Tollywood: తెలుగు చిత్రసీమలో తారాజువ్వ

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:13 PM

'అశోకవనంలో అర్జున కళ్యాణం' ఫేమ్ రితికా నాయక్ కు వరుసగా తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే రెండు సినిమాల్లో నటిస్తున్న రితిక మరో రెండు చిత్రాలలో ఛాన్స్ దక్కించుకుంది.

తెలుగు సినిమా రంగంలో తారాజువ్వలా ఉవ్వెత్తున దూసుకుపోతోంది అందాల భామ రితికా నాయక్ (Rithika Nayak). విశ్వక్ సేన్ (Vishwaksen) 'అశోక వనంలో అర్జున కళ్యాణం' మూవీలో తొలిసారి నటించినప్పుడే తెలుగు దర్శక నిర్మాతల దృష్టిలో ఆమె పడింది. అప్పటి నుండి వరుసగా రితికా నాయక్ కు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. అప్పట్లోనే ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) 'డ్యూయెట్' (Duet) మూవీలో రితిక హీరోయిన్ గా ఎంపికైంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి, కేఈ జ్ఞానవేల్ రాజాతో కలిసి నిర్మిస్తున్నారు. అయితే... ఈ సినిమా షూటింగ్ అనుకున్నంత వేగంగా మాత్రం సాగడం లేదు. ఇదే సమయంలో రితికా నాయక్... పాన్ ఇండియా మూవీ 'మిరాయ్' (Mirai) లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కూడా పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈ యేడాది ఆగస్ట్ 1న జనం ముందుకు రాబోతోంది. దీనిని పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అప్పట్లోనే గీతా ఆర్ట్స్ సంస్థలోనూ రితికా నాయక్ కు కొన్ని ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ దక్కబోతోందంటూ వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా మాత్రం ఏ ప్రకటన రాలేదు.


ఇదిలా ఉంటే ఇప్పుడు వరుసగా రెండు ఆఫర్స్ ను రితికా నాయక్ చేజిక్కించుకుంది. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టిన వరుణ్ తేజ్ (Varun Tej) 'కొరియన్ కనకరాజు' మూవీలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదే సమయంలో ఆమెకు హీరో గోపీచంద్ (Gopichand) మూవీలోనూ నటించే ఛాన్స్ దక్కినట్టు వార్తలు వస్తున్నాయి. గోపీచంద్ తో గతంలో 'సీటీమార్' (Seetimaarr) మూవీని నిర్మించిన శ్రీనివాస చిట్టూరి... ఇప్పుడు మరో సినిమాను ప్రారంభించారు. ఇటీవలే దీని పూజా కార్యక్రమాలు జరిగాయి. 'ఘాజీ' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దీనికి దర్శకుడు. 7వ శతాబ్దానికి చెందిన ఓ యదార్థ గాథను భారీ స్థాయిలో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించబోతున్నాడు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలోనూ రితికా నాయక్ హీరోయిన్ గా ఎంపికైందట. ఇటీవలే గోపీచంద్, రితిక పై ఫోటో షోటో చేశారని తెలుస్తోంది. ఆ రకంగా ఈ రెండు, మూడు సంవత్సరాలలో రితికా నాయక్ నాలుగైదు చిత్రాలతో తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రను వేయబోతోంది.

Also Read: Chhorii 2: ఒళ్ళు గగుర్పొడిచేలా ఛోరీ -2 టీజర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 26 , 2025 | 12:13 PM