృథ్వీ అంబర్‌ను ఎంచుకున్నాం’ అని అన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 11:59 PM