Tollywood: మార్చి 7న మాస్ జాతరే...
ABN , Publish Date - Mar 03 , 2025 | 04:03 PM
మార్చి 7న ఏకంగా పన్నెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో నాలుగు అనువాద చిత్రాలు. విశేషం ఏమంటే ఇందులో హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషా చిత్రాలు ఉన్నాయి.
ఫిబ్రవరి నెలలో విడుదలైన సినిమాల్లో కేవలం 'తండేల్' (Thandel) మాత్రమే ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ నెల మొదటి వారంలో విడుదల కాబోతున్న సినిమాల జాబితా చూస్తే... కళ్ళు చెదిరేలా ఉంది. ఈ వీకెండ్ లో ఏకంగా పన్నెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలానే వెంకటేశ్ (Venkatesh), మహేశ్ బాబు (Mahesh Babu) హీరోలుగా నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రీ-రిలీజ్ కానుంది.
మార్చి 7న విడుదల కాబోతున్న సినిమాలు మరీ అంత చెప్పుకోదగ్గవి కాకపోయినా... మరీ తీసిపారేయాల్సినవి కూడా కాదు. ఇందులో డిఫరెంట్ జానర్స్ కు చెందిన సినిమాలు ఉన్నాయి. అంతేకాదు 'రా... రాజా' (Raa... Raaja) వంటి ప్రయోగాత్మక చిత్రమూ ఉంది. 'రా... రాజా' సినిమాలో నటీనటులు ఉంటారు కానీ వాళ్ళ ముఖాలు మాత్రం కనిపించవట. ఇదే తమ చిత్రం ప్రత్యేకత అంటున్నారు దర్శకుడు బి. శివప్రసాద్. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. అలానే ఆమని కీలక పాత్రలు పోషించిన 'నారి' (Naari) మూవీ మహిళాదినోత్సవ కానుకగా ఈ నెల 7న జనం ముందుకు వస్తోంది. ఆనంది, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించిన మరో లేడీ ఓరియంటెడ్ మూవీ 'శివంగి' (Sivangi). దేవరాజ్ భరణి ధరన్ డైరెక్షన్ లో ఈ సినిమాను నరేశ్ బాబు నిర్మించారు.
జబర్దస్త్ టీవీ షో తో పాపులారిటీ సంపాదించుకున్న రాంప్రసాద్ హీరోగా నటించిన క్రైమ్ ధ్రిల్లర్ 'వైఫాఫ్ అనిర్వేష్'. దీనిని గంగ సప్త శిఖర డైరెక్ట్ చేశారు. త్రిగుణ్ గా పేరు మార్చుకున్న అరుణ్ అదిత్, మేఘా చౌదరి జంటగా నటించిన వినోదాత్మక చిత్రం 'జిగేల్'. ఇది మార్చి 7న విడుదల కాబోతోంది. యంగ్ హీరో అంకిత్ కొయ్య, శ్రియా కొంతం జంటగా నటించిన హెలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ '14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో' మూవీ. సెన్సిబుల్ మెసేజ్ ఇస్తూనే ఆద్యంతం నవ్వించేలా శ్రీహర్ష రూపొందించిన ఈ సినిమా మార్చి 7నే వస్తోంది. ఇవి కాకుండా స్ట్రయిట్ తెలుగు సినిమాలు 'పౌరుషం, నీరుకుళ్ళ' కూడా మార్చి ఏడవ తేదీ విడుదల అవుతున్నాయి.
నాలుగు భాషల డబ్బింగ్ సినిమాలు
విశేషం ఏమంటే... ఈ వారాంతంలో హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన నాలుగు అనువాద చిత్రాలు సైతం తెలుగులో విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే హిందీలో సంచలన విజయం సాధించిన 'ఛావా' (Chhaava) మూవీని తెలుగులో డబ్ చేసి గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ జనం ముందుకు తీసుకొస్తోంది. ఇప్పటికే మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించిన కుంచాకో బోబన్, ప్రియమణి సినిమా 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' అనే పేరుతో తెలుగులో డబ్ చేసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ 7న రిలీజ్ చేస్తోంది. ఇదిలా ఉంటే... ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటించిన కన్నడ చిత్రం 'రాక్షస' కన్నడ భాషతో పాటు తెలుగులోనూ ఈ నెల 7న రిలీజ్ అవుతోంది. ఇక ప్రముఖ సంగీత దర్శకుడు, కథానాయకుడు జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన సినిమా 'కింగ్ స్టన్' (Kingston). సీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ ఫాంటసీ హారర్ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ మార్చి 7న జనం ముందుకు వస్తోంది. ఇది నటుడిగా జీవీ ప్రకాశ్ కుమార్ కు 25వ చిత్రం. ఇలా ఈ వీకెండ్ లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రీ-రిలీజ్ ను కలుపుకోకుండానే 12 సినిమాలు విడుదల కాబోతున్నాయి.
Also Read: Vibe: సందీప్ కిషన్ అవుట్... రాజా గౌతమ్ ఇన్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి