రోజుకో సిద్ధాంతం మార్చడం పవన్‌కు అలవాటే
ABN , Publish Date - Apr 04 , 2025 | 02:42 AM
‘‘ఏడాది క్రితం వరకు ‘మా తండ్రి దేవుడిని నమ్మలేద’ని చెప్పిన పవన్ కల్యాణ్ మాటమార్చి ‘మా తండ్రి రాముడి బోధనలతో నన్ను పెంచాడ’ని ఇప్పుడు చెబుతున్నాడు. నువ్వు మారుతుంటే నీతోపాటు అందరూ...
‘‘ఏడాది క్రితం వరకు ‘మా తండ్రి దేవుడిని నమ్మలేద’ని చెప్పిన పవన్ కల్యాణ్ మాటమార్చి ‘మా తండ్రి రాముడి బోధనలతో నన్ను పెంచాడ’ని ఇప్పుడు చెబుతున్నాడు. నువ్వు మారుతుంటే నీతోపాటు అందరూ మారాలనుకోవడం సమంజసం కాదు. పవన్ కల్యాణ్‌కి ఓ సిద్ధాంతం అంటూ లేదు, కేవలం నోటికొచ్చినట్లు మాట్లాడటం, రోజుకో సిద్ధాంతం మార్చడం ఆయనకు అలవాటే’ అని ప్రకాశ్ రాజ్ అన్నారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ తరచుగా సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రకాశ్‌రాజ్...తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. ‘నేను సనాతన ధర్మానికి, హిందూ ఇజానికి వ్యతిరేకిని కాను. కానీ సనాతని అని చెప్పుకునే పవన్ కల్యాణ్ మాత్రం కేవలం రాజకీయ అవసరాల కోసమే మతాన్ని వాడుకుంటున్నాడు. తిరుపతి లడ్డు కల్తీ అయిందంటూ రాజకీయం చేశారు. అధికారం తన చేతిలో ఉంచుకొని, పవన్ కల్యాణ్ నిందితులను పట్టుకోకుండా ఎందుకు ప్రకటనలకే పరిమితమయ్యారు. లడ్డులో కల్తీ నెయ్యి కలిపినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీం కోర్టు సైతం వ్యాఖ్యానించింది. లడ్డు అంశాన్ని రాజకీయం చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవడం మంచిది. ఇది సున్నితమైన అంశం.
కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చెలగాటం అడుతున్నావు. నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే టీటీడీ బోర్డు మెంబర్ల నియామకం వెనుక ఉన్న అవినీతి గురించి విచారించు. ఎందుకు పేద భక్తులు దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవాలి. వీఐపీ దర్శనాలు ఎందుకు? తొక్కిసలాటకు కారణాలేమిటో గుర్తించు. నువ్వు డిప్యూటీ సీఎంవి..మాట్లాడే ముందు ఆలోచించు. ఆవేశంగా ఆలోచన లేకుండా మాట్లాడుతున్నావంటే.. నీ మాటల వెనుక ఏదో ఎజెండా ఉందని అర్థం. మీ రాజకీయ అవసరాల కోసం ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయవద్దు. నాది ఆగ్రహం, ఆక్రోశం కాదు. ప్రజల నమ్మకాలతో చెలగాటం ఆడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’ అంటూ ప్రకాశ్‌రాజ్ అన్నారు. లడ్డు వివాదం విషయంలో గతంలోనూ పవన్ కల్యాణ్‌ను ప్రశ్నిస్తూ ప్రకాశ్‌రాజ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News And Telugu News