జూన్ 2న ఇళయరాజాకు సన్మానం
ABN , Publish Date - Mar 28 , 2025 | 02:25 AM
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాను తమిళనాడు ప్రభుత్వం జూన్ రెండో తేదీన సన్మానించనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం శాసనసభలో ప్రకటించారు. ఇళయరాజా 50 ఏళ్ల సినీ...
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాను తమిళనాడు ప్రభుత్వం జూన్ రెండో తేదీన సన్మానించనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం శాసనసభలో ప్రకటించారు. ఇళయరాజా 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆయన పుట్టిన రోజైన జూన్ రెండో తేదీన ఈ వేడుకలను నిర్వహించనున్నట్టు సీఎం చెప్పారు. వీసీకే సభ్యుడు చింతనై సెల్వం మాట్లాడుతూ.. ‘సంగీత దర్శకుడు ఇళయరాజా తన సింఫనీ అరంగేట్రం కార్యక్రమాన్ని లండన్ వేదికగా విజయవంతంగా పూర్తి చేశారని, ఆ సింఫనీని తమిళ ప్రజలు వినేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందా? అని ప్రశ్నించారు. దీనికి సీఎం స్టాలిన్ సమాధానమిస్తూ.. ‘సింఫనీ అరంగేట్రాన్ని పూర్తి చేసుకుని వచ్చిన ఇళయరాజాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సాదర స్వాగతం పలికాం. సింఫనీ కార్యక్రమాన్ని రాష్ట్రంలో నిర్వహించాలని కోరాం. తక్షణం 4 వేల మంది కళాకారులను రాష్ట్రానికి పిలిపించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం శ్రమతో కూడుకున్నపని అని ఇళయరాజా అన్నారు’ అని సీఎం తెలిపారు.
చెన్నై (ఆంధ్రజ్యోతి)