Koratala Siva: ఆ పాత్రకు అర్హుడు ఎన్టీఆర్ మాత్రమే...
ABN , Publish Date - Apr 01 , 2025 | 08:04 PM
దర్శకుడు కొరటాల శివకు ఎన్టీఆర్ అంటే ప్రత్యేకమైన అభిమానం. కమల్ హాసన్ నటించిన సాగర సంగమం చిత్రం ఎవరైనా రీమేక్ చేయాలని అనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఎన్టీఆర్ మాత్రమే అంటున్నాడు కొరటాల!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) అంటే ప్రతి దర్శకుడికి ప్రేమ, గౌరవం కూడా. బాల్యం నుండి తాతయ్య నందమూరి తారక రామారావు (NT Ramarao) నుండి నటనను ఒంటబట్టించుకున్నాడు జూ. ఎన్టీఆర్. పెద్దాయన దర్శకత్వంలో హిందీలో రూపుదిద్దుకున్న 'బ్రహ్మర్షి విశ్వామిత్ర'లో బాల భరతుడిగా నటించాడు. అలానే బాల్యంలోనే బుల్లితెరలో 'భక్త మార్కండేయ' గా చేసి మెప్పించాడు. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో అందరూ పిల్లలతో తెరకెక్కిన 'రామాయణం' (Ramayanam) గురించి చెప్పక్కర్లేదు. రాముడి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ నటించిన 'దేవర-1' (Devara -1) జపాన్ లో రిలీజ్ అవుతున్న సందర్భంగా అక్కడి ప్రజలతో ఎన్టీఆర్, ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివ ఇంటరాక్ట్ అయ్యారు.
అక్కడ ఒకానొక సందర్భంలో కొరటాల శివ తన మనసులో మాటను బయటపెట్టాడు. తెలుగువారు, ఆ మాట కొస్తే భారతీయులు గర్వించదగ్గ దర్శకుడు కె. విశ్వనాథ్ (K. Vishwanadh) గురించి ఆయన చెప్పారు. కళాతపస్వి కె. విశ్వనాథ్ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేలా సినిమాలు తీశారని తెలిపారు. ఆయన రూపొందించిన క్లాసిక్ మూవీస్ లో 'సాగర సంగమం' (Sagara Sangamam) కూడా ఒకటి అని అన్నారు. కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా నటించిన ఆ సినిమాను ఇవాళ తమ తరం దర్శకులు ఎవరైనా రీమేక్ చేయాలనుకుంటే అందుకు ఒకే ఒక్క ఛాన్స్ ఎన్టీఆర్ అని కితాబిచ్చారు కొరటాల శివ. జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్న పొటన్షియాలిటీ మామూలు కాదని, 'సాగర సంగమం' వంటి శాస్త్రియ నృత్య ప్రధానమైన చిత్రంలో చేసే సత్తా, సత్తువ ఎన్టీఆర్ కే ఉన్నాయని అన్నారు. బేసికల్ గా ఎన్టీఆర్ సంప్రదాయ నృత్యం చేసుకున్న వ్యక్తి కావడంతో ఆ పాత్రకు సంపూర్ణ న్యాయం చేయగలడని చెప్పారు. కె. విశ్వనాథ్ గురించి కొరటాల శివ మాట్లాడుతుంటే ఎన్టీఆర్ సైతం హర్షాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీ సినిమా 'వార్ -2' తో పాటు, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబోలో 'దేవర -2' సెట్స్ పైకి వెళ్ళొచ్చు!
Also Read: Rajkumar Rao: మొన్న శ్రీకాంత్, నేడు సౌరవ్ గంగూలీ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి