Chiranjeevi : 35 సంవత్సరాల తర్వాత త్రీడీలో చిరు మూవీ
ABN , Publish Date - Apr 26 , 2025 | 05:37 PM
మూడున్నర దశాబ్దాల క్రితం మే 9న విడుదలై, అఖండ విజయాన్ని అందుకుంది 'జగదేక వీరుడు - అతిలోక సుందరి ' చిత్రం. ఇప్పుడు అదే తేదీన ఈ సినిమాను 'త్రీడీ'లోనూ విడుదల చేయబోతున్నారు నిర్మాత అశ్వనీదత్.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అందాల భామ శ్రీదేవి (Sridevi) జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'జగదేక వీరుడు - అతిలోక సుందరి' (Jagadeka Veerudu Athiloka Sundari). 1990 మే 9న విడుదలైన ఈ సినిమా తుఫాన్ కు ఎదురొడ్డి విజయ పతాకాన్ని ఎగరేసింది. మండు వేసవిలో ఈ సినిమా విడుదలైనా... అదే సమయంలో ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ ను తుఫాన్ అతలాకుతులం చేసింది. ఆ సమయంలోనూ చిరంజీవి అభిమానులు ఈ సినిమాను విశేషంగా ఆదరించారు. భారీ ఓపెనింగ్స్ రావడంతో పాటు ఆ ఇయర్ లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కె. రాఘవేంద్రరావు (K Raghavendra Rao) దర్శకత్వ ప్రతిభ, అశ్వినీదత్ ప్రొడక్షన్ వాల్యూస్, ఇళయరాజా (Ilayaraja) సంగీతం, ఎ. విన్సెంట్, కె.ఎస్. ప్రకాశ్ సినిమాటోగ్రఫీ ఈ మూవీ విజయానికి బలాన్ని చేకూర్చాయి. అప్పటి నుండి ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని అశ్వనీదత్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తోనూ అలాంటి సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఇవేవీ ఇంకా కార్యరూపం దాల్చలేదు.
సోషియో ఫాంటసీ మూవీ 'జగదేక వీరుడు - అతిలోక సుందరి' విడుదలై 35 సంవత్సరాలు పూర్తి అవుతున్న నేపథ్యంలో ఈ యేడాది మే 9న ఈ చిత్రాన్ని 2డీతో పాటు 3డీలోనూ భారీ స్థాయిలో విడుదల చేయబోతోంది వైజయంతి మూవీస్ సంస్థ. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా తెలిపారు. మే 9వ తేదీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 'హరి హర వీరమల్లు' సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ దాని విడుదల వాయిదా పడిందని, అందువల్లే 'జగదేక వీరుడు - అతిలోక సుందరి' మూవీని గ్రాండ్ గా అశ్వనీదత్ రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది. అలానే రవితేజ (Raviteja) 'మాస్ జాతర', శ్రీవిష్ణు (Srivishnu) 'సింగిల్', సమంత (Samantha) నిర్మిస్తున్న 'శుభం' చిత్రాలు సైతం మే 9న విడుదల కానున్నాయి. అయితే ఇందులో రవితేజ 'మాస్ జాతర' విడుదల కాకపోవచ్చునని అంటున్నారు. చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' చిత్రం విడుదల విషయంలో ఇంకా క్లారిటీ రాని నేపథ్యంలో మరోసారి 'జగదేక వీరుడు - అతిలోక సుందరి'ని చూడగలగడం, అదీ త్రీడీ చూడబోవడం అభిమానులకు పండగే!
Also Read: Sunil: తమిళ రాజకీయ నాయకుడిగా సునీల్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి