Good Bad Ugly: డీఎస్పీ తప్పుకోడానికి రీజన్ అతనే...
ABN , Publish Date - Mar 21 , 2025 | 06:48 PM
అజిత్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' నుండి దేవిశ్రీ ప్రసాద్ వైదొగడానికి కారణం ఏమిటో తెలుసా!?
అభిమానులు రాక్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఇటీవల కొన్ని విషయాల గురించి మనసు విప్పి మాట్లాడాడు. అందులో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly) మూవీ నుండి వైదొలగడం గురించి కూడా వివరించాడు. 'పుష్ప' (Pushpa) చిత్ర విజయంలో దేవిశ్రీ ప్రసాద్ కంట్రిబ్యూషన్ కూడా ఉంది. అంతేకాదు... ఆ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ ఏకంగా జాతీయ అవార్డును అందుకున్నాడు. అయితే 'పుష్ప-2' (Pushpa -2) సినిమాకు అతనిచ్చిన బాణీలు సైతం సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో దేవిశ్రీ ప్రసాద్ తో కాకుండా కొంత భాగానికి వేరే సంగీత దర్శకులతో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను ఇప్పించారు దర్శక నిర్మాతలు. ఈ విషయమై దేవిశ్రీ ప్రసాద్ బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. 'మనకు దక్కాల్సిన క్రెడిట్ విషయంలో పోరాటం చేసి అయినా దానిని పొందాల'ని పబ్లిక్ గా చెప్పాడు. దాంతో 'పుష్ప' నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కు దేవిశ్రీప్రసాద్ కు మధ్య చెడిందనే వార్తలు వచ్చాయి. 'పుష్ప -2' మూవీ రీ-రికార్డింగ్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ కు క్రెడిట్ ఇచ్చినా... మరో ఇద్దరు దర్శకుల పేర్లూ టైటిల్ కార్డ్స్ లో కనిపించాయి.
సరిగ్గా ఇదే సమయంలో అజిత్ (Ajith) హీరోగా మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తున్న తమిళచిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' నుండి దేవిశ్రీ తప్పుకున్నాడు. దాంతో... 'పుష్ప-2' టైమ్ లో వచ్చిన వివాదం కారణంగానే డీఎస్పీ ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలగాడనే పుకార్లు షికారు చేశాయి. దేవిశ్రీ ప్రసాద్ స్థానంలోకి ఆ తర్వాత జీవీ ప్రకాశ్ కుమార్ వచ్చాడు. నిజానికి దేవిశ్రీ ప్రసాద్ కంటే కూడా జీవీ ప్రకాశ్ యమా బిజీ. అతను ఓ పక్క హీరోగా నటిస్తూ, మరో పక్క పలు చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు. కానీ మైత్రీ ప్రాజెక్ట్ ను వదులుకోవడం ఇష్టం లేక దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ ఏప్రిల్ 10న జనం ముందుకు వస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా నుండి తను తప్పుకోవడానికి కారణాన్ని వివరించాడు. ఆ ప్రాజెక్ట్ నుండి వాకౌట్ చేయడానికి నిర్మాతలతో వచ్చిన సమస్య కారణం కాదని, డైరెక్టర్ అద్విక్ రవిచంద్రన్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి వైదొలిగానని చెప్పాడు. దేవిశ్రీ ప్రసాద్ చెప్పిన ఈ వివరణతో రాబోయే రోజుల్లో తిరిగి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో అతను సినిమా చేస్తాడనే ఆశలు అభిమానుల్లో చిగురించాయి.
Also Read: Keerthy Suresh: నువ్వేనా.. నేను కూడా ఆటాడిస్తా...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి