స్మగ్లర్లలను హీరోలుగా చూపడం సరికాదు

ABN , Publish Date - Mar 03 , 2025 | 02:36 AM

‘పాత సినిమాల్లో చివరకు హీరో చేతిలో విలన్‌ అంతమయ్యేవాడు. లేదంటే రాజమండ్రి సెంట్రల్‌ జైలుకెళ్లేవాడు. ఇప్పుడు నెగిటివ్‌ క్యారెక్టర్‌లను సైతం...

‘పాత సినిమాల్లో చివరకు హీరో చేతిలో విలన్‌ అంతమయ్యేవాడు. లేదంటే రాజమండ్రి సెంట్రల్‌ జైలుకెళ్లేవాడు. ఇప్పుడు నెగిటివ్‌ క్యారెక్టర్‌లను సైతం హీరోలుగా చూపిస్తున్నారు. స్మగ్లర్‌లు, దేశ ద్రోహులకు హీరోయిజాన్ని ఆపాదించడం సరికాదు. ఆ పాత్ర ల్లో హీరోలు గొప్పగా నటించినంత మాత్రాన వాటిని ఆదర్శంగా చూపించడం సమంజసం కాదు. ఈ తరం అర్థవంతమైన సినిమాలు తీయాలి. ప్రమాణాలు పాటించాలి’ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సీనియర్‌ నటి కృష్ణవేణి సంస్మరణ సభను ఫిల్మ్‌నగర్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. చలన చిత్ర నటిగా, నిర్మాతగా, నేపథ్య గాయనిగా, శోభనాచల స్టూడియో అధినేతగా కృష్ణవేణి తెలుగు సినిమా రంగంలో ఓ సువర్ణాధ్యాయం లిఖించారని ఆయన కొనియాడారు. ‘మనదేశం’ చిత్రంలో నందమూరి తారకరామారావును పరిచయం చేసిన ఘనత ఆమెకే దక్కింద న్నారు. అలాగే మీర్జాపురం రాజా, కృష్ణవేణి దంపతుల వల్లనే ‘కీలుగుర్రం’ చిత్రంతో అక్కినేని నాగేశ్వరరావుకి స్టార్‌ స్టేటస్‌ వచ్చిందని వెంకయ్య నాయుడు చెప్పారు.


‘మా తండ్రిగారిని సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణవేణమ్మ సంస్మరణ సభలో మేం కూడా భాగస్వాములైనందుకు గర్విస్తున్నాం’ అని నందమూరి మోహన కృష్ణ, రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో అక్కినేని రమేశ్‌ ప్రసాద్‌, మురళీ మోహన్‌, డా.పరుచూరి గోపాల కృష్ణ, నిర్మాతలు కె.ఎ్‌స.రామారావు, కైకాల నాగేశ్వరరావు, తుమ్మల ప్రసన్న కుమార్‌, కాట్రగడ్డ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - Mar 03 , 2025 | 02:36 AM