NBK: మరోమారు బాలయ్యతో విద్యాబాలన్...
ABN , Publish Date - Mar 31 , 2025 | 04:29 PM
నందమూరి బాలకృష్ణ సరసన ఇప్పటికే ఓ సినిమాలో నటించిన విద్యాబాలన్ ఇప్పుడు మరో చిత్రానికి సైన్ చేసింది.
నటసింహ నందమూరి బాలకృష్ణ (Balakrishna)కు వరుసగా విజయాలు వస్తున్నాయి. ఆయన తరం హీరోల్లో వరుసగా నాలుగు సినిమాలు సక్సెస్ చూసిన వారు ఇప్పుడు కనిపించడం లేదు. 'అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహరాజ్' నాలుగు సినిమాలు ఒక్కోటి వంద కోట్లకు పైగా పోగేసింది. దాంతో అభిమానుల ఆనందం ఓ రేంజ్ లో లేదు. నిజం చెప్పొద్దూ... ఆయన నటించిన 'డాకూ మహరాజ్' సక్సెస్ అంతకు ముందు మూడు సినిమాల స్థాయిలో లేదని అభిమానులే అంటున్నారు. అందువల్ల బాలయ్య ఫ్యాన్స్ అందరి చూపు రాబోయే బాలకృష్ణ, బోయపాటి కాంబో సినిమా 'అఖండ... శివతాండవం'పైనే ఉన్నాయి. ఫ్యాన్స్ ఆ సినిమా కోసం కళ్ళింతలు చేసుకొని కాచుకున్నారు. ఆ సినిమా పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీభాషల్లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ చిత్రంతో తప్పకుండా బాలయ్య ఓ హై వోల్టేజ్ సక్సెస్ ను చూస్తారని ఫ్యాన్స్ అభిలాష. 'అఖండ' సీక్వెల్ లో హిందీ నటి విద్యాబాలన్ (Vidyabalan) ఓ కీలక పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు 2019లో విడుదలైన యన్టీఆర్ బయోపిక్ సిరీస్ లో ఆమె బాలయ్య సరసన నటించారు. ఆ రెండు సినిమాలు ఏ మాత్రం అలరించలేక పోయాయి. అందువల్ల విద్యాబాలన్ మరోమారు బాలయ్యతో నటించడం అన్నది ఫ్యాన్స్ లోనే చర్చకు తెరలేపింది.
యన్టీఆర్ బయోపిక్ సిరీస్ లో వచ్చిన రెండు భాగాల్లోనూ యన్టీఆర్ గా బాలయ్యనే నటించారు.ఆ సినిమాలు జనాన్ని ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయాయి. ఈ నేపథ్యంలో విద్యాబాలన్ మరోమారు బాలయ్యతో నటిస్తోందంటే కొందరు సెంటిమెంట్ గా భావిస్తున్నారు. అయితే ఇక్కడే ఉంది అసలు విషయం... అదేమిటంటే బాలయ్య, బోయపాటి కాంబోలో అనుమానాలు రేకెత్తించిన అంశాలే తరువాత భలేగా అలరించాయి... 'లెజెండ్' సమయంలో బాలయ్యకు మెయిన్ విలన్ గా జగపతిబాబు (Jagapathi Babu)ను ఎన్నుకున్నప్పుడు, 'అఖండ'లో శ్రీకాంత్ (Srikanth) ను ఓ విలన్ గా ఎంపిక చేసినప్పుడు కూడా ఇలాంటి అనుమానాలే వెలిబుచ్చారు..ఆ రెండు సినిమాలు ఎంతటి ఘనవిజయం సాధించాయో అందరికీ తెలిసిందే. అదే తీరున 'అఖండ...శివతాండవం'లోనూ విద్యాబాలన్ నటించినా సినిమా ఘనవిజయానికి ఏ మాత్రం ఢోకా ఉండదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వరుసగా బాలయ్య చిత్రాలకు పసందైన సంగీతం అందిస్తోన్న థమన్ ఈ సినిమాకూ బాణీలు కడుతున్నారు. 'అఖండ' సీక్వెల్ ను పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
Also Read: Adurthi Subbarao: 60 యేళ్ళ కృష్ణ తేనెమనసులు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి