Renu Desai: అలా ఎలా తీశారో.. ఆ సినిమా చూస్తూ ఏడ్చేశా..
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:44 PM
నటి రేణు దేశాయ్ ఎప్పుడూ కూడా ఒక సినిమా చూశాను, అందరూ ఆ సినిమా చూడాలి అని చెప్పలేదు. కానీ ఇప్పుడొక సినిమాలో తను నటించకపోయినప్పటికీ.. ఆ సినిమా అందరూ చూడాలని కోరుతున్నారు. ఆ సినిమా అంతలా తనని కదిలించిందని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ సినిమా ఏది అనే వివరాల్లోకి వెళితే..
రమణ విల్లర్ట్ ఆ మధ్య ఓ కథ చెప్పారు.. ఆ కథతోనే సినిమా తీశారు. ఆ సినిమా ఎలా ఉందో చూద్దామని వెళితే.. ఏడిపించేసింది. అంత అద్భుతంగా సినిమా తీశారని అన్నారు నటి రేణు దేశాయ్. ఇంతకీ ఆ సినిమా ఏది? ఏంటా కథ అని వివరాల్లోకి వెళితే.. అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ ఫేమ్ దివి, మేఘన శ్రీనివాస్, వినయ్ కీలక పాత్రల్లో విల్లర్ట్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘1000 వర్డ్స్’. ఈ సినిమాకు రమణ విల్లర్ట్ నిర్మాతగా వ్యవహరిస్తూనే దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. డా.సంకల్ప్ కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకు శివ కృష్ణ సంగీతం అందించారు. సినీ ప్రముఖుల కోసం సోమవారం ఈ మూవీని స్పెషల్‌గా ప్రదర్శించారు. ఈ షోని చూసేందుకు రేణు దేశాయ్ హాజరయ్యారు.
సినిమా చూసిన అనంతరం రేణు దేశాయ్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఆమె మాట్లాడుతూ.. రమణ నాకు ఫోటోగ్రాఫర్‌గా తెలుసు. ఆయన ఓ కథ చెప్పాడు. బాగానే అనిపించింది. కానీ ఎలా తీసి ఉంటారా? అని అనుకున్నాను. ఈ మూవీ చూశాక అద్భుతంగా అనిపించింది. ఇది అందరికీ రీచ్ అవ్వాలి. అందరూ చూడాల్సిన, అందరికీ తెలియాల్సిన సినిమా. ఒక్క ఫోటో మీద ఇంత మంచి కథను రాసుకుని తీయడం మాములు విషయం కాదు. సినిమా చూశాక నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా చిత్రీకరించారు. ఇంత మంచి సినిమాను తీసిన టీంకు ఆల్ ది బెస్ట్. రమణకు ఇది ఆరంభం మాత్రమే. ఆయన నుండి ఇంకా ఇలాంటి మంచి చిత్రాలు రావాలని ఆశిస్తున్నానని తెలిపారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కూడా ఈ చిత్రం అద్భుతంగా ఉందని, అందరినీ కంటతడి పెట్టించారని చెబుతూ.. చాలా రోజుల తర్వాత ఓ చక్కటి సినిమా చూసిన ఫీలింగ్ కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు.
Also Read- Naga Vamsi: తప్పుగా మాట్లాడలేదు.. వివాదంపై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ
‘‘గత 20 ఏళ్లుగా నేను ఓ మంచి సినిమాను చేయాలని తపిస్తూనే ఉన్నాను. నాకు కథలు రాయడం రాదు. నేను చాలా కథలు వింటూ వచ్చాను. అప్పుడే సంకల్ప్ ఈ కథతో వచ్చారు. ఓ తల్లి బిడ్డను కనేప్పుడు పడే బాధను చెప్పాలని, చూపించాలనే ఈ సినిమాను తీశాం. పురిటి నొప్పుల్ని డబ్బింగ్‌లో చూపించడంతో కన్నీళ్లు వచ్చాయి. అరవింద్‌కి కథ చెప్పిన వెంటనే ఒప్పుకున్నారు. కథ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని అన్నారు. దివి నటన చూసి అంతా ఫిదా అవుతున్నారు. దివి చాలా అందంగా ఉండటమే కాదు అంతే అద్భుతంగా నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ విజయ్ అలియాస్ నూరీ నటన చూసి నాకు ముచ్చట వేసింది. ఎంత చదువుకుంటావో చదువుకో నేనుంటాను అని మాటిచ్చాను. నాకు ఆ పిల్లాడు అంతగా నచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్ శివ కృష్ణ ఇచ్చిన ట్యూన్‌కు కీరవాణి తండ్రి గారు శివశక్తి దత్తా అద్భుతంగా రాశారు. లక్ష్మీ భూపాల రెమ్యూనరేషన్ లేకుండా పాట రాసిచ్చారు. శివ రామ్ చరణ్ ఫ్రేమ్స్ చూసి నాకు అద్భుతంగా అనిపించింది. తొమ్మిది నెలలు నాతో పాటు జర్నీ చేశాడు. ఓ ఫోటోగ్రాఫర్‌కు నచ్చేలా సినిమాటోగ్రాఫర్ పని చేయడం మామూలు విషయం కాదు. సంకల్ప్ నాకు ఎన్ని వర్షెన్స్ కావాలంటే అన్ని వర్షెన్స్ ఇచ్చాడు. ఎడిటర్ మనోజ్ మాకు అద్భుతంగా ఎడిట్ చేసి ఇచ్చాడు. రేణూ దేశాయ్ నాకు సోదరి వంటి వారు. ఆమెకు ఈ కథ చెప్పగానే ఎమోషనల్ అయ్యారు. ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేస్తానని ఆమె ముందుకు వచ్చారు. నేను మొదటి ప్రయత్నం చేశాను. చూసిన వారంతా తప్పులు చెప్పండి. వాటిని తెలుసుకుని సరిదిద్దుకుంటాను’’ అని డైరెక్టర్, నిర్మాత రమణ విల్లర్ట్ చెప్పుకొచ్చారు.
‘నా మూడేళ్ల కొడుకు అధ్విక్ కృష్ణ మొదటి సారి నా సినిమాను స్క్రీన్ మీద చూశాడు. అందుకే ఈ మూవీ నాకెంతో ప్రత్యేకమని హీరో అరవింద్ కృష్ణ అంటే.. ఒక మంచి మూవీలో చేసినందుకు ఆనందంగా ఉందని అన్నారు దివి, మేఘన. ఇంకా పలువురు ప్రముఖులో ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.