Adurthi Subbarao: 60 యేళ్ళ కృష్ణ తేనెమనసులు
ABN , Publish Date - Mar 31 , 2025 | 04:22 PM
సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన తొలి చిత్రం 'తేనె మనసులు'. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలై 60 యేళ్ళు పూర్తయ్యింది.
అంతకుముందు కృష్ణ (Krishna) 'కులగోత్రాలు, పదండి ముందుకు, పరువు-ప్రతిష్ఠ' వంటి చిత్రాల్లో బిట్ రోల్స్ లో కనిపించారు. ఆ పై ఆదుర్తి సుబ్బారావు (Adurthi Subba Rao) కొత్తవారితో 'తేనెమనసులు' (Tene Manasulu) తీస్తున్నారని తెలియగానే ప్రయత్నించారు కృష్ణ. ఆయనతో పాటు రామ్మోహన్ (Rammohan), సుకన్య (Sukanya), సంధ్యారాణి (Sandhya Rani) వంటివారు కూడా 'తేనెమనసులు'లో సెలెక్ట్ అయ్యారు. ఈ సినిమాను రంగుల్లో రూపొందించారు. తెలుగునాట కలర్ లో తెరకెక్కిన తొలి సాంఘిక చిత్రంగా 'తేనెమనసులు' నిలచింది. 1965 మార్చి 31న విడుదలైన 'తేనెమనసులు' మంచి ఆదరణ పొందింది.. ఇందులో హీరోలుగా నటించిన కృష్ణ, రామ్మోహన్ కు మంచిపేరు లభించింది.
నిజం చెప్పాలంటే 'తేనెమనసులు'లో కృష్ణ పాత్ర కంటే రామ్మోహన్ రోల్ కు ఎక్కువ ప్రాధాన్యముంటుంది. రామ్మోహన్ నటన గురించి అప్పట్లో పలువురు ప్రశంసించారు. అయితే కొందరు రామ్మోహన్ ఏయన్నార్ ను ఇమిటేట్ చేస్తూ నటించారని, కృష్ణ తనకు దక్కిన పాత్రలో సొంత నటన కనబరిచారని విశ్లేషించారు.. ఈ సినిమా తరువాత ఆదుర్తి తెరకెక్కించిన 'కన్నెమనసులు'లోనూ ఇందులోని నలుగురు ప్రధాన పాత్రధారులు నటించడం విశేషం!. 'తేనెమనసులు' శతదినోత్సవం జరుపుకుంది. తరువాతి సినిమా అంతగా మురిపించలేకపోయింది..కేవీ మహదేవన్ సంగీతం, ఆత్రేయ, దాశరథి పాటలు 'తేనెమనసులు'కు అస్సెట్ గా నిలిచాయి. ఈ సినిమాను బాబూమూవీస్ బ్యానర్ పై సి.సుందరం ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. పాటలన్నీ కనువిందు చేసేలా తెరకెక్కించారు ఆదుర్తి సుబ్బారావు. అప్పటికే కొన్ని నవలా చిత్రాలను రూపొందించిన ఆదుర్తి సుబ్బారావు ఈ సినిమాను కూడా అదే తీరున తెరకెక్కించారు. కె.ఆర్.కె.మోహన్ రాసిన 'వక్రించిన సరళరేఖలు' ఆధారంగా 'తేనెమనసులు' రూపొందింది.
'తేనెమనసులు', 'కన్నెమనసులు' తరువాత కృష్ణ 'గూఢచారి 116'లో నటించేసి మాస్ హీరో అనిపించుకున్నారు. ఆ తరువాత ఆయన మరి వెనుదిరిగిచూసుకోలేదు. తనన హీరోని చేసిన ఆదుర్తి సుబ్బారావు అంటే కృష్ణకు ఎనలేని గౌరవం ఉండేది. కృష్ణ స్టార్ హీరో అయిన తరువాత గురువు ఆదుర్తి కోరగానే ఆయన సొంత చిత్రం 'మాయదారి మల్లిగాడు'లో నటించారు. ఆ సినిమా మంచి ఆదరణ పొందింది.. కృష్ణకు నటునిగానూ మంచి పేరు సంపాదించి పెట్టింది.. 'తేనెమనసులు'తో హీరోగా ఆరంభమైన కృష్ణ నటజీవితం ఐదు దశాబ్దాలకు పైగా సాగింది. తెలుగునాట అత్యధిక చిత్రాలలో నటించిన ప్రముఖ హీరోగా కృష్ణ నిలిచారు. ఆ పై ఆయన వందలాది చిత్రాల్లో నటించినా, కృష్ణ ఫ్యాన్స్ మాత్రం ఈ నాటికీ 'తేనెమనసులు'ను గుర్తు చేసుకుంటూనే ఉండడం విశేషం!
Also Read: Nithin: 'తమ్ముడు'తో ఒడ్డుకు చేరతాడా!?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి