Krrish 4 movie Update: హిట్ జోడీ మళ్లీ
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:50 AM
హృతిక్ రోషన్ నటించి దర్శకత్వం వహిస్తున్న 'క్రిష్ 4' సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రియాంక చోప్రా మరోసారి కథానాయికగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి
హృతిక్ రోషన్ కథానాయకుడిగా ‘క్రిష్’ ఫ్రాంచైజీలో వచ్చిన మూడు చిత్రాలు ఘన విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు కొనసాగింపుగా ‘క్రిష్ 4’ వస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో హృతిక్‌రోషన్ కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. హృతిక్‌కు జోడీగా నటించబోయే హీరోయిన్‌ల జాబితాలో ఇప్పటివరకూ పలువురి పేర్లు వినిపించాయి. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన గత చిత్రాల్లో కథానాయికగా నటించారు ప్రియాంక చోప్రా. వీరిద్దరిదీ విజయవంతమైన జోడీగా నిలిచింది. ఇప్పుడు ‘క్రిష్ 4’లోనూ ఆమె భాగమవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇటీవలే ప్రియాంకచోప్రా, ఆమె భర్త నిక్ జొనాస్‌ను కలసినట్లు హృతిక్ తెలిపారు. దీంతో ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక చోప్రా నటించడం దాదాపు ఖాయమైనట్లే అని భావిస్తున్నారు. ఆమె ప్రస్తుతం రాజమౌళి-మహేశ్‌బాబు చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ‘క్రిష్ 4’లో హృతిక్ మూడు పాత్రలు పోషించనున్నారనీ, ప్రీతిజింటా, రేఖ, వివేక్ ఒబెరాయ్ కీలకపాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2026 ప్రారంభంలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.