Hero Nani: మరోసారి గెలిపిస్తారనే నమ్మకం ఉంది
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:45 AM
నాని ప్రధాన పాత్రలో శైలేష్ కొలను రూపొందించిన ‘హిట్ 3’ ట్రైలర్ విడుదలైంది. యాక్షన్, భావోద్వేగాలు కలగలిసిన కథతో మే 1న థియేటర్లలోకి రానుంది
నాని కథానాయకుడిగా ‘హిట్’ చిత్రాల ఫేమ్ శైలేష్ కొలను తెరకెక్కించిన చిత్రం ‘హిట్ 3’. శ్రీనిధి శెట్టి కథానాయిక. వాల్‌పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మే ఒకటిన చిత్రం విడుదలవుతోంది. ఇటీవలే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలను తారస్థాయికి తీసుకెళ్లాయి. సోమవారం చిత్రట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ ‘‘ఈ మధ్య వస్తున్న సినిమాల ట్రైలర్‌లు ఆ సినిమాల విడుదలకు ఒక రోజో.. రెండు రోజుల ముందో వస్తున్నాయి. కానీ, ఒకప్పుడు ట్రైలర్‌లు సినిమా విడుదలకు 20 రోజుల ముందే విడుదల అయ్యేవి. అందుకే ఆ పాత రోజుల్ని గుర్తుచేయాలనే ట్రైలర్‌ను ముందుగానే విడుదల చేశాం. తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని ఓ సరికొత్త జానర్‌లో చేసిన చిత్రమిది. కొత్తగా ప్రయత్నించిన ప్రతీసారి ప్రేక్షకులు గెలిపించారు. మే ఒకటిన మరోసారి గెలిపిస్తారనే నమ్మకం ఉంది. నేను యాక్షన్ సినిమాలు చేయాలని కోరుకునే వాళ్లంతా ఆ రోజు థియేటర్లకు వచ్చేయండి.
నేను లవ్‌స్టోరీలు, ఫీల్ గుడ్, కామెడీ, కుటుంబ చిత్రాలు చేయాలనుకునే వారు ఆ రోజు కాస్త జాగ్రత్తగా ఉండండి. సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. బలమైన భావోద్వేగాలతో నిండిన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తాయి’’ అని చెప్పారు. ‘‘సినిమా యూనిక్‌గా ఉంటుంది. నాని నటన ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుంది. ప్రతీ సన్నివేశం విజిల్స్ కొట్టేలా ఉంటుంది. ‘అర్జున్ సర్కార్’ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతాడు’’ అని దర్శకుడు శైలేష్ కొలను చెప్పారు.