ఒక్కరూ ‘ఐ లవ్ యూ’ చెప్పలేదు
ABN , Publish Date - Apr 19 , 2025 | 03:32 AM
మణిరత్నం దర్శకత్వంలో తాను హీరోగా నటించిన ‘థగ్‌లైఫ్’ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించారని, వారిలో ఏ ఒక్కరూ తనకు ఐ లవ్ యూ చెప్పలేదని అగ్ర నటుడు కమల్ హాసన్ చమత్కరించారు. రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్...
మణిరత్నం దర్శకత్వంలో తాను హీరోగా నటించిన ‘థగ్‌లైఫ్’ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించారని, వారిలో ఏ ఒక్కరూ తనకు ఐ లవ్ యూ చెప్పలేదని అగ్ర నటుడు కమల్ హాసన్ చమత్కరించారు. రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం జూన్ 5న విడుదలకానుంది. శుక్రవారం చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో మూవీలోని తొలి పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మణిరత్నం, కమల్ హాసన్, ఏఆర్ రెహ్మాన్, శింబు, త్రిష, అభిరామి తదితరులు పాల్గొన్నారు. ఇందులో కమల్ హాసన్ మాట్లాడుతూ, ‘మణిరత్నం దర్శకత్వంలో 37 యేళ్ళ క్రితం ‘నాయగన్’ చిత్రంలో నటించాను. ఆయనలో అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. అది ఆయన గొప్పతనం. త్రిష, అభిరామి హీరోయిన్లుగా నటించారు. వారిలో ఒక్కరు కూడా ఐ లవ్ యూ చెప్పలేదు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం నా మనసుకు దగ్గరగా ఉంటుంది. చిత్రపరిశ్రమలో హీరో శింబు లాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు. ఈ సినిమాలో భాగమైన అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు భారతీయ చిత్రపరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందింది. తమిళం తర్వాత భారతీయ అనుసంధాన భాష ఆంగ్లమే’ అని కమల్ హాసన్ స్పష్టం చేశారు. దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ, ‘చాలా సంవత్సరాల తర్వాత కమల్‌తో పనిచేసే అవకాశం వచ్చింది. ఆయన గొప్ప నటుడు. సినిమాను ప్రేమిస్తారు. షూటింగ్ సమయంలో ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’ అన్నారు. హీరోయిన్ త్రిష మాట్లాడుతూ, ‘‘థగ్‌లైఫ్’ మూవీలో కమల్ వంటి గొప్ప నటుడితో స్ర్కీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అన్నారు. హీరో శింబు మాట్లాడుతూ, ‘ఎంతో మంది గొప్ప నటులు ఈ సినిమా కోసం పనిచేశారు. వారితో కలిసి నటించినందుకు ఆనందంగా ఉంది. ఏఆర్ రెహ్మాన్ నాకు గురువుతో సమానం’ అన్నారు. ఏఆర్ రెహ్మాన్ మాట్లాడుతూ, ‘కమల్ - మణిరత్నంలది హిట్ కాంబినేషన్. ఈ సినిమా పాటల్లో ఒక మేజిక్ ఉంది. ఈ పాటలు ఎంతగానో ఆలరిస్తాయి. నాలుగు నెలలుగా సినిమా కోసం శ్రమిస్తున్నాం’ అన్నారు.
చెన్నై, (ఆంధ్రజ్యోతి)