కమర్షియల్‌ ట్రెండ్‌ను సెట్‌ చేసింది

ABN , Publish Date - Mar 31 , 2025 | 02:22 AM

‘తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కమర్షియల్‌ ట్రెండ్‌ను సెట్‌ చేసిన చిత్రం ‘ఆదిత్య 369’. ఒక కొత్త కాన్సెప్ట్‌తో ఆ చిత్రాన్ని చేయడం నాకు చాలా ఆనందం కలిగించింది...

‘తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కమర్షియల్‌ ట్రెండ్‌ను సెట్‌ చేసిన చిత్రం ‘ఆదిత్య 369’. ఒక కొత్త కాన్సెప్ట్‌తో ఆ చిత్రాన్ని చేయడం నాకు చాలా ఆనందం కలిగించింది. అందుకే ఇది ఈ సినిమా ప్రీ రిలీజ్‌ కార్యక్రమమే తప్ప రీ రిలీజ్‌ వేడుక అని భావించడం లేదు. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్‌ మొదలుపెట్టబోతున్నాం’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్‌ 4న రీ రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ ‘నాన్నగారి స్ఫూర్తితో ఈ చిత్రంలో శ్రీకృష్ణదేవరాయలు పాత్ర చేశాను. ఈ సినిమా వెనుకున్న మూలస్తంభం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయనతో పాటు శివలెంక కృష్ణప్రసాద్‌, సింగీతం గార్లకు రుణపడి ఉంటాను’ అన్నారు. ‘ఈ సినిమా విజయంలో సింహభాగం బాలకృష్ణకే దక్కుతుంది. శ్రీకృష్ణ దేవరాయల పాత్రను అంత అద్భుతంగా పోషించగల నటుడు అప్పుడూ, ఇప్పుడూ బాలకృష్ణ తప్ప మరొకరు లేరు’ అని సింగీతం శ్రీనివాసరావు తన వీడియో సందేశంలో ప్రశంసించారు. ఈ సినిమాను నిర్మించడం తనకు దక్కిన అదృష్టం అని శివలెంక కృష్ణప్రసాద్‌ చెప్పారు.

Updated Date - Mar 31 , 2025 | 02:22 AM