Lal Salaam: ఏడాది తర్వాత ఓటీటీలో రజనీ మూవీ
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:50 AM
రజనీకాంత్ నటించిన 'లాల్ సలామ్' మూవీ గత యేడాది ఫిబ్రవరిలో విడుదలైంది. ప్రేక్షకాదరణ నోచుకోని ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు.
సినిమా థియేటర్లలో ఆడకపోతే... ఎంత పెద్ద స్టార్ హీరో నటించినా... ఓటీటీలో దానికి డిమాండ్ ఉండదు. ఇక ఆ సినిమా కాంట్రవర్శీని క్రియేట్ చేస్తే... ఓటీటీ సంస్థలు స్ట్రీమింగ్ చేయడానికి వెనకడుగు వేస్తాయి. సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) మూవీ విషయంలో అదే జరిగింది. రజనీకాంత్ ప్రధాన పాత్రధారిగా 'లాల్ సలామ్' (Lal Salaam) అనే మూవీని ఆయన కూతురు ఐశ్వర్య (Aishwarya Rajinikanth) డైరెక్ట్ చేసింది. లైకా ప్రొడక్షన్ (Lyca Productions) హౌస్ దీనిని నిర్మించింది. అయితే ఇందులో ప్రధాన పాత్రలు పోషించింది విష్ణు విశాల్, విక్రాంత్. రజినీకాంత్ ముస్లీం నాయకుడిగా కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు రకరకాల వివాదాలకు నెలవుగా మారింది. సినిమా కంటెంట్ మిస్ అయ్యిందని దర్శక నిర్మాతలు వాపోయారు. తమ దగ్గర ఉన్నవాటిని బేస్ చేసుకునే సినిమాను రిలీజ్ చేశారు. అయితే గత యేడాది సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా వాయిదా పడి, ఫిబ్రవరిలో విడుదలైంది. రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆశగా థియేటర్లకు వెళ్ళి ఆయన పాత్ర తీరును, సినిమా చూసి నీరసించిపోయారు. మూవీ ఏ మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఘోర పరాజయం పాలైంది.
ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం అప్పట్లో నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తం ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంది. సినిమా విడుదలలో జాప్యం, కంటెంట్ ఆశించిన స్థాయిలో లేకపోవడం, రజనీకాంత్ ది కేవలం కీలక పాత్ర మాత్రమే కావడంతో... ఈ సంస్థ తన అగ్రిమెంట్ ను రద్దు చేసుకుంది. దాంతో 'లాల్ సలామ్' ఓటీటీలో స్ట్రీమింగ్ కాకుండా ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఇంతకాలానికి... యేడాది తర్వాత అది సన్ నెక్ట్స్ లో ఏప్రిల్ 4న స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాను చూడలేకపోయిన వారూ, చూద్దామనుకుంటూ ఉండగానే థియేటర్లలో తీసేసిన కారణంగా ఆ కోరిక తీరని వారు.. ఇప్పుడు ఓటీటీలో చూసే ఛాన్స్ దక్కింది. అయితే మూవీకి వచ్చిన రిజల్ట్ ను దృష్టిలో పెట్టుకుని పెద్దంత ఆశలు పెట్టుకోకపోతే బెటర్!
Also Read: Ram Gopal Varma: నాలుగు భాషల్లో ఆరాధ్యదేవి శారీ...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి