Aditya 369: సింగీతం చెప్పిన ఆదిత్య 369 ముచ్చట్లు

ABN , Publish Date - Apr 02 , 2025 | 03:11 PM

బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'ఆదిత్య 369' మూవీ ఏప్రిల్ 4న రీరిలీజ్ అవుతోంది. ఆ సందర్భంగా సింగీతం చెప్పిన విశేషాలు...

నందమూరి బాలకృష్ణ (Nandamuri Bala Krishna) హీరోగా నటించిన 'ఆదిత్య 369' (Aditya 369) ఆయన కెరీర్ లోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సినిమా. సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasarao) దర్శకత్వంలో శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad) 34 సంవత్సరాల క్రితం దీనిని నిర్మించారు. ఇప్పుడీ సినిమా ఏప్రిల్ 4న 4కె డిజిటలైజేషన్ తో, 5.1 సౌండ్ మిక్స్ తో జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సింగీతం శ్రీనివాసరావు అప్పటి మేకింగ్ ముచ్చట్లను గుర్తు చేసుకుని తెలిపారు. ఆయన వయస్సు ఇప్పుడు 93 సంవత్సరాలు.


అప్పటి మేకింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి చెబుతూ, ''చాలామంది ‘బ్యాక్ టు ద ఫ్యూచర్ ‘ ఇన్స్పిరేషన్ తో ఈ సినిమా తీశానని అంటారు. కానీ కాదు. నేను కాలేజీ రోజుల్లోనే హెచ్. జి. వెల్స్ రచించిన నవల ‘ది టైం మిషన్ ‘ చదివాను. అది వేరే కథ. టైం ట్రావెల్, సైన్స్, ఫిక్షన్.. ఇవన్నీ అందులో ఉంటాయి. నేను డైరెక్టర్ అయిన తర్వాత ఇది ఒక సబ్జెక్టుగా తీస్తే బాగుంటుందన్న ఆలోచనతో దానికి సంబంధించిన లైన్ ఆర్డర్ మొత్తం రఫ్ గా పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇది ఎలా చేద్దాం? ఎవరితో చేద్దాం? అని ఆలోచిస్తున్నప్పుడు.. బెంగళూరు ఫ్లయిట్ లో ఎస్పీ బాలసుబ్రమణ్యంతో నేను ట్రావెల్ చేయ‌డం జరిగింది. ఆ స‌మ‌యంలో ఇద్దరం అదీ ఇదీ మాట్లాడుకుంటుండగా.. నా దగ్గర ఒక సబ్జెక్టు ఉందని నేను చెప్పడం మొదలుపెట్టాను. ఆయ‌న ఫుల్ ఎక్సైట్ అయ్యారు. ‘కాన్సెప్ట్ చాలా బాగుంది.. మనం ఇది తప్పకుండా చేయాలి‘ అని అన్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్ గారికి తెలుసో తెలియ‌దో.. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఇద్దరు ముగ్గురు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లకు స్టోరీ గురించి చెప్పారు. కానీ వారికి సైన్స్‌ ఫిక్షన్ అనే కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఇదేదో ఒక ఫాంటసీ సినిమా అనుకున్నారు. కానీ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు మాత్రం కథను బాగా నమ్మారు. కృష్ణ ప్రసాద్ గారికి చెప్పారు. ఆయ‌న‌కు కూడా సైన్స్ ఫిక్షన్ అనేటువంటి జోనర్ గురించి తెలియదు. కానీ ఆయన గొప్పతనం ఏంటంటే.. పెద్ద పెద్ద నిర్మాతలే ఇదేమిటని సందేహిస్తున్న సమయంలో ఇందులో ఏదో ఉంది అనేటువంటి ఫీలింగ్ ఆయనకు వచ్చింది. ఇది మామూలు ఫాంటసీ కాదు.. మామూలు చరిత్ర కాదు.. ఇది ఇంకేదో ఉంది.. అని చెప్పి ఒక గుడ్డి నమ్మకంతో కృష్ణ ప్రసాద్ దూకేశారు. స్విమ్మింగ్ గురించి తెలుసుకుని నీళ్లలోకి దూకడం కాదు.. ముందు నీళ్లల్లోకి దూకి స్విమ్మింగ్ నేర్చుకోవడం అన్న చందంగా చేశారు. ఆ క్రెడిట్ మొత్తం కృష్ణ ప్రసాద్ గారిదే. చాలా గ‌ట్ ఫీలింగ్‌తో ముందుకు వ‌చ్చారు'' అని అన్నారు.

WhatsApp Image 2025-03-28 at 4.02.48 PM.jpeg

మూవీ కాస్టింగ్ గురించి వివరిస్తూ, ''బాల‌కృష్ణ గారిని ముందు అనుకున్నాం. ఆ త‌ర్వాత కృష్ణ ప్రసాద్ గారే ఆర్టిస్ట్‌ల సెలక్షన్ బాధ్యతను తీసుకున్నారు. హీరోయిన్ గా విజ‌య‌శాంతి ఉంటే బాగుంటుంద‌ని కృష్ణ ప్రసాద్ గారు, బాల‌కృష్ణ గారు భావించారు. ఆమె కూడా చాలా ఎక్సైట్ అయింది. కానీ ఆమె కాల్షీట్లు సెట్ అవ్వలేదు. ఈ పర్టిక్యులర్ సబ్జెక్టుకు ఆర్టిస్ట్‌ల టైం అనేది మోర్ ఇంపార్టెంట్. కావాల్సిన‌ప్పుడు ఆర్టిస్టులు అందుబాటులో ఉండ‌టం ఎంతో అవ‌స‌రం. మోహిని అనే అమ్మాయి ఎలా వ‌చ్చిందంటే.. మైఖేల్ మదన కామ రాజన్ సినిమాకు వ‌ర్క్ చేస్తున్న స‌మ‌యంలో ఒక రోజు దర్శక ర‌చ‌యిత పంజు అరుణాచలం గారితో మాట్లాడుతున్నాను. ఆయ‌నకు హార్స్ రేసులపై మ‌క్కువ ఎక్కువ‌. ఎప్పుడూ హార్స్ రేసుల‌కు సంబంధించి పుస్తకాలు ప‌ట్టుకుని ఉండేవారు. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండ‌గా.. ఆయ‌న చెప్పారు. త‌మ‌ హార్స్ క్లబ్ లో సెక్రటరీ కూతురు ఉంది.. చూడ‌చక్కగా ఉంటుందంటూ మోహినిని ప‌రిచ‌యం చేశారు. అప్పటికే త‌మిళంలో ఆమె రెండు సినిమాలు చేసి ఉంది. దాంతో ఆమెను ఆడిష‌న్ చేశాము. యాక్టింగ్, డ్యాన్స్ చ‌క్కగా చేస్తుంది.. పైగా అడిగిన‌న్ని కాల్షీట్స్ ఇచ్చేందుకు కూడా ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. కెమెరామన్ పీసీ శ్రీరామ్ కూడా మోహినిని రికమండ్ చేశారు. అలాగే టినూ ఆనంద్ గారితో నాకు ముందు నుంచి ప‌రిచ‌యం ఉంది. ప్రొఫెసర్ పాత్రకు బాగా న‌ప్పుతార‌ని ఆయ‌న్ను తీసుకున్నాము. ఇక రెగ్యుల‌ర్ సినిమాల్లో మాదిరి భ‌య‌పెట్టే విల‌న్‌ కాకుండా పిల్లలను కూడా ఎంట‌ర్టైనింగ్‌గా అనిపించే విల‌న్ కావాల‌ని అమ్రీష్ పురిని ఎంచుకున్నాము. ఆయ‌న‌ క్యారెక్టర్ కూడా కొంచెం ఫ‌న్నీగా డిజైన్ చేశాము'' అన్నారు.


పాస్ట్ లోకి వెళ్ళాలనుకున్నప్పుడు అక్బర్, బీర్బల్ నాటి కాలం గురించి ఆలోచించామని, కానీ దాని కంటే శ్రీ కృష్ణదేవరాయలు కాలానికి వెళితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చామన్నారు సింగీతం శ్రీనివాసరావు. ''ఇందులో శ్రీకృష్ణదేవరాయలు పాత్రకు బాలకృష్ణ తప్ప మరొకరు నా మనసులో తట్టలేదు. ఎందుకంటే గతంలో రామారావుగారు చేసిన పాత్ర అది. సో... ఆయన్నే ఈ పాత్ర పోషించమని చెప్పాము. ఆయనా అంగీకరించారు. నిజానికి శ్రీకృష్ణదేవరాయలుగా ఇవాళ్టికీ వేరొకరు నా మదిలో తట్టరు. ఇక ఈ సినిమాకు ముగ్గురు ఛాయాగ్రహకులు పనిచేయడం కూడా దైవ నిర్ణయమే'' అని అన్నారు. మొదట పీసీ శ్రీరామ్ కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత ఆయన జబ్బు పడటంతో వి.ఎస్.ఆర్. స్వామి గారు వర్క్ చేశారని, ఆ తర్వాత కబీర్ లాల్ తో మూవీ పూర్తి చేశామని చెప్పారు. 'ఆదిత్య 369' సీక్వెల్ స్టోరీని బాలకృష్ణ తాను చెప్పానని, స్క్రిప్ట్ సైతం రెడీ చేశామని సింగీతం తెలిపారు. ఈ సీక్వెల్ మూవీతోనే బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయాలనుకున్నారని, కానీ కుదరలేదని అన్నారు. అయితే బాలకృష్ణ ఎప్పటికైనా 'ఆదిత్య 369' సీక్వెల్ తీయడం ఖాయమని సింగీతం శ్రీనివాసరావు చెప్పారు.

Also Read : Payal Rajput: సెక్సీ హీరోయిన్ మనోవేదన...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 02 , 2025 | 03:14 PM