నేనలా మాట్లాడి ఉండాల్సింది కాదు
ABN , Publish Date - Apr 10 , 2025 | 02:38 AM
‘బాషా’ చిత్రం శతదినోత్సవంలో నాటి ముఖ్యమంత్రి జయలలితపై తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన తీవ్ర విమర్శలు అప్పట్లో సంచలనం సృష్టించడంతో పాటు...
‘బాషా’ చిత్రం శతదినోత్సవంలో నాటి ముఖ్యమంత్రి జయలలితపై తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన తీవ్ర విమర్శలు అప్పట్లో సంచలనం సృష్టించడంతో పాటు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలకు కారణమయ్యాయి. ఈ పరిణామాల్లో మొదటిది ఆ వేడుకలో వేదికపైనున్న అన్నాడీఎంకేకు చెందిన సీనియర్ నేత ఆర్‌ఎం వీరప్పన్ జయ ఆగ్రహానికి గురవడంతో పాటు మంత్రి పదవిని కోల్పోవాల్సివచ్చింది. ఆ తరువాత ఆయన కన్నుమూసేవరకూ రాజకీయంగా కోలుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఎం వీరప్పన్‌పై ‘ఆర్‌ఎంవీ ది కింగ్ మేకర్’ పేరుతో రూపొందిన ఓ డాక్యుమెంటరీలో రజనీ తమ స్నేహం గురించి గుర్తు చేసుకున్నారు. ‘బాషా’ చిత్రం వందరోజుల వేడుకల్లో నేను రాష్ట్రంలో బాంబుల సంస్కృతి గురించి ప్రస్తావించాను. వేదికపై ఆర్‌ఎం వీరప్పన్‌ను ఉంచుకొని నేనలా మాట్లాడి ఉండాల్సింది కాదు. నాకు అప్పుడు అంత పరిజ్ఞానం లేదు. అప్పుడు ఆయన అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ‘నువ్వు మంత్రిగా వేదికపై వుండగా, నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రజనీ ఎలా మాట్లాడారు?’ అంటూ దివంగత ముఖ్యమంత్రి జయ ఆర్‌ఎం వీరప్పన్‌ను పదవి నుంచి తొలగించారు.
ఈ సమాచారం తెలిసిన వెంటనే నేను షాక్‌కు గురయ్యాను. ఇలా జరగడానికి నేనే కారణమని తెలిసి, ఎంతో బాధపడ్డాను. ఆ రాత్రంతా నిద్రపోలేకపోయాను. ఆయన్ని కలిసి క్షమాపణ చెప్పాను. కానీ, ఆయన ఏమీ జరగనట్లు మాట్లాడారు. చాలా సాధారణంగా వున్నారు. జయకు వ్యతిరేకంగా మాట్లాడడానికి కొన్ని కారణాలు ఉన్పప్పటికీ, ఆ వేదికపై అలా మాట్లాడివుండాల్సింది కాదు. ‘నేను జయతో మాట్లాడనా?’ అని ఆయన్ని అడిగాను. కానీ నీ ఆత్మగౌరవం కోల్పోవద్దని నాకు సలహా ఇచ్చారు. అంతేగాక ‘మీ చేత చెప్పించుకుని అక్కడకు పోయి చేరాల్సిన అవసరం నాకు లేదు. ఈ విషయం ఇంతటితో వదిలేయండి’ అన్నారు. అలాంటి ఒక గొప్ప మనిషి ఆయన. వీరప్పన్ ‘కింగ్ మేకర్...రియల్ కింగ్ మేకర్’’ అని రజనీ పేర్కొన్నారు.