Director Rajamouli: వందేళ్ల నిరీక్షణకు ముగింపు...

ABN , Publish Date - Apr 12 , 2025 | 01:12 AM

ఆస్కార్‌ పురస్కారాల్లో కొత్తగా స్టంట్‌ డిజైన్‌ కేటగిరీని ప్రవేశపెట్టింది. 2028 ఆస్కార్‌ కార్యక్రమంలో స్టంట్‌ డిజైన్‌కు చెందిన విజేతలకు అవార్డులు అందించనున్నారు

  • స్టంట్‌ డిజైన్‌ కేటగిరీలో ఆస్కార్‌ పురస్కారం

ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారాల్లో కొత్తగా మరో విభాగం చేరింది. ఇక నుంచి స్టంట్‌ డిజైన్‌ విభాగంలోనూ పురస్కారాలు ఇవ్వనున్నట్లు అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ ప్రకటించింది. సినిమా మ్యాజిక్‌లో భాగమైన స్టంట్స్‌ ఇకపై ఆస్కార్‌ పురస్కారాల్లోనూ భాగమవనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. 2028లో నిర్వహించబోయే వందో ఆస్కార్‌ పురస్కారాలలో స్టంట్‌ డిజైన్‌ కేటగిరీలో పురస్కారాన్ని అందజేస్తామని వెల్లడించారు. 2027లో విడుదలయ్యే చిత్రాల నుంచి విజేతను ఎంపిక చేస్తారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ‘ఎవ్రీథింగ్‌ ఎట్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌, మిషన్‌ ఇంపాజిబుల్‌’ లాంటి హాలీవుడ్‌ చిత్రాలతో పాటు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ఫైట్‌ సీక్వెన్స్‌కు సంబంధించిన ఇమేజ్‌ను అకాడమీ నిర్వాహకులు ఉపయోగించడంపై దర్శకుడు రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. ‘ఎట్టకేలకు వందేళ్ల నిరీక్షణ తర్వాత 2027లో విడుదలయ్యే చిత్రాలకు కొత్తగా స్టంట్‌ డిజైన్‌ కేటగిరీలో పురస్కారాలు ఇవ్వబోతున్నందుకు ఆనందంగా ఉంది. పోస్టర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను భాగం చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ కలను నిజం చేసిన నిర్వాహకులకు ధన్యవాదాలు’ అంటూ రాజమౌళి స్పందించారు.

Updated Date - Apr 12 , 2025 | 01:16 AM