Veera Chandrahaasa: వీర చంద్రహాసతో దర్శకుడైన రవి బస్రూర్
ABN , Publish Date - Apr 21 , 2025 | 10:28 AM
ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సైతం మెగా ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. అతను తెరకెక్కించిన 'వీర చంద్రహాస' చిత్రం కన్నడలో విడుదలై చక్కని విజయాన్ని అందుకుంటోంది. అతి త్వరలో ఇది తెలుగులోనూ రాబోతోంది.
సంగీత దర్శకులు మెగా ఫోన్ పట్టడం కొత్తమీ కాదు. పాటలకు స్వరాలను సమకూర్చడంతో పాటు పాడటమూ అలవాటు ఉండే సంగీత దర్శకులు, నేపథ్య సంగీతం చేసినప్పుడు సినిమా మొత్తాన్ని మరో స్థాయికి తీసుకెళతారు. అలా సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం, అర్థం చేసుకోవడం అలవాటైన వారికి దర్శకత్వం వహించాలనే కోరిక కలగడం సహజం. ప్రముఖ సంగీత దర్శకుడు, 'కేజీఎఫ్ (KGF), సలార్ (Salar)' వంటి చిత్రాలకు మ్యూజిక్ అందించిన రవి బస్రూర్ (Ravi Basrur) అదే పనిచేశారు. ఆయన కన్నడలో 'వీర చంద్రహాస' (Veera Chandrahaasa) పేరుతో ఓ సినిమాను తెరకెక్కించారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో శిథిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్. ప్రసన్న శెట్టిగార్ మందార్తి, ఉదయ్ కడబాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ సమర్పణలో ఎన్.ఎస్. రాజ్ కుమార్ దీనిని నిర్మించారు. ఏప్రిల్ 18న విడుదలైన ఈ సినిమాకు చక్కని ఆదరణ లభిస్తోంది. తెలుగులోనూ ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేసేందుకు కంచి కామాక్షి కోల్ కతా కాళీ క్రియేషన్స్ అధినేత ఎం.వి. రాధాకృష్ణ సన్నాహాలు చేస్తున్నారు. గతంలో ఈయన శివరాజ్ కుమార్ (Sivaraj Kumar) నటించిన 'వేద', ప్రజ్వల్ దేవరాజ్ నటించిన 'రాక్షస' సినిమాలను తెలుగులో విడుదల చేశారు. అతి త్వరలోనే 'వీర చంద్రహాస' విడుదల తేదీని తెలియచేస్తామని అన్నారు.
'వీర చంద్రహాస' గురించి రాధాకృష్ణ మాట్లాడుతూ, ''ఇటీవల కన్నడలో విడుదలైన ఈ చిత్రానికి హిట్ టాక్‌తో పాటు మంచి వసూళ్లను వస్తున్నాయి. ఈ మూవీ తెలుగు రైట్స్ దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రానికి తెలుగు ఆడియెన్స్‌ను కూడా బ్రహ్మారథం పడతారని ఆశిస్తున్నాను. సినిమా సక్సెస్ గ్యారెంటీ అని నమ్ముతున్నా. తనదైన సంగీతంతో అందర్నీ అలరించిన రవి బస్రూర్ ఇప్పుడు దర్శకుడిగానూ సత్తా చాటడం సంతోషంగా ఉంది'' అని అన్నారు. వీర చంద్రహాస అనేది మహాభారతంలోని అశ్వమేధిక పర్వంలోని కథ. ఒక అనాథ కుర్రాడి జీవిత గమనాన్ని ఇది చెబుతుంది. వీర చంద్రహాసుడు అనే వ్యక్తి పరాక్రమవంతుడు, సద్గుణవంతుడుగా ఎలా మారాడన్నదే ఈ చిత్ర కథ. సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా యక్షగానం వెండితెరపై పూర్తి వైభవంతో తెరకెక్కడం గొప్ప విషయమని మేకర్స్ చెబుతున్నారు.
Also Read: NTR: ఆడవేషంలో పెద్దాయన....
Also Read: Tollywood: పూరి జగన్నాథ్ రెండున్నర దశాబ్దాల ప్రస్థానం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి