Crazy Combo: రాజమౌళి - మహేశ్ సినిమా డేట్ ఫిక్స్

ABN , Publish Date - Apr 10 , 2025 | 05:15 PM

టాప్ స్టార్ మహేశ్ బాబు, డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా రిలీజ్ డేట్ ఇదే అంటూ ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది... ఆ డేట్ కు ఇప్పటికే ఓ బ్లాక్ బస్టర్ తో రచ్చ చేశారు రాజమౌళి... కాగా, ఆ తేదీ మహేశ్ కు పూర్తిగా కొత్తే మరి!... ఆ ముచ్చటేంటో చూద్దాం...

రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా నటిస్తున్నారు అని తెలియగానే అభిమానుల ఆనందం అంబరమంటింది. వారి సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్ కు మరింత సంతోషం పెంచుతూ చిత్రీకరణ మొదలయింది. ఇక ఈ సినిమా 2027 మార్చి 25న విడుదల కానుంది అంటూ ఓ వార్త గింగిరాలు కొడుతోంది. ఈ తేదీని చూసి కూడా అభిమానులు ఆనందిస్తున్నారు. ఎందుకంటే 2022 మార్చి 25న రాజమౌళి మేగ్నమ్ ఒపస్ 'ట్రిపుల్ ఆర్' రిలీజయింది. ఆ సినిమా ఘనవిజయం సాధించడమే కాదు, ఏకంగా తెలుగు చిత్రసీమకు తొలి ఆస్కార్ ను సంపాదించి పెట్టింది. అందువల్ల రెండేళ్ళ తరువాత మార్చి 25న రాజమౌళి, మహేశ్ సినిమా రిలీజయితే అది కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసేస్తుందని ఆశిస్తున్నారు సినీఫ్యాన్స్.


సెంటిమెంట్స్ చుట్టూ పరిభ్రమించే సినిమా రంగంలో ఒక్కొక్కరిది ఒక్కో నమ్మకం... కొందరికి కొన్ని తేదీలు భలేగా అచ్చి వస్తాయని విశ్వాసం. కొందరిలో అనుమానాలూ చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు 2027 మార్చి 25న రాజమౌళి, మహేశ్ సినిమా రాబోతోందని తెలియగానే కొందరిలో ఆనందం, మరికొందరిలో అనుమానం చోటు చేసుకుంటున్నాయి. ఆల్రెడీ రాజమౌళి మార్చి 25వ తేదీన విడుదల చేసిన తన 'ట్రిపుల్ ఆర్' (RRR) తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక మహేశ్ బాబు కెరీర్ లో మార్చి నెలలో సినిమాలు వచ్చినట్టు కనిపించడం లేదు. కాబట్టి కొత్త డేట్ తో మహేశ్ కలెక్షన్ల వర్షం కురిపిస్తారని ఆయన ఫ్యాన్స్ విశ్వాసం. ఇదిలా ఉంటే అనూహ్య విజయాలు సాధించిన రాజమౌళిపై కూడా కొందరిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి.


మహేశ్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం దర్శకునిగా ఆయనకు 13వ చిత్రం... 'పదమూడు' అన్నది కొందరికి అచ్చిరాదనే మాట వినిపిస్తూ ఉంటుంది. అలాగే రాజమౌళికి కూడా 'మూడు' అన్నది కలసి రాలేదనీ చెబుతున్నారు. రాజమౌళి కెరీర్ లో ఇప్పటి దాకా రూపొందిన అన్ని చిత్రాలలో ఒకే ఒక్క 'సై' మినహాయిస్తే అన్నీ నిర్మాతలకు విశేషంగా లాభాలు ఆర్జించినవే. 'సై' ఒక్కటే మంచి వసూళ్ళు చూసినా, కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలచింది... అది రాజమౌళి మూడో సినిమా కావడం గమనార్హం!... అందువల్ల రాజమౌళి 13వ చిత్రంగా వస్తోన్న మహేశ్ బాబు సినిమా ఎలా సాగుతుందో అని ఆలోచించేవారూ లేకపోలేదు. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది - రాజమౌళి సినిమాలపై ముందుగా కొన్ని సెంటిమెంట్స్ వినిపించడం, వాటిని ఆయన చిత్రాలు సునాయాసంగా దాటేయడం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే రాబోయే రాజమౌళి, మహేశ్ సినిమా కూడా అవలీలగా విజయతీరాలు చేరుతుందని టాక్. పైగా మార్చి 25 తరువాత 2027లో ఏప్రిల్ 7న ఉగాది, ఏప్రిల్ 15న శ్రీరామనవమి పండుగలు ఉన్నాయి. కాబట్టి రాజమౌళి రాబోయే సినిమాకు ఏలాంటి ఢోకా లేదని అభిమానుల మాట!. ఏమవుతుందో చూడాలి.

Also Read: Jack Movie Review: జాక్ మూవీ రివ్వూ

Also Read: Dilwale Dulhania Le Jayenge: షారుఖ్‌, కాజల్ కాంస్య విగ్రహాలు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 10 , 2025 | 05:42 PM