రష్మిక సంతోషించారు

ABN , Publish Date - Mar 26 , 2025 | 02:48 AM

‘‘రాబిన్‌హుడ్‌’ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక చేయాల్సి ఉంది. ఆమెకు ఈ పాత్ర చాలా బాగా నచ్చింది. కానీ డేట్స్‌ కుదరకపోవడం వల్ల దర్శకుడు వెంకీ కుడుముల నన్ను సంప్రదించారు. తను చేయల్సిన పాత్రను నేను చేసినందుకు...

‘‘రాబిన్‌హుడ్‌’ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక చేయాల్సి ఉంది. ఆమెకు ఈ పాత్ర చాలా బాగా నచ్చింది. కానీ డేట్స్‌ కుదరకపోవడం వల్ల దర్శకుడు వెంకీ కుడుముల నన్ను సంప్రదించారు. తను చేయల్సిన పాత్రను నేను చేసినందుకు రష్మిక ఎంతో సంతోషించారు’’ అని హీరోయిన్‌ శ్రీలీల అన్నారు. ఈ చిత్రంలో ఆమె నితిన్‌కు జోడీగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీలీల మీడియాతో ముచ్చటించారు.

  • ఇదొక ఫీల్‌ గుడ్‌మూవీ. ‘రాబిన్‌హుడ్‌’ చిత్రంలో కథ విభిన్నంగా ఉంటుంది. ఇందులో పూర్తిస్థాయి వినోదం పంచే పాత్ర చేశాను. రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌తో కాంబినేషన్‌ సీన్స్‌ ఆకట్టుకుంటాయి. నితిన్‌ నాకు మంచి మిత్రుడు. వెంకీ కథను మలిచిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తుంది.

  • ‘పుష్ప 2’ విడుదలయ్యాక ‘కిస్సిక్‌’ లాంటి ప్రత్యేక గీతాలు చేయమని చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ అంగీకరించలేదు. ‘పుష్ప’ సినిమాకు జాతీయ స్థాయిలో ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని మాత్రమే ప్రత్యేక గీతం చేశాను. ఇతర సినిమాల్లో అలాంటి గీతాల్లో నర్తించాలనుకోవడం లేదు. పాటల్లో నృత్యభంగిమలపై మహిళా కమీషన్‌ స్పందించడం, సమాజంలో చర్చ జరగడం ఆహ్వానించదగిన పరిణామం. నృత్యభంగిమలు అమ్మాయిలకు ఇబ్బందికరంగా ఉండకూడదు. ఒకవేళ అసభ్యకరంగా ఉంటే అది చిత్రీకరణ సమయంలోనే తెలిసిపోతుంది.


  • గత ఏడాది చాలా బిజీగా గడిచింది. నేను నటించినవి అరడజనుకై పైగా సినిమాలు విడుదలయ్యాయి. అందుకే ఈ ఏడాది సినిమాలను తగ్గించాను. ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ కావడంతో చదువుపై దృష్టిపెట్టాను. చాలా మంచి సినిమాలు వదులుకున్నాను. ఇకపై వరుసగా సినిమాలు చేస్తాను. తెలుగు అమ్మాయిగా సందేశాత్మక చిత్రాలు చేయాలనుకుంటున్నాను.

  • బోర్డర్‌ దాటిన వెంటనే గాలి మారదు కదా. తెలుగు ఇండస్ట్రీ నా సొంతిల్లు. హిందీ చిత్రాలకే పరిమితమవ్వాలనే ఆలోచన లేదు. అన్నీ బ్యాలన్స్‌ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం రవితేజతో ‘మాస్‌ జాతర’ చిత్రం చేస్తున్నాను. తమిళంలో సుధ కొంగర దర్శకత్వంలో చేస్తున్న ‘పరాశక్తి’ చాలా గొప్ప ప్రాజెక్ట్‌ అవుతుంది. కన్నడలో ‘జూనియర్‌’ చిత్రం చేస్తున్నాను.

Updated Date - Mar 26 , 2025 | 03:43 AM