Mahesh Babu: తగ్గేదే లే అంటున్నాడుగా...

ABN , Publish Date - Mar 22 , 2025 | 04:03 PM

సహజంగా హీరోలకు పలు ఆంక్షలు విధించే రాజమౌళి... మహేశ్ బాబు విషయంలో మాత్రంకాస్తంత పట్టువిడుపు ప్రదర్శిస్తున్నట్టు అర్థమౌతోంది.

దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) ఎరినాలోకి వెళితే... ఆయన రూల్సే ఫాలో కావాలి. జక్కన్నతో సినిమా అంటే ఆయన చెప్పిన నిబంధనలే ఆచరించాలి. 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను' అని మహేశ్‌ బాబు (Mahesh Babu) 'పోకిరి'లో చెప్పిన డైలాగ్ నిజానికి రాజమౌళికి వర్తిస్తుందని ఆయనతో సినిమాలు చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చెబుతుంటారు. ఒక్కసారి ఒక మాట చెప్పాడంటే... అదే ఆయన టీమ్ కు శాసనం అని కూడా అనుకుంటూ ఉంటారు. అలాంటి రాజమౌళి శాసనాన్ని ఇప్పుడు మహేశ్ బాబు ధిక్కరించాడనే వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. మహేశ్ బాబు తన కూతురు సితార (Sitara) తో కలిసి ట్రెండ్స్ కు చేసిన వాణిజ్య ప్రకటన బయటకు వచ్చిన దగ్గర నుండి ఈ రూమర్స్ కు రెక్కలు వచ్చేశాయి.


నిజానికి రాజమౌళి తాను ఏ హీరోతో సినిమా చేసినా... చాలా ఆంక్షలు పెడతాడని చెప్పుకుంటారు. బయట ఎక్కువగా ఎక్స్ పోజ్ కాకూడదని, ఎక్కువగా ఫోటో షూట్స్ చేయకూడదని, వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉండదలని చెబుతాడట. అలా చేస్తే మూవీ గెటప్ రివీల్ అయిపోతుందని భావిస్తాడట. మహేశ్ బాబు కూడా ఆ మధ్య పబ్లిక్ లో కనిపించకపోయే సరికీ చాలామంది రాజమౌళి రూల్స్ బుక్ ను మహేశ్ ఫాలో అయ్యి పబ్లిక్ అప్పీయరెన్స్ తగ్గించేశాడని భావించారు. పైగా ఎప్పుడూ లేని విధంగా మహేశ్ బాబు భారీగా గడ్డం పెంచేసరికీ ఈ కొత్త లుక్ లో అతను ఎలా ఉంటాడో చూడాలని అప్పట్లో అభిమానులు తహతహలాడిపోయారు. కానీ మహేశ్ బాబు ముఖం కనిపించకుండా క్యాప్ పెట్టుకునో, గడ్డానికి అడ్డంగా చెయ్యి పెట్టుకునో ఎయిర్ పోర్ట్ లో మెరుపులా మెరిసి మాయమైపోయే వాడు. అలాంటి వ్యక్తి ఆ మధ్య సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు ఫోటోలకు ఫోజులిచ్చాడు. అందులోని మహేశ్ బాబు గడ్డాన్ని చూసి... అతన్ని యేసు క్రీస్తుతో పోల్చి మీమ్స్ చేసిన వాళ్ళూ ఉన్నారు. దాంతో రాజమౌళి... మహేశ్ బాబును ఇక మీద పబ్లిక్ లో కనిపించవద్దని కోరినట్టుగానూ వార్తలు వచ్చాయి.


ఇదిలా ఉంటే... టాలీవుడ్ లో అత్యధికంగా వాణిజ్య ప్రకటనల్లో కనిపించే మహేశ్ బాబు లేటెస్ట్ గెటప్ తోనే ట్రెండ్స్ కు ఓ యాడ్ చేశాడు. అందులో అతని కూతురు సితార కూడా నటించింది. ఇదిప్పుడు ప్రసారం అవుతోంది. దాంతో రాజమౌళి ఒట్టును తీసి మహేశ్ బాబు గట్టున పెట్టేశాడా అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరైతే రెండు భాగాలుగా తెరకెక్కబోతున్న రాజమౌళి సినిమా పూర్తయ్యే వరకూ మహేశ్ ను యాడ్స్ లో నటించవద్దంటే ఎలా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఫస్ట్ పార్ట్ 2027లోనూ, సెకండ్ పార్ట్ 2029లోనూ వస్తుందంటున్నారు. అప్పటి వరకూ కమర్షియల్ యాడ్స్ కు మహేశ్‌ దూరంగా ఉండటం అనేది అయ్యే పనేనా అని మరికొందరు అడుగుతున్నారు. పైగా ఈ సినిమా కమిట్ కాకముందే మహేశ్ పలు బ్రాండ్స్ తో ఒప్పందం కుదుర్చుకుని ఉంటాడు. ఇప్పుడీ సినిమా కోసం ఆ ఎగ్రిమెంట్స్ ను రద్దు చేసుకునే ఆస్కారం ఉండదు. సో... ఈ విషయాలను గమనించే రాజమౌళి... మహేశ్ బాబు కు మాత్రం మినహాంపు ఇచ్చి ఉంటాడని ఫిల్మ్ నగర్ టాక్. మొత్తం మీద రాజమౌళి... మహేశ్ బాబు దగ్గరకు వచ్చేసరికీ కొంత పట్టువిడుపులను ప్రదర్శిస్తున్నట్టు అర్థమౌతోంది.

Also Read: Nidhhi Agerwal: హీరోతో డేటింగ్‌ కుదరదన్నారు.. అప్పుడు అర్థం కాలేదు...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 22 , 2025 | 04:03 PM