Mass Maharaja: మరోసారి రవితేజ స్వీట్ మెమొరీస్
ABN , Publish Date - Mar 24 , 2025 | 01:19 PM
రవితేజ నటించిన ఫీల్ గుడ్ మూవీ 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్'. తమిళంలో చేరన్ తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగులో సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి రీమేక్ చేశారు. ఈ సినిమా మరోసారి జనం ముందుకు రాబోతోంది.
మాస్ మహరాజా రవితేజ (Raviteja) నటించిన 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్' మూవీ 2004లో విడుదలైంది. తమిళంలో చేరన్ డైరెక్ట్ చేసి, హీరోగా నటించిన 'ఆటోగ్రాఫ్'కు ఇది తెలుగు రీమేక్. విశేషం ఏమంటే... ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి (S. Gopalreddy) దర్శకత్వం వహించిన ఏకైక చిత్రమిది. బెల్లంకొండ సురేశ్ (Bellamkonda Suresh) ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. రవితేజకు ఉన్న ఇమేజ్ కు భిన్నమైన చిత్రం కావడంతో ఈ ఫీల్ గుడ్ మూవీ మ్యూజికల్ హిట్ అయినా... కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు. ఇప్పటికీ ఈ సినిమా కోసం చంద్రబోస్ రాసిన 'మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది....' సాంగ్ శ్రోతలను అలరిస్తూనే ఉంది.
రవితేజ నటించిన 'ధమాకా' (Dhamaka) మూవీ 2022 డిసెంబర్ లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన 'వాల్తేరు వీరయ్య' సైతం రవితేజ ఖాతాలో గ్రాండ్ విక్టరీని జమ చేసింది. అయితే ఆ పైన రవితేజ సోలో హీరోగా చేసిన 'రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు' చిత్రాలు గానీ, గత సంవత్సరం వచ్చిన 'ఈగిల్, మిస్టర్ బచ్చన్' సినిమాలు కానీ రవితేజకు సక్సెస్ ను అందించలేదు. దాంతో రవితేజ అభిమానులంతా అతని 75వ చిత్రం 'మాస్ జాతర'పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ మధ్యలో రవితేజ అభిమానులను ఉత్సాహపర్చేలా 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్' మూవీ రీ-రిలీజ్ వార్త వచ్చింది. రవితేజతో పాటు భూమిక, గోపిక, మల్లిక, ప్రకాశ్ రాజ్, కృష్ణభగవాన్ ఇందులో ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఇప్పుడీ సినిమాను డాల్బీ ఎట్మోస్ సౌండ్ తో 4 కెలో ఏప్రిల్ 5న రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఈ మధ్యలో ఫస్ట్ రిలీజ్ కంటే కొన్ని సినిమాలు రీ-రిలీజ్ లో బాగా ఆడిన సందర్భాలున్నాయి... మరి ఈ సినిమా కూడా రీ-రిలీజ్ లో మంచి స్పందనను పొందుతుందేమో చూడాలి.