Payal Rajput: సెక్సీ హీరోయిన్ మనోవేదన...
ABN , Publish Date - Apr 02 , 2025 | 01:03 PM
'ఆర్.ఎక్స్. 100' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు 'వెంకట లచ్చిమి' సినిమాలో నటిస్తోంది. అయితే... తాజాగా అమ్మడు నెపోటిజమ్, ఫేవరెటిజమ్ పై కీలక వ్యాఖ్యలు చేసింది.
ముప్పై రెండేళ్ళ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) మనసు గాయపడింది. దాదాపు ఏడేళ్ళ క్రితం 'ఆర్.ఎక్స్. 100' (Rx 100) మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ ను సంపాదించుకుంది. అయితే... రాత్రికి రాత్రి గుర్తింపు అనే మాటను పాయల్ అంగీకరించేది కాదు... కొన్నేళ్ళ కృషి, పట్టుదల, పరిశ్రమ కారణంగా తనకు ఈ విజయం లభించిందని, ఇది ఓవర్ నైట్ లభించిన అదృష్టం కాదని చెబుతుండేది. అయితే... 'ఆర్.ఎక్స్. 100' మూవీ తర్వాత పాయల్ ను వెతుక్కుంటూ చాలానే అవకాశాలు వచ్చాయి. వాటిలో కొన్నింటి మాత్రమే ఆమె ఎంపిక చేసుకుంది. కానీ ఆ సినిమాలు సైతం పాయల్ ను నిరాశకు గురిచేశాయి. పైగా 'ఆర్.ఎక్స్. 100' వచ్చి సెక్సీ హీరోయిన్ ముద్ర నుండి ఆమె బయట పడలేకపోయింది. 'వెంకీమామ (Venky Mama), డిస్కో రాజా (Disco Raja)' వంటి సినిమాలు చేసినా... పాయల్ కు అవేవీ పెద్దంత ఉపయోపడలేదు. సినిమాలతో పాటు 'అనగనగా ఓ అతిథి' వంటి ఓటీటీ మూవీస్ కూడా చేసింది.
అవకాశం ఏ భాషలో లభించినా... దానిని పాయల్ రాజ్ పుత్ ఒడిసి పట్టుకుంది. అలా పంజాబీ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలలో నటించింది. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ వచ్చినా... ఆమెకు గ్రాండ్ విక్టరీని అందించిన చిత్రాలు మాత్రం లేవనే చెప్పాలి. ఇదే సమయంలో తనను తెలుగులో పరిచయం చేసిన అజయ్ భూపతి దర్శకత్వంలో మరోసారి 'మంగళవారం' (Mangalavaram) మూవీలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ఆమెకు పరాజయాన్నే అందించింది. దాంతో విసిగి వేసారిన పాయల్ రాజ్ పుత్ ఓ కాంట్రవర్షియల్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కేవలం ప్రతిభ ఒక్కటే సరిపోదని తేల్చి చెప్పేసింది. నెపోటిజమ్, ఫేవరెటిజమ్ ఉన్న ఈ రంగంలో రాణించడం అంత సులభం కాదని వాపోయింది. వచ్చిన అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోవడం, విజయాలు లభించినా అవి తన ఖాతాలో పడకపోవడం, సినిమా రంగంలోని మేనేజర్ల మైండ్ గేమ్... ఇవన్నీ పాయల్ ను మానసికంగా బలహీన పర్చినట్టుగా అర్థమౌతోంది.
నిజానికి పాయల్ తరహాలో తమ ప్రతిభకు తగ్గ అవకాశాలు రావడం లేదని వాపోతున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అయితే... ఇదే సమస్య వారసత్వపు నటీనటులకూ ఉంది. నట వారసత్వం అనేది ఒకటి రెండు సినిమాలకు ఉపయోగపడుతుంది తప్పితే... కెరీర్ కు దన్నుగా ఏ మాత్రం నిలబడదు. ఫైనల్ గా ప్రతిభ ఉన్నవారే ఇక్కడ నిలబడతారని చరిత్ర చెబుతోంది. సో... ఇవాళ కాకపోతే రేపు... పాయల్ రాజ్ పుత్ తన ప్రతిభతో సరైన గుర్తింపును తెచ్చుకుంటుందని అనుకోవచ్చు. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ తెలుగులో 'వెంకట లచ్చిమి' చిత్రంలోనూ, తమిళంలో 'గోల్ మాల్, ఏంజెల్' మూవీస్ లోనూ నటిస్తోంది.
Also Read: Lal Salaam: ఏడాది తర్వాత ఓటీటీలో రజనీ మూవీ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి