Shruti Haasan: ఆసక్తిరేకెత్తిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ 'ది ఐ' ట్రైలర్

ABN , Publish Date - Feb 26 , 2025 | 08:26 PM

శ్రుతీ హాసన్ నటించిన బ్రిటీష్ మూవీ 'ది ఐ' ట్రైలర్ విడుదలైంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో యంగ్ విడోగా శ్రుతీహాసన్ నటించింది.

అందాలభామ శ్రుతీహాసన్ (Shruti Haasan) కు కెరీర్ మొత్తంలో నటనకు స్కోప్ ఉన్న పాత్రలు దక్కింది తక్కువ. హిందీలోనే కాదు... తెలుగు, తమిళంలో కూడా పక్కా కమర్షియల్ చిత్రాలలోనే ఆమె నటించింది. అగ్ర కథానాయకుల సరసన మాత్రమే కాదు కొత్త నటులతోనూ శ్రుతీ జోడీ కట్టింది. కానీ చెప్పుకోదగ్గ పాత్రలు చేసిన సినిమాలను వేళ్ళ మీద లెక్కించాల్సిందే. అయితే ఆ లోటును తీర్చబోయే ఓ అంతర్జాతీయ ప్రాజెక్ట్ లో శ్రుతీ పాలు పంచుకుంది. 'ది ఐ' (The Eye) అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో శ్రుతీ హాసన్ ప్రధాన పాత్రను పోషించింది.


తాజాగా బ్రిటీష్ ఫిల్మ్ 'ది ఐ' ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. దీనిని శ్రుతీహాసన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ లో శ్రుతీహాసన్ విభిన్నమైన భావోద్వేగాలను పలికించే ప్రయత్నం చేసింది. సముద్రపు ఒడ్డున భర్త తో కలిసి సరదా సాయంత్రాలను గడిపే సన్నివేశంతో ఈ ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత చనిపోయిన భర్తకు సంబంధించిన చితాభస్మాన్ని నీటిలో కలపడానికి తాము గతంలో ఉన్న దీవికి డయానా వెళుతుంది. అక్కడ ఆమెకు ఎదురైన అనుభవాల సారాంశమే 'ది ఐ' మూవీ. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది. ముంబైలో ఫిబ్రవరి 27న ఓ అంతర్జాతీయ చిత్రోత్సవంలో దీనిని ప్రదర్శించబోతున్నారు. ప్రస్తుతం శ్రుతీహాసన్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajini Kanth) నటిస్తున్న 'కూలీ' చిత్రంలో కీలక పాత్రను పోషిస్తోంది. దీనిని లోకేశ్ కనకరాజ్ తెరకెక్కిస్తున్నాడు.

Updated Date - Feb 26 , 2025 | 08:27 PM