Photo Talks: కృష్ణుడు లేడు... పాండవులున్నారు...
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:30 PM
'మనవూరి పాండవులు' పబ్లిసిటీ కోసం ఇలా మురళీమోహన్ (Murali Mohan) ను పీట మీద ఎక్కించి, ఆయన కుడివైపు భానుచందర్ (Bhanuchandar), చిరంజీవి (Chiranjeevi)ని , ఎడమవైపు ప్రసాద్ బాబు (Prasad Babu), విజయ్ భాస్కర్ (Vijay Bhaskar) ను నిలిపారు.
'మనవూరి పాండవులు' పబ్లిసిటీ కోసం ఇలా మురళీమోహన్ (Murali Mohan) ను పీట మీద ఎక్కించి, ఆయన కుడివైపు భానుచందర్ (Bhanuchandar), చిరంజీవి (Chiranjeevi)ని , ఎడమవైపు ప్రసాద్ బాబు (Prasad Babu), విజయ్ భాస్కర్ (Vijay Bhaskar) ను నిలిపారు. స్టిల్ ఫోటోగ్రాఫర్ శ్యామలరావు (Syamala Rao) తీసిన ఈ పిక్ ను ఉపయోగించి పబ్లిసిటీలో భలే జిమ్మిక్స్ చేశారు పబ్లిసిటీ డిజైనర్ గంగాధర్ (Gangadhar). కన్నడలో రావు బహద్దూర్ రాసిన కథతో పుట్టన్న కణగల్ (Puttanna Kanagal) తెరకెక్కించిన 'పడువారల్లి పాండవరు' మంచి విజయం సాధించిది. ఆ సినిమా ఆధారంగానే తెలుగులో 'మనవూరి పాండవులు' రూపొందింది. ఈ చిత్రాన్ని రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju), తన మిత్రుడు ప్రముఖ మేకప్ మేన్ జయకృష్ణ (Jayakrishna)తో కలసి నిర్మించారు. బాపు (Bapu) దర్శకత్వంలో రూపొందిన 'మనవూరి పాండవులు' వాల్ పోస్టర్స్ లో ఇలా పాండవులు నించున్న పిక్ జనాన్ని బాగా ఆకర్షించింది. కృష్ణంరాజు ఇందులో కృష్ణుని పోలిన పాత్రను ధరించారు. తెలుగులో విజయం సాధించిన ఈ చిత్రకథతోనే బాపు దర్శకత్వంలో 'హమ్ పాంచ్' (Hum Panch)గా హిందీలో రీమేక్ అయింది. నిర్మాతగా బోనీ కపూర్ (Boney Kapoor) కు 'హమ్ పాంచ్' తొలి చిత్రం కావడం విశేషం! 'హమ్ పాంచ్'లో కృష్ణుని పాత్రలో సంజీవ్ కుమార్ నటించగా, అందులో భీమ్ పాత్రను మిథున్ చక్రవర్తి ధరించారు. 'హమ్ పాంచ్' కూడా మంచి ఆదరణ పొందింది.
'మనవూరి పాండవులు'లో పార్థుగా నటించిన చిరంజీవి తరువాతి రోజుల్లో మెగాస్టార్ అయ్యారు. అందువల్ల రీ-రిలీజ్ పోస్టర్స్ లో చిరంజీవి బొమ్మను పెద్దగా పబ్లిసిటీలో ఉపయోగించేవారు. 'మనవూరి పాండవులు'లో పాండవులుగా నటించిన మురళీమోహన్ ప్రస్తుతం 85 ఏళ్ళ వయసులో అడపాదడపా నటిస్తున్నారు. భీమునిగా నటించిన ప్రసాద్ బాబు కూడా కేరెక్టర్ రోల్స్ లో కనిపిస్తారు. చిరంజీవి ఇప్పటికీ స్టార్ హీరోగానే సాగుతున్నారు. నకుల సహదేవుల పోలిన పాత్రల్లో కనిపించిన భానుచందర్, విజయ్ భాస్కర్ కూడా అప్పుడప్పుడూ తెరపై కనిపిస్తుంటారు. అయితే వీరిలో మురళీమోహన్, చిరంజీవి, భానుచందర్ తెలుగులో హీరోలుగా తమదైన బాణీ పలికించారు. కృష్ణుని పాత్ర పోషించిన కృష్ణంరాజు ప్రస్తుతం మన మధ్య లేరు.