Sriwass: రవితేజ ప్రాజెక్ట్ సందీప్ కిషన్ కిట్ లోకి...

ABN , Publish Date - Apr 12 , 2025 | 03:47 PM

శ్రీవాస్ డైరెక్షన్ లో సినిమా చేస్తానని మాట ఇచ్చిన మాస్ మహరాజా రవితేజ ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. దాంతో ఇప్పుడీ ప్రాజెక్ట్ లోకి సందీప్ కిషన్ వచ్చి చేరాడని తెలుస్తోంది.

ఏ సినిమా ప్రాజెక్ట్ ఎప్పుడు ఎవరి చేతిల్లోకి వెళ్ళిపోతుందో ఎవరూ ఊహించలేని పరిస్థితులు వచ్చాయి. తాజాగా అలా మాస్ మహరాజా రవితేజ (Ravi Teja) చేయాల్సిన ఒక సినిమా సందీప్ కిషన్ (Sundeep Kishan) చేతిలోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. గోపీచంద్ (Gopichand) హీరోగా దర్శకుడు శ్రీవాస్ (Sriwass) తెరకెక్కించిన 'రామబాణం' (Ramabanam) కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People media factory) సరైన జోక్యం చేసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందనే విమర్శలు వచ్చాయి. ఓ ఫ్యాక్టరీ తరహాలో సినిమా వెనుక సినిమాను తీస్తున్నారు తప్పితే, దర్శకులతో, రచయితలతో కూర్చుని ప్రాజెక్ట్ గురించి, అది ఎలాంటి షేప్ తీసుకుంటోందనే విషయం గురించి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (T.G. Viswaprasad) పట్టించుకోవడం లేదనే మాటలూ వినిపించాయి. విశ్వప్రసాద్ మాత్రం తమ సంస్థ నుండి వస్తున్న సినిమాల పరాజయాలపై పెదవి విప్పడం లేదు. అంతేకాదు... ఫ్లాప్ ఇచ్చిన హీరోలతోనూ, డైరెక్టర్స్ తోనూ మళ్ళీ మళ్ళీ సినిమాలు తీస్తూనే ఉన్నారు. అలానే శ్రీవాస్ తో కూడా 'రామబాణం' తర్వాత మరో చిత్రం చేయడానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ముందుకొచ్చిందట.


పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో రవితేజ హీరోగా సినిమా చేసేందుకు శ్రీవాస్ రంగం సిద్థం చేసుకున్నాడని తెలిసింది. మొదట స్టోరీ లైన్ విన్న రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. తీరా శ్రీవాస్ ఫైనల్ వర్షన్ ను రెడీ చేసే సరికీ రవితేజ మనసు మారిందట. రవితేజకు పీపుల్స్ మీడియా సంస్థకు మధ్య మంచి అనుబంధమే ఉంది. అదే బ్యానర్ లో రవితేజ 'థమాకా' లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని చేశాడు. అయితే గత యేడాది ఈ సంస్థ రవితేజతో బ్యాక్ టు బ్యాక్ తీసిన 'ఈగిల్, మిస్టర్ బచ్చన్' చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఆ సినిమాల పరాజయంతో ఎదురైన చేదు అనుభవంతో రవితేజ... శ్రీవాస్ మూవీ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో శ్రీవాస్ ఆశలు ఆవిరైపోయాయి. అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కోరిక మేరకు శ్రీవాస్ ఫైనల్ వర్షన్ ను సందీప్ కిషన్ కు ఇటీవల వినిపించాడట. గతంలో సందీప్ కిషన్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో 'ఎ 1 ఎక్స్ ప్రెస్' మూవీ చేశాడు. ఆ అనుబంధంతో సందీప్ ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హీరో సందీప్ కిషన్, దర్శకుడు శ్రీవాస్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్... ముగ్గురూ కూడా మంచి విజయం కోసం తపిస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ తో వారి కోరిక తీరుతుందేమో చూడాలి.

Also Read: Thug Life: ఎ.ఐ. రీసెర్చ్ సెంటర్ లో కమల్ హాసన్

Also Read: Actor: రావు గోపాలరావు డైరెక్షన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 12 , 2025 | 03:47 PM